జలమున్నా.. భూములు బీడేనన్నా! 

8 Aug, 2019 10:33 IST|Sakshi
హంద్రీ–నీవా కాలువలోకి నీటిని పంప్‌ చేస్తున్న దృశ్యం

గత ప్రభుత్వ నిర్వాకం.. 

హంద్రీ –నీవా ఆయకట్టుకు శాపం 

ఎవరికి వారు నీరు  మళ్లించుకున్న టీడీపీ నేతలు 

సాక్షి, అనంతపురం: హంద్రీ–నీవా సుజలస్రవంతి పథకం ద్వారా భారీగా నీరు వస్తున్నా జిల్లాలో మాత్రం ఆయకట్టు భూములు బీడుగానే దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు ఒక టీఎంసీ నీటిని తీసుకురావడానికి దాదాపు రూ.7 కోట్లు ఖర్చవుతోంది. ఈ లెక్కన గత పదేళ్లలో రూ.వందల కోట్లు విద్యుత్‌ బిల్లుల కోసమే ఖర్చు చేశారు. ఇంతటి విలువైన కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నా జిల్లా రైతాంగంలో మార్పులు సంభవించాయా అంటే నామమాత్రమేనని చెప్పుకోవాలి. అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు అభివృద్ధికి కొంతమేర సాధ్యపడ్డాయి. అంతేకాని జిల్లాలో బీడు భూములు పండ్లతోటలుగా, మాగానిగా మారలేదు. ఇందుకు కారణం అధికారంలో ఐదేళ్లు ఉన్న టీడీపీ  ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని చెప్పుకోవాలి. ఏనాడు హంద్రీ– నీవా ఆయకట్టును అభివృద్ది చేయాలి, పంటలకు సాగునీరు ఇవ్వాలనే దానిపై దృష్టి సారించలేదు. ఎంతసేపూ తన సొంత నియోజకవర్గం కుప్పంకు నీటిని తీసుకుపోవాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి వారు వారి సొంతనియోజకవర్గంపైనే దృష్టి సారించారు తప్పా హంద్రీనీవా ఆయకట్టు అభివృద్దిపై దృష్టి సారించలేదు. ఫలితంగా హంద్రీనీవా ఆయకట్టు రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరింది.

1.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా..  
2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వైఎస్సార్‌ హయాంలోనే హంద్రీ–నీవా మొదటి దశ దాదాపు పూర్తయింది. ఆయన మరణాంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాకు హంద్రీ–నీవా నీళ్లు వచ్చాయి. 2012లో తొలిసారి జిల్లాకు నీళ్లు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరంతరాయంగా జిల్లాకు వస్తున్నాయి. అత్యధికంగా మూడేళ్ల నుంచి దాదాపు 26 టీఎంసీలకు పైగా నీళ్లు వస్తున్నాయి. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు అయ్యాయి.

ఆయకట్టు అభివృద్ధి చేయొద్దని జీఓ 
ప్రతి నీటి బొట్టూ సద్వినియోగం చేసుకోవడంపై హంద్రీ–నీవా అధికారులు దృష్టి సారించాలి. కానీ అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారం మళ్లించారు. ఎవరికి పలుకుబడి ఉంటే ఆ ప్రాంతానికి ఎక్కువ తీసుకెళ్లడం.. పలుకుబడి లేని ప్రాంతాలకు అసలే విడుదల చేయకపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరిచ్చిన దాఖలాలు లేవు. పైగా హంద్రీ–నీవా ఆయకట్టు అభివృద్ధి చేయరాదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా జీవో కూడా విడుదల చేశారు. దీంతో ఆయకట్టుకు నీరివ్వాలనే అంశం మరుగున పడింది. ఎంతసేపు ఎన్నికల లబ్ధి గురించే టీడీపీ నేతలు ప్రయత్నించారు తప్ప కరువు జిల్లా అభివృద్ధి విషయంపై దృష్టి సారించిన పాపాన పోలేదు.   

మరిన్ని వార్తలు