యూనివర్సిటీ  ప్రకాశించేనా..!

14 Oct, 2019 11:20 IST|Sakshi
ప్రకాశం యూనివర్సిటీ ముఖద్వారం

సాక్షి, ఒంగోలు(ప్రకాశం) : ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు చివరి ఏడాది ఒంగోలుకు యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ ప్రకటన వెలువడటంతో జిల్లాలోని పీజీ చదవాలనుకునే విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్శిటీకి మౌలిక వసతుల కోసం అప్పటి ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌ సుదర్శనరావు రూ.126 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.10 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. చివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా చిన్నచూపు చూసింది. ఒంగోలులో యూనివర్సిటీ ఉన్నప్పటికీ దానికి నిధులు విడుదల చేయకపోవడంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌గానే చెలామణి అవుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటం, రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ నియమితులు కావడంతో యూనివర్సిటీకీ త్వరలోనే జవసత్వాలు వస్తాయని విద్యార్థులు ఆశగా ఉన్నారు. 

ఫస్ట్‌ ఇయర్‌ యూనివర్సిటీ..సెకండ్‌ ఇయర్‌ పీజీ సెంటర్‌:
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ కింద, సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న వారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కింద ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నడుస్తున్న పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా మార్చినప్పటికీ దానికి సంబంధించిన విభజన ఇంత వరకు జరగలేదు.  ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్‌ ఇయర్‌లో 124 మంది, సెకండ్‌ ఇయర్‌లో 214 మంది చదువుకుంటున్నారు. వాస్తవానికి యూనివర్సిటీ ఉంటే ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ కలిపి 1500 నుంచి 2 వేల మంది విద్యార్థులు ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా కేవలం 338 మంది విద్యార్థులతో నామమాత్రపు యూనివర్సిటీతోపాటు పీజీ సెంటర్‌ను నెట్టుకు వస్తున్నారు. 

డిపార్ట్‌మెంట్‌లు తక్కువ.. కోర్సులు తక్కువ: 
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రకటన చేయడం తప్పితే తదుపరి దృష్టి సారించకపోవడంతో దాని ప్రభావం ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌లకు సంబంధించి కేవలం ఎనిమిది డిపార్ట్‌మెంట్లు, పది కోర్సులు మాత్రమే ఉన్నాయి. దానికితోడు సైన్స్‌ కోర్సులకు ల్యాబ్‌లు లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడ చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆర్ట్స్‌ కోర్సులతోపాటు స్టాటిస్టిక్స్, మ్యాథ్స్‌ కోర్సులను  నిర్వహిస్తున్నారు. వాస్తవానికి యూనివర్శిటీ పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంటే డిపార్ట్‌మెంట్లు పెరగడంతోపాటు కోర్సులు కూడా పెరిగేవి. యూనివర్సిటీ విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. అయితే యూనివర్శిటీకి సంబంధించి ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ చేసేందుకు నాగార్జున యూనివర్సిటీ వైపే మొగ్గు చూపారు. 

రూ.కోటి భవనం నిరుపయోగం:
ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట వద్ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి 110 ఎకరాల స్థలం ఉంది. పీజీ సెంటర్‌లో చదువుకునే విద్యార్థుల కోసం అక్కడ కోటి రూపాయలతో రెండేళ్ల క్రితం భవనాన్ని నిర్మించారు. రూ.70 లక్షలతో చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే కోటి రూపాయల భవనం నిరుపయోగంగా ఉంది. పీజీ సెంటర్‌కు హాస్టల్‌ నిర్మాణం జరిగిన ప్రాంతం దూరంగా ఉండటం, విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో ఆ హాస్టల్‌ నిరుపయోగంగా ఉంది. 

జగన్‌ ప్రభుత్వం దృష్టి:
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీౖపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ యూనివర్సిటీకి నెల్లూరులోని సింహపూరి యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ సుదర్శనరావును ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా గత ప్రభుత్వం నియమించింది. ప్రకాశం యూనివర్శిటీతో కలుపుకుంటే సుదర్శనరావు మూడు యూనివర్సిటీలకు వైస్‌ చాన్సలర్‌గా ఉండటంతో ఆయన స్థానంలో జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ను ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌గా ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ జిల్లాకు చెందినవారు కావడంతో యూనివర్సిటీకి సంబంధించిన కదలిక కలెక్టర్‌ తీసుకువస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు