జీవో అమలు చేసి ఉంటే..

17 Sep, 2019 10:25 IST|Sakshi

తూతూ మంత్రం సమీక్షలతో సరిపుచ్చిన గత సర్కారు

త్రిసభ్య కమిటీ సిఫార్సులు బుట్ట దాఖలు

జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం

సాక్షి, అమరావతి : పడవ ప్రమాదాలు ఎన్ని జరిగినా, ఎందరి ప్రాణాలు నీటిలో కలిసినా గత సర్కారు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన సంఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బోటు ఆపరేటింగ్‌ నిబంధనలను మార్చుతూ 2018 జూన్‌ 8న జీవోఎంఎస్‌ నంబరు 14 జారీ చేసింది. బోటు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలో సూచించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు, జీఓ అమలుపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షించారు.


పలు ఫెర్రీల్లో స్థానికులు ఏమాత్రం సురక్షితం కాని బోట్లు నడుపుతున్నారని గుర్తించారు. లైఫ్‌ జాకెట్లు లాంటి రక్షణ సామగ్రి లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడం కోసం బోట్లు నడిపే వారికి తగిన శిక్షణ, ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఏమి చేయవచ్చో, ఏమి చేయరాదనే అంశాలపై అవగాహన కోసం ఫెర్రీ పాయింట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు. బోట్లలో ప్రయాణికుల సంఖ్యకు సరిపడా లైఫ్‌ జాకెట్లు కచ్చితంగా సిద్ధంగా ఉంచాలని, ఫెర్రీల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు.

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి : భద్రతా నియమాలకు అనుగుణంగా ఉన్న బోట్లను మాత్రమే అదీ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాటినే అనుమతించాలని 2018 జూన్‌ 8న ఇచ్చిన జీవోలో స్పష్టంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో భద్రత చర్యల నిమిత్తం బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, నిఘా, పటిష్ట రక్షణ చర్యల అమలు బాధ్యతను ఒకే నోడల్‌ ఏజెన్సీకి అప్పగించాలని కూడా జీవోలో ఉంది. అయితే గత ప్రభుత్వం వేటినీ పాటించలేదు. జీవో జారీ చేసి గాలికొదిలేసిందని మాత్రం స్పష్టమైంది.  
 

>
మరిన్ని వార్తలు