సమీక్షలతో సరి

31 Dec, 2014 01:14 IST|Sakshi
సమీక్షలతో సరి

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:హడావుడి సమీక్షలు, అవి చేస్తాం.. ఇవి చేస్తామన్న ప్రకటనల పటాటోపమే తప్ప జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పెద్దగా కనిపించడంలేదు. మరో రెండు రోజుల్లో ఈ ఏడాది ముగుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటిపోయింది.  జిల్లాకు చెందిన మంత్రి, ప్రభుత్వ విప్ సమీక్షల పేరిట హడావుడి చే స్తున్నారు తప్ప రాష్ట్రస్థాయిలో జిల్లా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కనిపించలేదు. సమీక్షల పేరిట జిల్లాలో జరుగుతున్న తంతు ఉత్తి హడావుడిగానే మిగిలిపోతోంది.
 
 వాటిలో తీసుకున్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదు. విపక్షాలు గొంతెత్తితే తప్పును గత పాలకులపైకి నెట్టేయడమో, కొన్నాళ్లుగా సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందంటూనో కాలం గడిపేస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఎజెండాలు పక్కకుపోతున్నాయి. పదుల సంఖ్యలో శాఖలు ఉండగా నాలుగైదు అంశాలకే చర్చలు పరిమితమైపోతున్నాయి. మంత్రుల పర్యటనలు, సమీక్షల్లో తీసుకున్ని కొన్ని నిర్ణయాల అమలు తీరు పరిశీలిస్తే..
 
  తుపానుకు ముందు ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని సందర్శించినప్పుడు ఆస్పత్రి డొల్లతనం బయటపడింది. అనంతరం జెడ్పీలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సాక్షిగానే జిల్లా అధికారులు తగాదాపడ్డారు. ఆ తర్వాత కూడా ఫలితాల్లో మార్పు లేదు.
 
  మున్సిపల్ మంత్రి నారాయణ
 జిల్లా పర్యటనకు వచ్చి  మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. కనీసం 50 శాతం లక్ష్యాలు సాధించకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. అంతే.. అప్పటి నుంచీ అదే పరిస్థితి.
 
  వ్యవసాయ మంత్రి పుల్లారావు నైరా కళాశాల ఉత్సవాలకు హాజరైనప్పుడు పలు హామీలిచ్చారు. సమీక్ష నిర్వహించి వ్యవసాయ అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. ఫలితం సున్నా. తరువాత అధికారులే మారిపోయారు.
 
  తుపాను సమయంలో పది రోజుల పాటు జిల్లా అంధకారంలో మగ్గిపోయినప్పుడు మంత్రులు, నాయకులు పొంతన లేని హామీలిచ్చారు. జిల్లాకు వరుసకట్టిన మంత్రులు, వారితో వచ్చిన నాయకులు, ఉన్నతాధికారులు, సిబ్బందికి మర్యాదలు చేయలేక జిల్లా యంత్రాంగం ఆపసోపాలు పడింది.
 
  తుపాను వచ్చిన రెండు నెలల తర్వాత నష్టాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ఒకరోజుకే పర్యటనను పరిమితం చేసి తరువాత చూద్దాం అంటూ వెళ్లిపోవడం అభాసుపాలైంది.
 
  పాతపట్నం, రేగిడి మండలాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని, 11 కేంద్రాల్లో రూ.2కే 20 లీటర్ల మంచినీరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేదు.  
 
 అధికార పార్టీలో ఎవరికి వారే..
 అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. మొన్నటివరకూ పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టు ఉన్న ఎమ్మెల్యే కళావెంకట్రావుకు పార్టీ అధిష్ఠానం సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. మరో ఎమ్మెల్యే శివాజీ ఇప్పటికీ అలకపాన్పు దిగలేదని తెలుస్తోంది. ఇటీవల జెడ్పీలో జరిగిన సమీక్షలో ఇది స్పష్టమైంది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆ మధ్య పాదయాత్రలు చేసినా ఇప్పుడు అవేవీ కనిపించడంలేదు.

 అన్నింటికీ మించి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వీరు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో అధికారులకు సొంత లక్ష్యాలు నిర్దేశిస్తుండటంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగుల బదిలీలు, రుణమాఫీ, పింఛన్ల మంజూరు, తుపాను నష్టపరిహారం విషయాల్లో వీరిద్దరి ఎజెండాలు వేర్వేరన్న విషయం బయటపడింది. కాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే మూడుసార్లు జిల్లాకు వచ్చినా నిర్ధిష్టమైన హామీలేవీ లభించలేదు. మొక్కుబడిగా ముఖం చూపించి వెళ్లిపోయారు. సోంపేట, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్లతోపాటు కొవ్వాడ అణుపార్కు, కొత్తగా ప్రతిసాదించిన పొందూరు విద్యుత్ ప్లాంట్ల విషయంలో అధికార పార్టీ నేతలు ఇప్పటికీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు