టీడీపీది నిరంకుశ పాలన

28 Nov, 2015 03:32 IST|Sakshi

వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
 బాతుపురం(వజ్రపుకొత్తూరు):
రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది నిరంకుశ, నియంతృత్వ పాలన అని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఒక మోసం చేసి దానిని కప్పిపుచ్చుకునేందుకు మరో మోసాన్ని ప్రజలకు అంటగడుతున్నారని విమర్శించారు. వజ్రపుకొత్తూరు మండలంలో శుక్రవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. బాతుపురం, డోకులపాడు గ్రామాల్లో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. బాతుపురం గ్రామంలో సంప్రదాయ బద్దంగా నందెమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సర్పంచ్ టి.సరస్వతిని బెదిరించి, అంతు చూస్తామనడం పలాస ఎమ్మెల్యేకే చెల్లిందన్నారు. దీనిని పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.
 
  వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలను, నాయకులను టీడీపీ నేతలు బెదిరించే కార్యక్రమాలకు దిగితే క్షమించేది లేదని, తాము దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని జనాభా అంతటికి అందించాల్సిన ఆదాయాన్ని కేవలం టీడీ పీ కార్యకర్తలకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి దోచి పెడుతున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ టీడీపీకి కలెక్టరా... ప్రజలకు కలెక్టరా అని ప్రశ్నించారు. ముందుగా డోకులపాడు గ్రామానికి చెందిన పుక్కళ్ల ఆనందరావు పాతపట్నం జైలులో ఇటీవల మృతి చెండంతో ఆయన కుటుంబాన్ని రెడ్డి శాంతితో పాటు నాయకులు పరామర్శించి ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు మరడ భాస్కరరెడ్డి, పలాస మాజీ ఎంపీపీ బి.హేమేశ్వరరావు, స్థానిక సర్పంచ్ టి.సరస్వతి, పార్టీ నేతలు బి.లక్ష్మినారాయణ, బి.పార్వతీశం, రామలింగం, ఎం.వరప్రసాద్, బి.ఎర్రయ్య, ఢిల్లేశ్వరరావు, డోకులపాడు ఎంపీటీసీ మాజీ సభ్యుడు కె.దానేసు, టి. సూర్యనారాయణ, బి.లక్ష్మీనపతి, దివాకర్, రామచంద్రుడు  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు