పేదల భూములే టార్గెట్‌

2 Mar, 2018 02:08 IST|Sakshi

20,603.65 ఎకరాల అసైన్డ్‌ భూములకు సర్కారు ఎసరు

సాక్షి, అమరావతి: ‘‘పేదలకు చెందిన భూముల స్వాధీనంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నిలిపివేస్తాం. పేదలకు ఇచ్చిన భూములను ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేసే విధానాన్ని రద్దు చేస్తాం. పరిశ్రమల పేరుతో దళితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న అసైన్డ్‌ భూముల వివరాలను సేకరిస్తాం. దళితులకు న్యాయం చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండెకరాల చొప్పున కొనుగులు చేసి పంపిణీ చేస్తాం’’... ఇదీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ.
 
వీలైనంత త్వరగా సేకరించండి 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పేదల పొట్టకొట్టి పెద్దల జేబులు నింపడమే లక్ష్యంగా పని చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ప్రధానంగా పేదల భూములపైనే సర్కారు గురి పెట్టింది. పేదలకు జీవనోపాధి కోసం గతంలో కేటాయించిన అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా లాక్కొని, బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోంది. విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక నోడ్స్‌ పేరుతో 20,603.65 ఎకరాల పేదల భూములను, 22,015.27 ఎకరాల పట్టా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇప్పటికే పరిశ్రమల శాఖ గుర్తించింది. గుర్తించిన భూములను వీలైనంత త్వరగా సేకరించి, ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. నాలుగు పారిశ్రామిక నోడ్స్‌ కోసం అసైన్డ్, పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 61,315.38 ఎకరాలను గుర్తించింది. 

చట్టమంటే లెక్కలేదా? 
చట్టం ప్రకారం.. పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయరాదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకున్న భూమిని తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికే ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు చరమగీతం పాడేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కోసం పైసా కూడా ఖర్చు చేయకపోగా, వారి భూములను ఇతర అవసరాల కోసం ప్రభుత్వమే లాగేసుకోవడం బాధాకరమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు