నడ్డి విరిగేలా ‘వడ్డి’ంపు!

3 Jul, 2014 01:25 IST|Sakshi
నడ్డి విరిగేలా ‘వడ్డి’ంపు!

 అధికారంలోకి రాగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని గొప్పగా ప్రకటించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కమిటీ పేరుతో కాలయాపన చేస్తుండడంతో అది కాలనాగై రైతును కాటేయడానికి సిద్ధమైంది. వడ్డీ అనే విషం కక్కుతూ బుసకొడుతోంది. చంద్రబాబు హామీ తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని భావించిన రైతుకు అదే శాపంగా మారింది.  
 
 విజయనగరం అర్బన్: రైతులను ఏటా కష్టాలు వెంటాడుతున్నాయి.  టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ అమలులో జాప్యం చేయడం వల్ల తొలి సంతకం హామీ రైతుకు మేలు చేయకపోగా...మరింత భారాన్ని మోపుతోంది. ప్రభుత్వం రుణం మాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు బకాయిలు చెల్లించలేదు. బ్యాంకునిబంధనల ప్రకారం ఏడాది క్రితం తీసుకున్న రుణాలను జూన్ నెలాఖరులోపు తీర్చేయాలి. సాధారణంగా వ్యవసా య రుణాలకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
 
 గడువు లోపు చెల్లించకపోతే అది 11.07 శాతానికి పెరుగుతుంది. గడువు జూన్ 30తో ముగిసిపోయింది. దీంతో అధిక వడ్డీ వసూలు చేయడానికిబ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ ‘వడ్డి’ంపు వేయనున్నారు. ఈ మేరకు నోటీసులు పంపిస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రిజర్వు బ్యాంకు, ఎస్‌ఎల్‌బీసీ (స్టేల్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ) నిబంధనల మేరకు పంట రుణం తీసుకున్న ఏడాదిలోపు చెల్లించిన వారికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వడ్డీరాయితీ పథకం (ఏడు శాతం వడ్డీ) వర్తిస్తుంది. అయితే, గడువు మీరిన బకాయిపై కచ్చితంగా 11.07 శాతం వడ్డీ చెల్లించాలి. జిల్లాలో ఇప్పటికే గడువు మీరిన బకాయిదారులకు రికవరీ నోటీసుల జారీ ప్రారంభించారు.
 
 జిల్లా వ్యాప్తంగా 4.40 లక్షల మంది రైతులుండగా.. ఇందులో రెండు లక్షల మంది వివిధ పద్దుల కింద సాగు కోసం రుణాలు తీసుకున్నారు. జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక, బంగారు ఆభరణాల తనఖాపై రూ. 2,040 కోట్ల మేర రుణంగా తీసుకున్నారు. స్వయసహాయక సంఘాలు మినహా రైతులకు సంబంధించి ఒక్క శాతం కూడా బకాయి రికవరీ కాలేదు. దీంతో ఈ సొమ్ముపై 4.07శాతం వడ్డీని అదనంగా వసూలు చేస్తే జిల్లా రైతులపై రూ.5 కోట్ల పది లక్షల మేర భారం పడుతుంది. గ్రామాల్లో చాలామంది ఇప్పటికే బయట తెచ్చిన అప్పులకు వడ్డీలకు వడ్డీలు కడుతున్నారు. ఇక బ్యాంకులు ‘వడ్డి’స్తే తమ పరిస్థితి ఏంటని తలచుకుంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.  
 

మరిన్ని వార్తలు