పెథాయ్‌ పగ.. సర్కారు దగా!

20 Dec, 2018 03:45 IST|Sakshi

రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకునే ఎత్తుగడ 

పంట నష్టం వివరాల నమోదులో అడ్డగోలు నిబంధనలు

కోతలు పూర్తయి వర్షానికి తడిసిన పంటను నమోదు చేయరట!  

సరిగ్గా కుప్ప వేయని వరి తడిస్తే నష్టపరిహారం సున్నా 

కోతకు సిద్ధంగా ఉండి నేలకొరిగి, మొలకెత్తిన పంటలే నమోదు 

జాబితా నుంచి 90% పొలాలు తొలగింపు

ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి..రూ.6 వేలే ఇస్తామంటున్న ప్రభుత్వం 

ఒక్కరోజులోనే వివరాలన్నీ సేకరించాలని అధికారులకు ఆదేశం 

కౌలు రైతులకు పరిహారం ఎగవేత

పైచిత్రంలోని రైతు పేరు పాశం పూర్ణచంద్రరావు. స్వగ్రామం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గాంధీనగరం. ఖరీఫ్‌లో 3.5 ఎకరాల్లో బీపీటీ రకం ధాన్యం సాగు చేశాడు. పంట కోత కోసిన వెంటనే పెథాయ్‌ తుపాను ప్రభావంతో వర్షం మొదలైంది. కనీసం పంటను కుప్పగా వేసే అవకాశం సైతం లేకుండాపోయింది. వర్షపు నీరు పంట పొలంలో చేరడంతో ధాన్యమంతా నీళ్లపాలై మొలకలు వచ్చింది. పంట సాగుకోసం పూర్ణచంద్రరావు ఎకరాకు రూ.35 వేల చొప్పున మొత్తం రూ.1,19,500 పెట్టుబడి పెట్టాడు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని భావిస్తే.. గాలికి వాలి మొలకెత్తిన ధాన్యానికే పరిహారం ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్‌వర్క్‌: పెథాయ్‌ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. నిబంధనల పేరిట బంధనాలు వేస్తోంది. నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకో వడానికి పెథాయ్‌ తుపాను వల్ల పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చిత్రీకరించేందుకు ప్రయత్ని స్తోంది. తమను మోసగించడానికే సీఎం చంద్రబాబు టెక్నాలజీతో తుపాను నష్టాన్ని నివారించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పెథాయ్‌ తుపాను వల్ల కేవలం 66 వేల ఎకరాల్లోనే పంటలు పాడయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. 

ఒక్క రోజులో వివరాలు సేకరించేదేలా? 
తుపాను వల్ల నష్టపోయిన పంటల వివరాలను సేకరించే బాధ్యతను ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు అప్పగించింది. కానీ, నిబంధనలను మాత్రం మంగళవారం అర్ధరాత్రి  11 గంటలకు విడుదల చేసింది. బుధవారం సాయంత్రంలోగా అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వివరాలను సేకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 12 గంటల వ్యవధిలో వేలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని ఎలా సేకరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు పంట నష్టం వివరాల నమోదుకు ప్రభుత్వం ‘సైక్లోన్‌ అప్లికేషన్‌’ పేరిట కొత్త మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 29 ఆంశాలను నమోదు చేయాల్సి ఉంది. రైతు ఆధార్‌ నెంబర్‌తో లాగిన్‌ అయిన తర్వాత బ్యాంక్‌ ఆకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్యాంక్‌ బ్రాంచ్‌ పేరు వంటి అన్ని అంశాలను ఎంటర్‌ చేసి, రైతు పొలాన్ని ఫొటో తీసి జియో ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అంతంతమాత్రంగానే ఉండటంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క రైతు వివరాలను నమోదు చేయడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన 12 గంటల సమయంలో పంట నష్టం వివరాలను నమోదు చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రైతులు మండిపడుతున్నారు. 

ఎన్నెన్ని తిరకాసులో...
పంట నష్టం వివరాలను నమోదు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఎన్నో తిరకాసులను పెట్టింది. సర్కారు నిబంధనల ప్రకారం.. కోతలు పూర్తయి పొలాల్లో వర్షానికి తడిసిన వరి పంట వివరాలను నమోదు చేయొద్దు. సరిగ్గా కుప్ప వేయని వరి తడిస్తే నష్టపరిహారం ఇవ్వరు. కేవలం కోతకు సిద్ధంగా ఉండి నేలకొరిగి, మొలకెత్తిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అందులో కూడా 33 శాతం కంటే అధికంగా నేలకొరిగిన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. దీనిప్రకారం 90 శాతం పొలాలను జాబితాలోంచి తొలగిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో  47,000 హెక్టార్లలో పంట నష్టపోతే 8,231 హెక్టార్లను మాత్రమే నమోదు చేస్తున్నారు. 

ఈ–క్రాప్‌లో రైతుల వివరాలేవీ? 
సైక్లోన్‌ యాప్‌లో రైతుల పంట నష్టం వివరాలు నమోదు కావాలంటే ఈ–క్రాప్‌లో ఇదివరకే ఆ రైతు పేరు నమోదై ఉండాలి. గతంలో అధికారుల అలసత్వంతో ఈ–క్రాప్‌లో రైతులందరి వివరాలు నమోదు చేయలేదు. ఇన్ని సమస్యల మధ్య అధికారులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ నెల 20వ తేదీన తుపాను బాధిత రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం పంట నష్టాన్ని పరిశీలించడానికి కూడా అధికారులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

నష్టం కొండంత.. పరిహారం గోరంతే 
ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని పెథాయ్‌ బాధిత రైతులు అంటున్నారు. వరి పంటకు హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఎకరాకు రూ.6 వేలు ఇవ్వనున్నారు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టారు. తడిసిన పంట కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా సగం ధరకే విక్రయించాల్సి వస్తుంది. అంటే ఎకరాకు రూ.50 వేల ఆదాయం రావాల్సి ఉండగా, తుపాను ప్రభావం వల్ల రూ.25 వేలు మాత్రమే అందనుంది. పరిహారం కింద ఎకరాకు రూ.6 వేలు మాత్రమే ఇస్తామనడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

తూర్పు గోదావరిలో 500 హెక్టార్లకే పరిహారం ఇస్తారట! 
పెథాయ్‌ తుపాను ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో 12 వేల ఎకరాల్లో రబీ నారుమళ్లు దెబ్బతిన్నాయి. 25 వేల ఎకరాల్లో పనలపై ఉన్న ధాన్యం తడిసిముద్దయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. 5,705 ఎకరాల్లో అరటి, 8,400 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. కానీ, అధికారికంగా ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి 5,484 హెక్టార్లలో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో వరి 3,059 హెక్టార్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా 2,450 హెక్టార్లలో జీడి, మామిడి, అరటి, బొప్పాయి తోటలతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు నివేదికలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను బట్టి చూస్తే 500 హెక్టార్లకు మించి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు.  

కౌలు రైతులకు మొండిచేయి 
పంట నష్టం వివరాల నమోదుకు ప్రవేశపెట్టిన సైక్లోన్‌ యాప్‌ను పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం రాత్రికి కూడా ప్రభుత్వం యాక్టివేట్‌ చేయలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయికి వెళ్లకపోవడంతో వివరాలు చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. చాలామంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవు. గుర్తింపు కార్డు ఉంటేనే సాఫ్ట్‌వేర్‌ వారి వివరాలను స్వీకరిస్తుంది. అంటే కార్డులు లేని కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రాదు. పెథాయ్‌ తుఫాన్‌ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో 14,788 హెక్టార్లలో పనలపై ఉన్న వరి పంట నీటమునిగింది. కుప్పల రూపంలో 59,150 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పంటను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే బాధిత రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. 

నిబంధనలే శాపం 
విశాఖ జిల్లాలో ఖరీఫ్‌లో 99 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 37 వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయింది. పెథాయ్‌ తుపానుకు ముందు 29 వేల హెక్టార్లలో ధాన్యం కోతలు పూర్తయ్యాయి. 33 వేల హెక్టార్ల పంట కోతకు సిద్ధంగా ఉంది. పెథాయ్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో 23 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందులో 90 శాతం పంటకు నష్టపరిహారం రాదని అధికారులు తేల్చిచెబుతున్నారు. 

సర్కారు కాకిలెక్కలు 
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఇందులో దాదాపు 2 లక్షల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. పెథాయ్‌ ప్రభావం వల్ల ఇందులో 1.36 లక్షల హెక్టార్లలో వరి పనలు నీటిలో తడిసి పాడయ్యాయి. దాదాపు లక్ష హెక్టార్లలో పెసర, మినప వేయగా, 40 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. అయితే, పెథాయ్‌ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్దగా పంట నష్టం వాటిల్లలేని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నష్టపరిహారం ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు