పంచాయతీ పాలనకు బాబు సర్కార్‌ వెన్నుపోటు

24 Apr, 2018 03:47 IST|Sakshi

సర్పంచుల అధికారాలు జన్మభూమి కమిటీలకు ధారాదత్తం

పంచాయతీల పేరిట ఉన్న డబ్బులు తీసుకోవడానికీ ఆంక్షలే

రూ. 1,800 కోట్ల వీధి దీపాల బిల్లులు కట్టాలని సర్కారు ఆదేశం

కమీషన్ల కోసం తమ వారికి ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టు

రూ.వెయ్యిలోపే దొరికే బల్బులకు రూ.4,500 ఇవ్వాలని ఆదేశం

12,918 గ్రామ పంచాయతీలకు 6,014 మంది కార్యదర్శులు

టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామపాలన పూర్తిగా నిర్వీర్యం

నేడు తూర్పు గోదావరిలో జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను అన్నిచోట్లా సగౌరవంగా ప్రజా ప్రతినిధులుగా గుర్తిస్తున్నారు. కానీ అదే ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు మాత్రం అసలు ప్రజా ప్రతినిధులే కాదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా పోటీ పాలన సాగిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు కల్పించిన అధికారాలను తన అధికార గర్వంతో అణచివేస్తోంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాల పాలన çనాలుగేళ్లుగా గాడి తప్పింది. ప్రజలెన్నుకున్న సర్పంచులకు కల్పించిన అధికారాలను జన్మభూమి కమిటీ సభ్యులు అనుభవిస్తున్నారు. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోగా కేంద్రం నేరుగా ఇచ్చే వాటిని కూడా ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేకుండా ట్రెజరీల్లో ఆంక్షలు అమలు చేస్తోంది. జిల్లా, మండల పరిషత్‌లైతే నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల పాలనకు జవసత్వాలు కల్పించే రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్‌ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిస్థితి ఎలా దిగజారిందో పరిశీలిద్దాం.

సగం ఊర్లకు కార్యదర్శులే లేరు..: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో పాలన సజావుగా జరగడానికి వీలుగా ఊరికొక గ్రామ కార్యదర్శి కూడా లేరు. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలుండగా కేవలం 6,014 మంది కార్యదర్శులే పనిచేస్తున్నారు. ఒక్కో కార్యదర్శి నాలుగైదు గ్రామాలకు  ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా జిల్లా పంచాయతీ అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండగా వారం క్రితం పలువురిని డీపీవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ రెండు జిల్లాలకు పూర్తిస్థాయి డీపీలు లేరు. మూడు జిల్లాలకు పూర్తిస్థాయి జెడ్పీ సీఈవోలు లేరు. అన్ని జిల్లాల్లో డిప్యూటీ సీఈవో పోస్టులు, ఏవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

నిధులు, విధులు కాగితాల్లోనే..: రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ ఆర్టికల్‌ 243(జి) ప్రకారం 29 అంశాలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బందిని పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదలాయించాల్సి ఉన్నా ఉత్తర్వులకే పరిమితమయ్యాయి. ఉదాహరణకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ తీసుకుంటే మదర్స్‌ కమిటీలు పంచాయతీల పర్యవేక్షణలో పనిచేయాలి. నిధులు, సిబ్బంది పంచాయతీల ఆధీనంలోనే ఉండాలి. అయితే ప్రభుత్వం అంగన్‌వాడీల నిర్వహణకు నిధులు విడుదల చేయలేదు, సిబ్బంది కూడా శిశుసంక్షేమ శాఖ ఆధీనంలోనే పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, ఇతర సామాగ్రి కొనుగోలు కోసం  పంచాయతీలు ఇంటిపన్ను రూపంలో వసూలు చేసిన నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 40–50 శాతం పంచాయతీరాజ్‌ వ్యవస్థలకే బదలాయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం పంచాయతీ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలను లెక్క చూపిస్తూ 10–15 శాతం నిధులను పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  

కేంద్ర నిధుల విడుదలపై ఆంక్షలు..: కేంద్రం నేరుగా పంచాయతీలకు విడుదల చేసిన 14 ఆర్థిక సంఘం నిధులతోపాటు స్థానికంగా వసూలయ్యే ఇంటి పన్ను తదితరాలు కలిపి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీల పేరుతో రూ.1,400 కోట్లున్నా వీటితో సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలులేకుండా రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీల్లో అనధికారిక ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 25 నుంచి నిధులు విడుదల చేయకుండా సర్పంచులు ఇచ్చే చెక్‌లను వెనక్కి పంపిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్‌ మండలంలో ఒక్క చోటే 56 చెక్కులను అధికారులు ఎలాంటి కారణం చూపకుండా ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో వెనక్కి పంపారు.

మూడేళ్లుగా జెడ్పీ, ఎంపీపీలకు నిధుల్లేవ్‌: జిల్లా, మండల పరిషత్‌లకు మూడేళ్లుగా నిధులు విడుదల కావటం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలవారీగా నిధులు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో మండల, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవటంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో పాలన పూర్తిగా స్తంభించింది.

గ్రామాలకు కరెంట్‌ షాకులు: మైనర్‌ పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్‌ బిల్లును గతంలో రాష్ట్ర ప్రభుత్వాలే భరించాయి. 2013–14 వరకు ఇదే కొనసాగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే గ్రామాల్లో వీధి దీపాల కరెంటు బిల్లులు రూ.1,800 కోట్లు పేరుకుపోయాయని, దీన్ని సంబంధిత పంచాయతీలే విద్యుత్‌ శాఖకు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. 

వెయ్యికే దొరికే ఎల్‌ఈడీ లైట్‌కు రూ.4,500: నారా లోకేశ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గ్రామాల్లో వీధి దీపాల సరఫరా, నిర్వహణను బడా ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వ పెద్దలే కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటూ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.వెయ్యిలోపు ధరలోనే దొరుకుతున్న ఎల్‌ఈడీ వీధి దీపానికి పంచాయతీలు ఏటా రూ.450 చొప్పున పదేళ్ల పాటు రూ.4,500 చెల్లించాలని ఆదేశించారు. దీంతో 200 స్తంభాలున్న పంచాయతీలు పదేళ్ల పాటు ప్రతి ఏటా రూ. 90 వేల చొప్పున ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వస్తోంది. తాజాగా గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అప్పగించాలని కూడా లోకేశ్‌ యోచిస్తున్నారు.

జన్మభూమి కమిటీలదే పెత్తనం: 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక అందరికీ తెలిసేలా సర్పంచుల అధ్యక్షతన గ్రామసభల ద్వారా జరగాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని జన్మభూమి కమిటీల ద్వారా చేపడుతున్నారు. స్థానిక సంస్థల తీర్మానాల ద్వారా గుర్తించాల్సిన అభివృద్ధి పనుల్లోనూ జన్మభూమి కమిటీలదే పెత్తనం.

మరిన్ని వార్తలు