19మంది డిన్నర్, 18.29లక్షలు ఖర్చు

28 Jun, 2017 12:46 IST|Sakshi
19మంది డిన్నర్, 18.29లక్షలు ఖర్చు

అమరావతి: అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి యనమల రామకృష్ణుడు సైతం ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఖర్చులు ఖజానాపై ప్రభావం చూపున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజల ఆవేదన. దీనికి ఉదాహణగా ఏపీ ప్రభుత్వం 19 మంది ప్రముఖుల భోజనాల కోసం సుమారు 19లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇదేదో గాలి లెక్కలు కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నవివరాలు.

ఈ ఏడాది ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో "ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్" అనే అంశంపై రెండురోజుల పాటు అంతర్జాతీయ వర్క్షాప్ను నిర్వహించారు. ఈసమావేశానికి అనేక మంది ప్రముఖలు హాజరయ్యారు. వర్క్షాప్ అనంతరం వీరికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందుకోసం ప్రభుత్వం రూ.13,38,720 ఖర్చు చేసింది. మరో రూ.4,90,705 లను వారి సదుపాయల నిర్వహణకు ఖర్చు చేసింది. మొత్తం 18,29,425 రూపాయలను ఏపీ ప్రభుత్వం వినియోగించింది.  ఈవివరాలు అన్నీ ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినవి.

రాష్ట్ర అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విందు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం సరైనదేనా అనేది సామాన్య పౌరుడి ప్రశ్న.





మరిన్ని వార్తలు