విద్యార్థుల బీమాకు మంగళం

4 Nov, 2018 10:34 IST|Sakshi

నాలుగు సంవత్సరాల నుంచి నిలిపివేత 

జిల్లాల్లో గత ఏడాది 20మంది పైగా విద్యార్థుల మృతి

మరో 40 మందికి గాయాలు

పథకం గురించి తెలియదంటున్న ఉపాధ్యాయులు

 తాడేపల్లి రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బీమా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మంగళం పాడింది. దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి విద్యార్థి నుంచి రూ.5 వసూలు చేసి, వారికి ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్‌ రూపంలో వైద్యానికి అయ్యే ఖర్చులు అందచేసేవారు. ఒకవేళ ప్రమాదంలో మృతి చెందితే తల్లిదండ్రులకు రూ.1లక్ష అందచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

 దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణం అనంతరం రెండు సంవత్సరాలు నడిచిన పథకం తెలుగుదేశం అధికారం చేపట్టగానే తూట్లు పొడిచి నిధుల్ని పక్కదారి పట్టించింది. సాక్షాత్తు ప్రతి రోజూ ముఖ్యమంత్రి పర్యటించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత ఏడాది సుమారు 20మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు. ఆయన నివాసం ఉంటున్న తాడేపల్లి మండలంలో టీడీపీ నేతలు అక్రమంగా తవ్విన ఇసుక గుంతల్లో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు.

 మరో విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఫిరంగిపురంలో నలుగురు విద్యార్థులు పాఠశాలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా,  బీమా గురించి ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, అధికారులకు ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. చనిపోయిన విద్యార్థులకు బీమా సౌకర్యం ఎందుకు కల్పించలేదని పలు పాఠశాలలో ఉపాధ్యాయులను ప్రశ్నించగా, తమకు తెలియదంటూ సమాధానమిచ్చారు. ప్రతి విద్యార్థికీ రూ.5 చొప్పున ప్రభుత్వం చెల్లించి ఉంటే చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు రూ.1లక్ష, స్వల్పంగా గాయపడిన విద్యార్థులకు రూ.25వేలు, తీవ్రంగా గాయపడితే రూ.50వేల నుంచి రూ.75వేల వరకు బీమా కంపెనీ అందజేసేది. 

మృతుల కుటుంబాలకు పైసా అందించని ప్రభుత్వం 
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు 6,750 ఉండగా, అందులో చదువుకుంటున్న విద్యార్థులు 9లక్షలకు పైనే ఉన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో సుమారు 20మందికి పైగా మృతి చెందగా వారి కుటుంబాలకు నేటికీ ఒక్క పైసా ప్రభుత్వం అందించలేదు. కనీసం చంద్రన్న బీమా కూడా వర్తింప చేయలేదు. తమ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు చేసి తమను పోషిస్తారనుకుంటే చివరకు వారు అకాలంగా మృతి చెందడంతో, ఆర్థికంగా, దిగులుతోను ఆ కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. అలాగే గాయపడిన విద్యార్థులు 40–100 మంది దాకా ఉన్నారు. వారికి కూడా వైద్యం చేయించుకునే స్థోమత లేక విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.

 బీమా గురించి తెలియదు 
మా అబ్బాయి చనిపోయిన తర్వాత పాఠశాల నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. చంద్రన్న బీమా కూడా వర్తించదని చెప్పారు. పాఠశాలలో బీమా సౌకర్యం ఉన్నదని మాకు తెలియదు.
  – మలమంటి లక్ష్మి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా 
ప్రస్తుతానికి బీమా సౌకర్యం గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. గతంలో విద్యా శాఖాధికారులు చెప్పినప్పుడు కట్టించుకునే వాళ్లం. మరలా కట్టించుకోమంటే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర వసూలు చేసి బీమా కంపెనీకి అందజేస్తాం.
 – విల్సన్‌ వినోద్, 
మండల ఇన్‌చార్జి ఎంఈవో 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు