‘బొండా’గిరికి ప్రభుత్వ దన్ను

1 Feb, 2018 08:42 IST|Sakshi
ఎమ్మెల్యే బొండా ఉమా కబ్జా చేసిన స్థలం

బండారం బట్టబయలైనా అధికార యంత్రాంగం ఉదాసీనం

ముఖ్యనేతతో బొండా సంప్రదింపుల ఫలితంగానే..

ఇప్పటికీ ఆయన కుటుంబ అధీనంలోనే రూ.50 కోట్ల భూమి

ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం ససేమిరా   

సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూబాగోతానికి ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. ఆయన భూ బండారం బట్టబయలైనా చర్యల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి కేసును నీరుగార్చాలని చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొండా ఉమా రూ.50 కోట్ల భూబాగోతం కేసులో ఏ–1గా ఉన్న అబ్దుల్‌ మస్తాన్, ఏ–2గా ఉన్న రామిరెడ్డి కోటేశ్వరరావు అందులో తమ ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారు. ఆ 5.16 ఎకరాలను తాము కొనలేదని, అలాంటప్పుడు దాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు ఇతరులకు విక్రయించే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. సీఐడీ, రెవెన్యూ, రిజిస్ట్రార్‌ అధికారుల విచారణలో ఈ విషయాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం అబ్దుల్‌ మస్తాన్‌ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆయన మాట్లాడలేని స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోజు కూలీ చేసుకునే తమకు కోట్ల విలువైన భూమి కొనే స్తోమత ఎక్కడిదని వారు సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.  

అయినా ప్రభుత్వం దన్ను...
ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూదందాకు పాల్పడినట్లు స్పష్టం అవుతున్నా ప్రభుత్వం మాత్రం మౌనం వీడడంలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా ప్రభుత్వ ముఖ్యనేతతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు దన్నుగా నిలుస్తోంది. అందుకే ఆ భూమిని ఎమ్మెల్యే బొండా కుటుంబం నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకోవడమే లేదు. నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ నిర్మించిన షెడ్డూ, ప్రహరీని కూల్చివేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకునే ఉద్దేశమే లేనట్లు వ్యవహరిస్తుండటం సందేహాలకు కలిగిస్తోంది.

జీపీఏ చేసుకోవడానికి రద్దుకు మధ్యలో ఆ భూమిపై ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం పలు క్రయవిక్రయాలు నిర్వహించింది. అవన్నీ కూడా అధికారికంగా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా సీఐడీ, రెవెన్యూ అధికారులు నెమ్మదించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు మౌనం తరువాత కేసును నీరుగార్చాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది. ముఖ్యనేతతో సంప్రదింపుల తరువాత బొండా వర్గం ఎదురుదాడికి దిగడం గమనార్హం. సూర్యనారాయణ కుటుంసభ్యులపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. వారు చూపించిన పత్రాలు నకిలీవని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు అబ్దుల్‌ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను సామ, దాన, భేద, దండోపాయాలతో తమదారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్‌ అండతోనే భూ కబ్జాలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు

విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌ అండతోనే... రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలను బొండా ఉమామహేశ్వరరావు తన కనుసన్నల్లో పెట్టుకొని కబ్జాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆరోపించారు. బీసెంట్‌ రోడ్డులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొండా నడవడిక విజయవాడ చరిత్రకు మాయనిమచ్చగా నిలిచిందన్నారు. బొండా ఉమాపై మూడు నెలల కిందట సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. బొండా ఉమా దందాలలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. ఎమ్మెల్యే బొండా ఉమా బాధితులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శార్వాణి మూర్తి, వెన్నం రత్నారావు, బీసీ సెల్‌ నేత బంకా భాస్కర్, లీగల్‌ సెల్‌ నగర అధ్యక్షుడు టి.సుబ్బారావు, నగర అధికార ప్రతినిధులు కొండలరావు, మారుతి మహావిష్ణు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు