అధ్యక్షా.. ఇది సత్యదూరం

31 Jan, 2019 04:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శాసనసభలో గవర్నర్‌తో అసత్యాలు చెప్పించిన టీడీపీ ప్రభుత్వం 

అవినీతి రహిత, పారదర్శక, జవాబుదారీ పాలన అందిస్తున్నామన్న గవర్నర్‌ 

మచ్చుకైనా కనిపించని పారదర్శకత, జవాబుదారీతనం 

రైతుల రుణాలన్నీ మాఫీ చేయకుండానే.. అప్పుల ఊబి నుంచి బయటపడేశామని గొప్పలు 

అన్నదాతల ఆత్మహత్యలపైనా అబద్ధాలే 

సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తూనే.. అద్భుతంగా అమలు చేస్తున్నామంటూ స్వీయ పొగడ్తలు 

భారీగా పెట్టుబడులు,ఉద్యోగాలు వచ్చాయంటూ మభ్యపెడుతున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక, జవాబుదారీ పాలన అందిస్తున్నామంటూ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగం పూర్తిగా పడికట్టు పదాలతో సాగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతుల రుణాలన్నీ మాఫీ చేశామని, అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయికి తీసుకెళ్లామని, నాలుగేళ్లలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోలేదని గవర్నర్‌ ప్రకటించారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగమంటే రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠమే. లేని పారదర్శకత ఉన్నట్లు, సర్వాంతర్యామిలా, ఆక్టోపస్‌లా విస్తరించిన అవినీతి రాష్ట్రంలో లేనేలేదంటూ గవర్నర్‌తో చెప్పించారు. రాష్ట్ర బడ్జెట్‌ (ఓట్‌ ఆన్‌ అకౌంట్‌) సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం శాసనసభ, శాసనమండలి సభ్యులనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగం యావత్తూ అబద్ధాలు, అసత్యాలమయంగా సాగింది. గవర్నర్‌ చెప్పిన అంశాలన్నీ సత్యదూరమేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో వందలాది రహస్య జీవోలను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. దీన్నిబట్టే ప్రభుత్వం చెబుతున్న పారదర్శకత అంతా ఉత్తదేనని తేటతెల్లమవుతోంది. 

రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలా? 
చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, వీటిని మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో కలిపి ఏకంగా రూ.1.37 లక్షల కోట్లకు చేరాయి. కానీ, రైతుల రుణాలన్నీ మాఫీ చేసి, వారిని అప్పుల భారం నుంచి గట్టెక్కించామని గవర్నర్‌ తన ప్రసంగంలో వెల్లడించారు. 2014తో పోల్చితే 2015లో రైతుల ఆత్మహత్యలు ఏకంగా 322 శాతం పెరిగిపోయాయని జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 160, 2015లో 516, 2016లో 804 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది. కానీ, రాష్ట్రంలో రైతులెవరూ బలవన్మరణాలకు పాల్పడలేదని గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వం పేర్కొంది. 

సర్కారీ వైద్యం పరాధీనం 
రాష్ట్రంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలు టీడీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైనా.. అవన్నీ అద్భుతంగా అమలవుతున్నాయని గవర్నర్‌ చెప్పడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రకరకాల ఆంక్షలతో ఆరోగ్యశ్రీని ఇప్పటికే నిర్యీర్యం చేశారు. అయినా రూ.వేల కోట్లు వ్యయం చేసి ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు వేతనం కోసం సమ్మె చేస్తున్నా.. గవర్నర్‌ తన ప్రసంగంలో అంబులెన్స్‌లన్నీ తిరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పేరిట వైద్యసేవలన్నింటినీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టి రూ.కోట్లు దుర్వినియోగం చేస్తూ.. ఇప్పుడేమో పేద రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు గవర్నర్‌ చెప్పుకొచ్చారు. కిడ్నీ వ్యాధుల బాధితులకు రూ.2,500 పింఛన్‌ ఇస్తానని కేవలం 3 వేల మందికి మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ, డయాలసిస్‌ బాధితులందరికీ పింఛన్లు ఇస్తున్నట్లు గవర్నర్‌ తన ప్రసంగంలో అబద్ధాలు వల్లె వేశారు. 

విద్యారంగం అభివృద్ధి ఉత్తడొల్ల 
రాష్ట్రంలో విద్యారంగ అభివద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక నిధులు కేటాయించామంటూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘రాష్ట్రాన్ని ఒక విజ్ఞానవంత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరీకరించడానికి విద్యాశాఖ బడ్జెట్‌ కేటాయింపును 2014–15లో ఉన్న రూ.15,681 కోట్ల,నుంచి 2018–19లో రూ.24,961 కోట్లకు పెంచడమైనది’’ అని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ గణాంకాలు చూసిన వారు విస్తుపోతున్నారు. ఇందులో అసత్యాలు, అర్థసత్యాలే ఉన్నాయని విద్యారంగ నిపుణులు అంటున్నారు. అత్యధిక శాతం రెవెన్యూ ఖర్చుకే తప్ప విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేపిటల్‌ ఎక్స్‌పెండెచర్‌ కింద కేటాయించినది నామమాత్రమేనని చెబుతున్నారు. వేతనాలు, ఇతరత్రా రెవెన్యూ పద్దులకే ఎక్కువశాతం నిధులు ఖర్చవుతాయని, వాటిని చూపించి విద్యాభివృద్ధికి కేటాయింపులు పెంచేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్ర బడ్జెట్‌లో కలిపి చూపించి తాము కేటాయించినట్లు టీడీపీ సర్కారు చెప్పుకొంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులు అద్భుతంగా చూపిస్తున్నా ఆ తరువాత వాటిని విడుదల చేయడంలో, ఖర్చు చేయించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నట్లు బడ్జెట్‌ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.  

పారిశ్రామిక రంగంపైనా తప్పుడు లెక్కలు 
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో పారిశ్రామిక రంగ వృద్ధిరేటు తిరోగమన దిశలో ఉందని గణాంకాలు స్పష్టం చేస్తుండగా, దీనికి భిన్నంగా రాష్ట్రంలోకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది మందికి ఉపాధి లభించిందంటూ గవర్నర్‌ నోటితో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది. 2015–16లో 9.61 శాతంగా ఉన్న రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిరేటు 2017–18 నాటికి 8.49 శాతానికి పడిపోయింది. 2018–19లో ఇంకా తగ్గే అవకాశాలున్నాయని ప్రాథమిక గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. కానీ, ఈ నాలుగున్నరేళ్లలో 820 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించినట్లు గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వీటివల్ల రూ.1.82 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని, 2.80 లక్షల మందికి ఉపాధి లభించిందని అన్నారు. పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసింది. 810 కంపెనీల ద్వారా రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులు అందులో పేర్కొంది. శ్వేతపత్రంలోని వివరాలకు, గవర్నర్‌ ప్రసంగంలోని అంశాలకు మధ్య ఏమాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని నిపుణులు విమర్శిస్తున్నారు. 

కానరాని పారదర్శకత.. అవినీతి రహిత పాలన 
చంద్రబాబు సర్కారు అధికారంలోకొచ్చిన దగ్గర్నుంచీ పారదర్శకత, అవినీతి రహిత పాలన అంటూ ఊదరగొడుతున్నా.. మచ్చుకైనా అవి ఎక్కడా కానరావడం లేదు. అన్ని వ్యవస్థల్లో అవినీతి వేళ్లూనుకుంది. జవాబుదారీతనం ఊసే లేకుండా పోయింది. పారదర్శకత అని పైకి చెబుతూనే.. గోప్యంగానే పాలన సాగిస్తున్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి ఏదైనా ఉంది.. అంటే అది కట్టలు తెంచుకున్న అవినీతి మాత్రమేనని ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుంచి స్విస్‌ ఛాలెంజ్‌ వరకు, విశాఖ భూముల కుంభకోణం నుంచి తాత్కాలిక నిర్మాణాల పేరుతో రూ.వేల కోట్లు లూటీ చేశారు. ఇసుక, మట్టి దొంగలకు అధికారికంగా లైసెన్సు ఇచ్చి దోపిడీకి ద్వారాలు తెరిచారు. రూ.వేల కోట్లు నామినేషన్‌ విధానంలో అప్పగించి ప్రజాధనాన్ని దోచుకున్నారు. 

రాజధాని రైతులకు దగా 
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు భూసమీకరణ పథకం కింద అన్ని సౌకర్యాలతో పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి అందించామని గవర్నర్‌ చెప్పడం పచ్చి అబద్ధం. రైతులకివ్వాల్సిన ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టు పనులే ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పనుల్లో చాలావాటికి ఇంకా టెండర్లే పిలవలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15.78 లక్షల గృహాలు మంజూరు చేశామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం ఐదేళ్లలో పూర్తి స్థాయిలో 4 లక్షల ఇళ్లను కూడా నిర్మించలేదు.  

గ్రామ పంచాయతీల్లో... 
2020 కల్లా ప్రతి కుటుంబంలోని ఒక్కో సభ్యునికి 55 లీటర్ల నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పారు. అయితే గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రకారం రాష్ట్రంలో 48,363 నివాసిత ప్రాంతాలు ఉండగా అందులో 23,493 నివాసిత ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రమే ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. ఇంకా 24,470 గ్రామాలలోని ఒక్కోక్కరికి 55 లీటర్ల చొప్పున ఇవ్వడం... అది కూడా ఒక ఏడాదిలోగా ఇస్తామని చెప్పడం ఆచరణ సాధ్యం కాదని ఆ విభాగం అధికారులే చెపుతున్నారు.   

మరిన్ని వార్తలు