సిగ్గు సిగ్గు!

20 Feb, 2019 08:43 IST|Sakshi
తోటపల్లి కాలువ పనులకు కాంక్రీట్‌ వేస్తున్న మంత్రి కళా వెంకటరావు

ఎప్పుడో ప్రారంభమైన పనులకు ఇప్పుడేమో భూమి పూజ

ఉనికి చాటుకునేందుకు అధికార పార్టీ నేతల పాట్లు

శ్రీకాకుళం  ,వీరఘట్టం: అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. సుమారు ఐదేళ్లు కనీస అభివృద్ధిని పట్టించుకోని నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసేందుకు ప్రచార ఆర్భాటాలకు తెరతీస్తున్నారు. గతంలో చేసిన పనులకే శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తూ ఆర్భాటం చేస్తున్నారు. దీన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు.  మంత్రి కళా వెంకటరావు వీరఘట్టం మండలంలో మంగళవారం జరిపిన పర్యటన చూసి జనం నివ్వెర పోయారు. తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు జరుగుతున్నది తమ ఘనతే అని నాయకులు గొప్పులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడేమో సుమారు మూడు నెలల క్రితం ప్రారంభమైన కాలువల పనులకు ఇప్పుడు భూమి పూజ చేయడం.. దానికి మంత్రి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందని రైతులు, ప్రజలు అంటున్నారు. గత ఐదేళ్లుగా ఈ ప్రాంత రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోని సర్కార్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆఘమేఘాల మీద శంకుస్థాపనలు, భూమి పూజల పేరిట హంగామా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొద్ది నెలల క్రితమే పనులు ప్రారంభం
రానున్న ఖరీఫ్‌లో ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలని చెబుతూ సుమారు మూడు నెలల క్రితం తోటపల్లి కుడి, ఎడమ కాలువల లైనింగ్‌ పనులను అధికారులు ప్రారంభించారు. 37.44 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాలువలో ఐదు బృందాలు,కుడికాలువ పరిధిలో రెండు బృందాలు మట్టి పనులు చేపట్టి కాలువలను లెవిలింగ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడేమో మంత్రి కళా వెంకటరావు వచ్చి శంకుస్థాపన పేరిట భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉందని రైతులంటున్నారు.

క్షేత్ర స్థాయిలో గుర్తించని సమస్యలు
ఎన్నికల స్టంటు కోసం ఆర్భాటంగా ప్రకటించిన తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు రైతులకు అదనపు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆధునికీకరణ కోసం కాలువల పరిధిలో ఉన్న క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా యంత్రాంగం మొక్కుబడి పనులకు శ్రీకారం చుట్టడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కనీస పరిశీలన లేకుండా కాలువలకు అనుసంధానంగా ఉన్న మదుములు మూసివేయడంతో రానున్న కాలంలో సాగునీరు ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల గిమ్మిక్కుల్లో భాగంగానే టీడీపీ నాయకులు శంకుస్థాపనలు, భూమి పూజల పేరిట హడావుడి చేస్తున్నారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

21 తర్వాతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈనెల 21వ తేదీ తర్వాత ఎన్నికల కమిషన్‌ విడుదల చేయనుంది. సోమవారం ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నిక కానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడంతో జాప్యం జరిగింది. ఈ నెల 20న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ షెడ్యూల్‌ విడుదలయ్యాక జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. 

మరిన్ని వార్తలు