మేమింతే!

28 Jan, 2018 11:44 IST|Sakshi
నారా చంద్రబాబు నాయుడు

టీడీపీలో వర్గపోరు

సీఎంకు ఒకరిపై మరొకరు ఫిర్యాదు

గతంలో అమరావతికి పిలిపించి మరీ క్లాస్‌

ఇప్పటికీ కత్తులు దూస్తున్న నేతలు

కదిరి, అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, పెనుకొండలో అత్యధికం

ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం

ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కవని కొందరిలో నైరాశ్యం

తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధినేతకు ఫిర్యాదులతో బజారుకెక్కుతున్నారు. పెద్దదిక్కుగా వ్యవహరించాల్సిన మంత్రులే పోరుకు సారథ్యం వహిస్తున్నారు. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ జిల్లా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఇక టిక్కెట్లు దక్కవనే నైరాశ్యం కొందరు ఎమ్మెల్యేలను ఇంటికే పరిమితం చేస్తోంది. మొత్తంగా ‘తమ్ముళ్ల రాజకీయం’ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు చుక్కలు చూపుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోగా.. నేతల ఆధిపత్య పోరుతో పార్టీ పరువును దిగజారుస్తోంది. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ అగాథం నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడున్నరేళ్లలో వీరిద్దరూ ఏమి చేశారనే ప్రశ్న వేసుకుంటే మౌనమే సమాధానమవుతోంది. కదిరిలో అత్తార్, కందికుంట ప్రసాద్‌ ఇప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. పెనుకొండలో బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్పల మధ్య ఆధిపత్య పోరు పార్టీ పునాదులను కుదిపేస్తోంది. రాయదుర్గం, తాడిపత్రి, పుట్టపర్తితో పాటు పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం తెలుసుకున్న చంద్రబాబు 8–10 నెలల కిందట నేతలందరినీ అమరావతికి పిలిపించి ‘క్లాస్‌’ తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం అనంతపురంలో ఎలా ఉందో ఎప్పటికప్పుడు తాను రిపోర్టులు తెప్పించుకుని పరిశీలిస్తున్నానని చెప్పి.. అప్పట్లో రిపోర్టులు బయటపెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీకి 20–30 శాతం లోపు నష్టం వాట్లిల్లితే..  కృష్ణా జిల్లాలో 56శాతం, గుంటూరులో 52శాతం నష్టం జరిగిందనే రిపోర్టలతో కంగారు పడ్డానన్నారు. ఇందుకు భిన్నంగా అనంతపురంలో పార్టీకి జరిగిన  నష్టం 92శాతం ఉందనే రిపోర్టు తనను కలవర పర్చిందని ఆ సందర్భంగా నేతలపై సీఎం చిర్రుబుర్రులాడినట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ నాయకుల తీరులో మార్పు లేకపోవడం గమనార్హం.

‘అనంత’లో తారాస్థాయికి ఆధిపత్య పోరు
2019 ఎన్నికల్లో ప్రభాకర్‌ చౌదరికి టిక్కెట్టు దక్కకుండా చేసేందుకు జేసీ దివాకర్‌రెడ్డి మొదటి నుంచి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో గురునాథరెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశ చూపి టీడీపీలోకి తీసుకొచ్చారు. దీంతో పాటు తనవర్గం కార్పొరేటర్లతో మేయర్‌ స్వరూపను కూడా ఇబ్బంది పెట్టడుతున్నారు. ఫలితంగా ‘అనంత’లో టీడీపీ మూడు ముక్కలైంది. చౌదరికి టిక్కెట్టు రాకూడదని జేసీ వర్గీయులైన కోగటం విజయభాస్కర్‌రెడ్డి,  జయరాంనాయుడుతో పాటు మరికొందరు నేతలు ఇన్ని రోజులు పని చేశారు. ఇప్పుడు గురునాథ్‌రెడ్డి రూపంలో చౌదరికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఆయనకు టిక్కెట్టుకు ఇస్తే ప్రభాకర్‌చౌదరి అసలు టీడీపీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మేయర్‌ కలిసి కార్పొరేషన్‌లో విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని దివాకర్‌రెడ్డి ఏకంగా పలుసార్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. దివాకర్‌రెడ్డి వైఖరితో పార్టీకి నష్టం వాటిల్లుతోందని మేయర్, ఎమ్మెల్యే కూడా బాహాటంగానే విమర్శిస్తున్నారు.

కదిరిలో రచ్చ...రచ్చ..
కదిరిలో వైఎస్సార్‌సీపీ నుంచి వలస వెళ్లిన చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంటప్రసాద్‌ల మధ్య వివాదం ముదిరిపాకన పడింది. అత్తార్‌ రాకను జీర్ణించుకోలేని కందికుంట, ఆయన వర్గం ప్రతీ అంశంలోనూ చాంద్‌బాషాను విభేదిస్తున్నారు. చాంద్‌బాషా కూడా టీడీపీ కేడర్‌తో సర్దుకునిపోలేక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పర్చుకునేందుకు పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కదిరిలో మొదటి నుంచి టీడీపీ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలతో మరింత బలహీనపడింది. కందికుంటకు చెక్‌బౌన్స్‌ కేసులో శిక్షపడటంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు విషయంలో తనకు పోటీ లేదని నేతలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చాంద్‌బాషా చేస్తున్నారు. కార్పొరేటర్‌స్థాయి కూడా లేని చాంద్‌బాషాను ఎమ్మెల్యేని చేస్తే పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారని, ఆయన్ను నమ్మి చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చే ప్రసక్తే లేదని కందికుంట ప్రచారం చేస్తున్నారు.

వరదాపురం వర్సెస్‌ పరిటాల
ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల వర్గీయుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు మంత్రి సునీతతో వరదాపురం సూరి పూర్తిగా విభేదిస్తున్నారు. ఇరువర్గాల మధ్య ధర్మవరంలో పలుసార్లు ఘర్షణ కూడా జరిగింది. ఇద్దరినీ పిలిపించి సీఎం క్లాస్‌ తీసుకుంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తీరు మారని పరిస్థితి. ఇటీవల మాల్యవంతంలో జాతరకు పరిటాల శ్రీరామ్‌ వెళ్లారు. ఇదే సమయంలో సూరితో పాటు బీకే పార్థసారథి వచ్చారు. ఇద్దరూ ఎదురుపడ్డా పలకరించుకోకుండా వెళ్లిపోయారు. ధర్మవరంలో సూరికి ఎలాగైనా చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో పరిటాల వర్గం వ్యూహం రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన ధర్మవరం, రాప్తాడులో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు ఏస్థాయిలోకి వెళతాయోనని అక్కడి జనాలు బిక్కుబిక్కుమంటున్నారు.

అన్నిచోట్లా ఇంతే..
రాయదుర్గంలో ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డిని మంత్రి కాలవ పూర్తిగా పక్కనపెట్టారు. ఎన్నికల్లో సహకరించిన పాపానికి కాలవ తనను పూర్తిగా పక్కనపెడుతున్నారని మెట్టు కూడా అసంతృప్తితో ఉన్నారు. దీపక్‌రెడ్డి, గోవిందరెడ్డి కలిసి ఇద్దరిలో ఎవరో ఒకరం టిక్కెట్టు తెచ్చుకుందాం.. కాలవకు మాత్రం రాకూడదనే రీతిలో పని చేస్తున్నట్లు సమాచారం. గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేసీ వర్గం సహకరించింది. ఈ సాన్నిహిత్యంతో కాలవకు వ్యతిరేకంగా ఇద్దరూ ఏకమయ్యారు. ఇది గ్రహించిన కాలవ విభేదాల మధ్య, కాపు రామచంద్రారెడ్డిపై గెలవడం కష్టమనే యోచనతో గుంతకల్లు బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

 మడకశిరలో ఎమ్మెల్యే ఈరన్నను పూర్తిగా పక్కనపెట్టి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇది ఈరన్న జీర్ణించుకోలేకపోతున్నారు. విభేదాల పరిస్థితి ఇలా ఉంటే మంత్రులతో పాటు చీఫ్‌విప్, విప్‌ అంతా కలిసి జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని టీడీపీ ప్రజాప్రతినిధులపై ‘అనంత’వాసుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీ, హెచ్చెల్సీ నీటి వాటాల్లో అలసత్వం, తదితర అంశాలతో పాటు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం ఆలోచన లేదని, నేతలు ఆర్థికంగా ఎదగడం మినహా ఇంకేదీ లేదనే బాధ ప్రజల్లో కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు