ప్రజాస్వామ్యం ఖూనీ!

12 Jul, 2016 01:37 IST|Sakshi

పోలీసులను ఆయుధంగా  మార్చుకున్న దేశం
రాజ్యాంగేతరశక్తిగా ముఖ్యనేత,  ఆయన తనయుడు
జిల్లాలో కొనసాగుతున్న అణచివేత...అరాచకాలు
ఆ రెండు నియోజకవర్గాల్లో    ఆ ఇద్దరు చెప్పిందే శాసనం

 
 
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉంటూ సమాజంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్న వైనంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్నా మరో వైపు అణచివేత, అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాకు చెందిన ముఖ్య నేత, ఆయన తనయుడు రాజ్యాంగేతరశక్తిగా మారి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తూ ప్రజలకు  నరకం చూపిస్తున్నారు. పోలీసులను ఆయుధంగా మలచుకొని తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో వారు చెప్పిందే శాసనం. కన్ను పడితే కబ్జానే.. వ్యాపారమైనా, భవన నిర్మాణమైనా, చివరకు లాటరీ తగిలినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనంటున్నారు.  - సాక్షి, గుంటూరు
 

గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో  ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత, ఆయన తనయుడు సాగిస్తున్న          అరాచక పాలన  చూస్తే భీతిల్లాల్సిందే. దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు, అక్రమ రవాణా, నెలవారీ వసూళ్లు ఇలా పలు రకాల నియంతృత్వ పోకడలు అనుసరిస్తూ వివిధ వర్గాలను పీల్చిపిప్పి చేస్తున్నారు. వీరి వ్యవహారశైలికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయకంపితులవుతున్నారు. వ్యాపారులు సైతం కలవరపాటుకు గురవుతున్నారు.
 
నరకాసుర కోటగా ....

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నరసరావుపేటను సరకాసుర కోటగా మార్చేశారు. సత్తెనపల్లిని సర్వ నాశనం చేసేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎవరైనా సరే ముఖ్యనేత తనయుడు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఆయనకు కావాలంటే సొంత భూమినైనా వదిలేసి వెళ్లాల్సిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో కేబుల్ నెట్‌వర్క్ నడుపుతున్న వారిని బెదిరించి తమ కనెక్షన్లు మాత్రమే ఉండాలంటూ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. నరసరావుపేట పట్టణంలో ఏడాది కిందట జీసీవీని తనకు అప్పగించాలంటూ ఆదేశించారు. అందుకు అంగీకరించకపోవడంతో తన గూండాలను పంపి దాడులకు తెగబడ్డారు.కార్యాలయంపై దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. నేటికీ ఆ కేసులో ఒక్క నిందితుడిని కూడా గుర్తించని పరిస్థితి.

ఎన్‌సీవీని నిర్వీర్యం చేయాలనే...
పట్టణంలో నడుస్తున్న ఎన్‌సీవీని సైతం నిర్వీర్యం చేసి తన చానల్ మాత్రమే ఉండాలనే పథక రచన చేశారు. ఎన్‌సీవీ నుంచి కనెక్షన్లు తీసుకుంటున్న కేబుల్ ఆపరేటర్‌లను ఒక్కొక్కరినీ బెదిరిస్తూ తమ వైపున కు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిత్యం కేబుల్ వైర్‌లు కట్ చేయడం.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంత చేసినా ఎన్‌సీవీ యాజమాన్యం లొంగకపోవడంతో సోమవారం సాయంత్రం ఎన్‌సీవీ కార్యాలయంపై తన గూండాలతో దాడి చేయించి వైర్‌లు కట్ చేయడమే కాకుండా కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు విన్నవిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు