ఓటుకు నోటు.. ఆపై ఒట్టు.!

22 Mar, 2019 08:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ బరితెగిస్తోంది. నిజాయితీగా వెళ్తే గెలవలేమనుకుందో ఏమో ‘అడ్డదారుల్లో’ దూసుకెళ్తోంది. సార్వత్రిక ఎన్నికల గంట మోగడానికి చాలా రోజుల ముందు నుంచే ఓటర్లకు ఎర వేసే పనిలో నిమగ్నమైన ఆ పార్టీ.. ఇప్పుడు గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే ఒక వర్గం ఓటర్లపై కన్నేసింది. ఇందుకోసం స్థానిక నాయకులు, ద్వితీయశ్రేణి నేతలను రంగంలోకి దిచ్చింది. ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు జరిగే సమయానికి వెళ్లడం, అక్కడ డబ్బులు పంచడం, తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని వారితోనే ప్రతిజ్ఞ చేయించడం సర్వసాధారణమైంది. 

నిర్వాహకులతో బేరాలు..
కొన్ని చోట్ల ప్రార్థనాలయాల నిర్వాహకులతోనే ఓట్ల బేరం పెడుతున్నట్లు తెలుస్తోంది. మీ వద్దకు ఎంతమంది వస్తారు? ఎంత మందిని ఒప్పించగలరు? ఎన్ని ఓట్లు వేయించగలరు? అని తేల్చుకుని ఆయనకే గంపగుత్తగా సొమ్ములందిస్తుండటం విశేషం. అధికారపార్టీ ఎంపీ అభ్యర్థులు ఇందుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులందరికీ వారు ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వల ఆ వర్గం వారికే..  
పెడన, విజయవాడ తూర్పు, సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నిరుపేదలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై అధికార పార్టీ నేతలు గురిపెట్టారు. సెంట్రల్‌లోని మాచవరం, మొగల్రాజపురం, కొండప్రాంతాలు, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, తూర్పులోని కృష్ణలంక తదితర ప్రాంతాల్లో ఇది జోరుగా సాగుతోంది. డబ్బుతోపాటు ఆ పార్టీ నాయకులు మతం కార్డునూ ఉపయోగిస్తున్నారు. మనందరిదీ ఒకే మతమని మనకే ఓటు పడాలని తప్పుడు పద్ధతుల్లో ప్రచారానికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. 

నేతల లెక్కలు..
నియోజకవర్గం మొత్తం ఓట్లు ఎన్ని? అందులో పోలయ్యే ఓట్లు ఎన్ని?  వాటిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వస్తాయనే అంచనాల్లో అధికారపార్టీ నేతలు ఉన్నారు. ఎన్ని ఓట్లు వస్తే గెలుపునకు వీలుంటుంది. ఎవరెవరు ఎన్ని ఓట్లు చీలుస్తారు? అనే విషయాలను పోలింగ్‌ కేంద్రం వారి లెక్కలు తీస్తున్నారు. పార్టీ ఓట్లు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా వచ్చే ఓట్లు ఎన్ని? కొనుగోలు చేయాల్సినవి ఎన్ని? ప్రభావితం చేయగల నాయకులు ఎవరు? అనే అంచనాల్లో అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులు తలమునకలై ఉన్నారు. ఓట్ల కొనుగోలు ఎలాగూ తప్పదనే నిర్ణయానికి వచ్చిన అధికారపార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.  

ఓటుకు రూ. వెయ్యి..
విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓట్ల కొనుగోళ్లకు తెరతీశారు. ఓటుకు రూ. 1,000 తక్కువ కాకుండా ఇస్తున్నారు. ఓ అభ్యర్థి అయితే రెండు రోజుల కిందటే ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆయన గెలుపే ధ్యేయంగా నియోజకవర్గంలోని 75 శాతం మంది ఓటర్లకు డబ్బు అందేలా చూడాలని తన అనుచరులకు హుకుం జారీ చేశారు. అలాగే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 500 నుంచి రూ. 1,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నమ్మకం లేని కొందరు అభ్యర్థులు డబ్బులు ఇచ్చిన తర్వాత ఓటర్ల వద్ద ప్రమాణాలు చేయించుకుంటారనేది విశ్వసనీయ సమాచారం. 

జాప్యమైతే నష్టమని..
జాప్యమయ్యే కొద్దీ ఒత్తిడి పెరుగుతుందని, పోలీసులు, ప్రత్యర్థుల పర్యవేక్షణ పెరుగుతుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. అందువల్లే ప్రచారం సమయం పూర్తయ్యేలోగా నగదు పంపిణీ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు