పోలీసుల అండతో రభసకు స్కెచ్‌..

17 May, 2019 10:39 IST|Sakshi

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : గత నెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పలు కుట్రలకు పాల్పడింది. ప్రభుత్వ సొమ్ముతో ఓటుకు నోటు వంటి పలు తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. అధికార పార్టీ గిమ్మిక్కులను పసిగట్టిన ఓటర్లు టీడీపీకి ముఖం చాటేసినట్టు స్పష్టమవుతోంది. దీంతో అభాసుపాలవుతామని భావిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఎన్నికల కౌంటింగ్‌లో అల్లర్లు సృష్టించి అవకతవకలకు పాల్పడాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని పేరుగాంచిన నేరచరిత్ర గల వ్యక్తుల కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అ«ధిష్టానం సూచనల మేరకు భూకబ్జాదారులను, రియల్టర్లను పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు సమీక్షలు, సమావేశాలు జోరుగా జరుపుతున్నారు. 

సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓటింగ్‌ సరళిని నిశితంగా పరిశీలించిన టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.  పోలింగ్‌ రోజు నుంచి ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌పై అభాండాలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. పోలింగ్‌ రోజున సాక్షాత్తు మంత్రులు, ప్రధాన టీటీడీ నేతలు పలుచోట్ల కుట్రలు పన్ని అల్లర్లు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే తరహాలో ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు, వివాదాలు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 
 

అధిష్టానం స్పష్టమైన ఆదేశం 
ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తూ తమకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చే సమయంలో ఏజెంట్లుగా ఉన్న వ్యక్తులు వివాదాలు సృష్టించి కౌంటింగ్‌ ప్రక్రియను ఆపే కుటిల యత్నానికి టీడీపీ సిద్ధపడుతోంది. దీనికి టీడీపీ అధిష్టానం ప్రత్యేక ప్రణాళికతో ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. తిరుపతి కేంద్రంగా ప్రధాన హోటళ్లల్లో ఈ తంతు ప్రతినిత్యం భూకబ్జాదారులు, బడా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ జిల్లాకు చెందిన నేర చరిత్ర గల వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. వీరిలో ప్రధానంగా భూకబ్జాదారులు, టీడీపీకి చెందిన బడా కాంట్రాక్టర్లు, కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన రౌడీషీటర్లను రప్పించే ఏర్పాట్లు చేశారని తెలిసింది. వారికి కోట్లల్లో ముడుపులు చెల్లించేందుకు భూకబ్జా మాఫియా ప్రణాళిక సిద్ధం చేసింది. 
 

పోలీసులపై ఒత్తిడి
ఎన్నికల నిబంధనల మేరకు కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమితులైన వ్యక్తులపై బైండోవర్, ఎటువంటి కేసులు ఉండకూడదు. అయితే టీడీపీ ఏజెంట్ల పాసుల కోసం ఆపార్టీ అందజేసిన జాబితాలో పలువురిపై బైండోవర్‌ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిపై నామమాత్రపు విచారణతో సరిపెట్టాలని పోలీసు యంత్రాంగంపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఓటమి భయంతో కౌంటింగ్‌ తమకు అనుకూలంగా లేకపోతే చిన్న సమస్య ఎదురైనా అధికారులపై విరుచుకుపడి అలజడులు సృష్టించి ప్రత్యర్థి పార్టీ  ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు భారీ స్కెచ్‌ వేస్తున్నట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు