‘ఉపాధి’లో అక్రమాలు

7 Mar, 2019 15:41 IST|Sakshi
యంత్రాలతో చదును చేసిన నేల 

సాక్షి,రేగులచెలక(ప్రకాశం) : కూలీలకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకులు చేతివాటం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మండలంలోని రేగులచెలకలో యంత్రాలతో పనులు చేయించి కూలీలు పనులకు రాకున్నా మస్టర్లు వేసి కూలి నగదు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు కూలీలు ఒక్కొక్కరు ముందుగా రూ.100 వంతున చెల్లిస్తే ఆరు రోజుల కూలీగా రూ.600 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.

పనికి రాకుండా కూలీ చెల్లించడంతో ఎన్నికలలో ఓటు పరంగా కూడా లబ్ధి పొందొచ్చనేది టీడీపీ నాయకుల ఆలోచన. ఈ ఒప్పందంలో భాగంగా రేషన్‌ షాపు బినామీ డీలర్‌ అడియారం తిరుమలకొండయ్య కూలీల నుంచి నగదు వసూలు చేశారు. దాదాపు రూ.25 వేల నగదు కలెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆపై గ్రామానికి తూర్పు వైపున రాళ్లవాగు సమీపంలో ఉన్న చిట్టోడి కుంటలో యంత్రాల ద్వారా పనులు చేయించారు. పొక్లెయిన్‌తో నేలనుతవ్వి, ఆపై చదును చేసి మట్టిని కువ్వగా పోసి కూలీలతో పనులు చేయించినట్లు చూపించే ప్రయత్నం చేశారు.


యంత్రాలతో తీసుకెళ్లి కుప్పగా పోసిన మట్టి  

యంత్రాల ద్వారా పని చేయించినందుకు రూ.6 వేలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నగదు టీడీపీ నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అధికార పార్టీ నాయకుల అక్రమాలను నియంత్రించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీఓ జి.రాంబాబును స్థానిక ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా యంత్రాలతో పనులు చేపడితే బిల్లులు చెల్లింపులు నిలిపేస్తామని వివరించారు. 

మరిన్ని వార్తలు