అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం

3 Oct, 2019 09:29 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న టీడీపీ కార్యాలయ భవనం 

సాక్షి, మంగళగిరి (గుంటూరు) : మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట సర్వే నంబర్‌ 392లో 3 ఎకరాల 65 సెంట్ల భూమిని టీడీపీ కార్యాలయానికి 99 సంవత్సరాలపాటు ప్రభుత్వం లీజుకు కేటాయించింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి రూపాయల లీజుకి కేటాయిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.అప్పటికే అదే భూమిని ప్రభుత్వం 1974లో గ్రామానికి చెందిన బొమ్ము రామిరెడ్డికి 65 సెంట్లు, కొల్లా రఘురాఘవరావుకు 1 ఎకరం 75 సెంట్లు, కొల్లా భాస్కరరావుకు 1 ఎకరం 75 సెంట్లు పట్టాలు మంజూరు చేసింది. రైతులు వ్యవసాయం చేసుకుంటుండగా అధికారం అండతో వారి భూమిని బలవంతంగా లాక్కుని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ విషయమై రైతులు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. అయినా ఆ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. కోర్టు స్టేటస్‌ కో ఉందని అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా దాంతోపాటు పక్కనే ఉన్న బొమ్ము రామిరెడ్డికి చెందిన 65 సెంట్లతోపాటు మరో పక్కన ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. రెండు బేస్‌మెంట్‌లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్‌మెంట్‌లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తుండడం గమనార్హం. 

వందల కోట్లతో... అత్యాధునిక సాంకేతికతో
టీడీపీ కార్యాలయం రూ.వందల కోట్లతో నిర్మిస్తున్నారు. భూమి లోపలకు 3 అంతస్తులు భూమిపైన మరో నాలుగు అంతస్తులతో మొత్తం ఏడు అంతస్తుల నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ భవన నిర్మాణంలో వాహనాల పార్కింగ్‌కు ఒక ఫ్లోర్, 5 వేల మందికి సమావేశ మందిరం, భోజనశాల, వంట గది, చంద్రబాబుకు ప్రత్యేక నివాసం, పార్టీ కార్యాలయం ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కో విధంగా తీర్చిదిద్దుతున్నారు. లోపల నిర్మాణం కోసం వాడుతున్న ఉడ్, ఫర్నిచర్, ఇంటిరీయల్‌ డిజైన్‌ మొత్తం సింగపూర్, మలేషియానుంచి దిగుమతి చేసుకుంటున్నారు. భవన నిర్మాణాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికోసారి పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేసి చంద్రబాబు మకాం ఇక్కడకు మార్చాలని ఆలోచిస్తున్నారు.  

నోటీసులు జారీ చేస్తాం
టీడీపీ కార్యాలయానికి కేటాయించిన భూమితోపాటు పక్కన ఉన్న కాలువ పోరంబోకును పూడ్చి నిర్మిస్తున్న విషయం మా పరిశీలనలో తేలింది. ఎంత మేర పూడ్చి ఎంత భూమిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారో మరోసారి పరిశీలించి నిర్మాణదారులకు నోటీసులు జారీ చేస్తాం. 
 –తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌

మరిన్ని వార్తలు