టీడీపీ నేతల ‘దారి’ దోపిడీ!

25 Jun, 2019 10:20 IST|Sakshi
జీప్లస్‌త్రీ నివాసాల మధ్య వేసిన రోడ్డు మట్టిని జేసీబీతో యథాస్థానానికి తరలిస్తున్న దృశ్యం 

అంతర్గత రోడ్ల నిర్మాణంలో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం

జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయింపు

సాక్షి, ప్రకాశం : కందుకూరులో టీడీపీ నాయకులు ‘దారి’ దోపిడీకి తెగబడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతర్గత రోడ్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్ల నిర్మాణానికి బయట ప్రదేశం నుంచి గ్రావెల్‌ తోలాల్సి ఉండగా, పక్కనే పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో భారీ గోతులు తవ్వి ఆ మట్టిని తరలించారు.కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్ద ఎన్‌టీఆర్‌ నగర్‌ పేరుతో నిర్మిస్తున్న జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అక్కడ నివాసం ఉండే పేదలకు మౌలిక వసతులతో పాటు అంతర్గత రోడ్లు నిర్మించాలి. అందుకోసం అప్పటి ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది.

ఈ నిధులతో సింగరాయకొండ మండంలోని శానంపూడి గ్రామ వద్ద నుంచి గ్రావెల్‌ మట్టిని తోలి రోడ్ల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ టీడీపీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా తాము ఏమిచేసినా చెల్లుతుందని ఇష్టానూసారంగా వ్యవహరించారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉండగా మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో శానంపూడి నుంచి మట్టిని తొలకుండా జీప్లస్‌త్రీ భవనాల పక్కనే  గతంలో మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూముల్లో మట్టి తవ్వి అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పేదలకు చెందిన 6 ఎకరాల భూమిలో 9 అడుగుల తోతున మట్టి తవ్వి.. జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద రోడ్లు వేసి నిధులు బొక్కేందుకు పథకం రచించారు. అయితే టీడీపీ ఘోర ఓటమి చెందడం.. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం బయట పడింది.

యథాస్థానానికి మట్టి తోలకం
స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గతంలో çపురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్‌ చూపించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి స్థలాల పరిశీలన కోసం వెళ్లగా 9 అడుగుల లోతున గోతులు తవ్విన విషయం బయటపడింది. టీడీపీ నాయకులు 
యథేచ్ఛగా మట్టి తవ్వి జీప్లస్‌త్రీ నివాసాల వద్ద అంతర్గత రోడ్లు నిర్మిస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూశారు. టీడీపీ నాయకుల అక్రమాలు, అధికారుల ఉదాసీన వైఖరి బయట పడటంతో తప్పును చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కమిషనర్‌ వి.శ్రీనివాసరావు జీప్లస్‌త్రీ ఇళ్లు నిర్మిస్తున్న కంపెనీకి నోటీసులు జారీచేశారు.

దీంతో ఆ కంపెనీ యాజమాన్యం రెండు రోజుల నుంచి జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్లకు తోలిన మట్టిని జేసీబీ సహాయంతో మరలా పేదలకు పంపిణీ చేసిన లే అవుట్లలోని గోతులను పూడ్చే పనిని ముమ్మరం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అధికారులను ఆ పార్టీ నాయకులు ప్రలోభపెట్టి బిల్లులు చేసుకుని జేబులు నింపుకొనే వారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జీప్లస్‌త్రీ ఇళ్లకు సంబంధించిన ఓ అధికారిని వివరణ కోరగా గత ప్రభుత్వంలో టెండర్లు పిలవకుండానే టీడీపీ నాయకులు మట్టిని తోలారని, అందువల్ల ప్రభుత్వ ఆదేశాలతో రోడ్లకు సంబంధించిన పనులు రద్దు చేసినట్లు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు