కదులుతున్న అవినీతి డొంక

30 Oct, 2019 07:59 IST|Sakshi
కాకినాడలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ కార్యాలయం

ఐదేళ్లలో టీడీపీ అడ్డగోలు వ్యవహారాలపై విచారణ కమిటీ

డీసీసీబీ అక్రమాలపై మంత్రి కన్నబాబు ప్రత్యేక దృష్టి 

51’ విచారణకు ఆదేశం

విచారణ అధికారిగాబీకే దుర్గాప్రసాద్‌

సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల ఏలుబడిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వెచ్చించిన వ్యవహారాలపై సహకార చట్టంలోని కీలకమైన ‘51’ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని డీసీసీబీ వ్యవహారాలపై ఆరోపణలు రావడాన్ని వ్యవసాయ, సహకారశాఖా మంత్రి కురసాల కన్నబాబు కూడా తీవ్రంగా పరిగణించారు. రైతుల పక్షాన నిలవాలి్సన డీసీసీబీ యంత్రాంగం, ప్రతినిధులు సహకార స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని ఉపేక్షించరాదని భావిస్తున్నారు.

అవినీతి డొంక కదిలిందిలా...
డీసీసీబీలో గడచిన ఐదేళ్లలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ప్రాథమిక నివేదికను పరిశీలించాక డీసీసీబీ వ్యవహారాలపై విచారణాధికారిగా అమలాపురం డివిజనల్‌ సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. సహకార శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ ఈ మేరకు విచారణాధికారి నియామక ఆదేశాలు జిల్లా సహకార అధికారికి జారీ చేశారు. దుర్గాప్రసాద్‌ విచారణ రెండు రోజుల కిందటే మొదలు పెట్టాల్సి ఉంది. ఈ నెల 25నే విచారణ అధికారి నియామకం జరిగినా 27వ తేదీ అమావాస్య కావడంతో మంచి ముహూర్తం చూసుకుని విచారణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. విచారణ మొదలు పెట్టిన తేదీల దగ్గర నుంచి ఆరు నెలల కాలంలో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

2013 నుంచి 2019 వరకూ విచారణ...
గత పాలక వర్గ  పదవీకాలం 2013 ఫిబ్రవరి నుంచి 2019 మార్చి వరకూ జరిగిన కార్యకలాపాలపై నిశిత పరిశీలన జరిపి అన్ని లావాదేవీల గుట్టును ఈ విచారణ ద్వారా రట్టు చేయాల్సిన బాధ్యత విచారణాధికారికి ప్రభుత్వం అప్పగించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ వరుపుల రాజా, తొలి సీఈఓ హేమసుందర్‌ (రిటైర్‌ అయ్యారు), ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు హయాంలో నడిచిన ప్రతి కార్యకలాపాన్నీ విచారించి నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ‘సాక్షి’లో మంగళవారం ‘ఇదేమి సహ‘కారం’ శీర్షికన ప్రచురితమైన కథనం కూడా విచారణలో ఒక అంశంగా తీసుకుంటున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌కు నివేదిక అందిస్తారు. ఈ విచారణలో అవినీతి రుజువైతే  చట్టపరమైన సివిల్, క్రిమినల్‌ చర్యలు తప్పవని భావిస్తున్నారు.

ప్రాథమిక నివేదికతో కదిలిన ప్రభుత్వం...
డీసీసీబీలో చోటుచేసుకున్న అవినీతి, అవకతవకలపై జిల్లా సహకార యంత్రాంగం అందజేసిన ప్రాథమిక నివేదిక చూసి సహకార ఉన్నతాధికారులు నిర్ఘాంతపోయారని సమాచారం. అడ్డగోలు కొనుగోళ్లు, బిల్లులు లేకుండా భవంతుల నిర్మాణం, నిబంధనలు తుంగలోకి తొక్కి విహార యాత్రలు, స్టడీ టూర్ల పేరుతో విచ్చలవిడిగా రైతుల లాభాల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేయడం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం వీటన్నింటినీ నిగ్గు తేల్చాలంటే 51 విచారణ ఒక్కటే మార్గమని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా సహా పలువురు ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ యాత్రలు కూడా డీసీసీబీ నుంచి డబ్బులు భారీగా డ్రా చేయడం, కార్లు కొనుగోళ్లు, కాకినాడ దేవాలయం వీధిలోని డీసీసీబీ బ్రాంచికి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన స్థలం బ్యాంకు ఉ ద్యోగుల సంఘానికి అప్పనంగా కట్టబెట్టడం తది తర విషయాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. 

మరిన్ని వార్తలు