కార్డు కావాలా... కమిటీనడగండి..

15 Jan, 2016 00:19 IST|Sakshi

 పథకాలు క్షేత్రస్థాయిలో పేదలకు అందుతున్నాయా లేదా? పర్యవేక్షించేందుకు టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను నియమించింది. ప్రభుత్వ యంత్రాంగానికి సహకారం అందించేందుకు ఏర్పాటైన కమిటీలకు ఇప్పుడు ఏకంగా అమలు బాధ్యతలను కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తోంది. చట్టబద్ధత లేని ఈ కమిటీ సభ్యులు తమకు నచ్చినవారికి లబ్ధి చేకూర్చే ప్రక్రియ మొదలు పెట్టారు. తాజాగా ఇస్తున్న రేషన్ కార్డులను సైతం వీరి చేతిలో పెడుతూ ప్రభుత్వం మెమోను జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
 
 శ్రీకాకుళంటౌన్/వీరఘట్టంః
 ఇటీవల జన్మభూమి మూడోవిడత లో కొత్తరేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధపడింది. రెండువిడతల జన్మభూమి కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని చెప్పిన పాలకులు జిల్లాలో వచ్చినదరఖాస్తులన్నింటిని కార్డు కావాలా... కమిటీనడగండి..
 
 జన్మభూమి కమిటీల పరిశీలనకు పంపించాలని ఆదేశించారు. రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 1.01లక్ష మంది రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంతో వాటిని తిరిగి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీ పరిశీలనకు పంపించారు. వాటిని తిరిగి ఆన్‌లైన్ చేసినపుడు 81,379 దరఖాస్తులు మాత్రమే పూర్తిస్థాయి ఆదారాలతో నమోదయ్యాయి. ఆన్‌లైన్లో నమోదైన వాటిలో జాయింట్ కలెక్టరు వివేక్‌యాదవ్ 78,188 దరఖాస్తులను పరిశీలించి కార్డు జారీకి అనుమతించారు.
 
  కానీ జన్మభూమి కమిటీ అభ్యంతరాల దృష్ట్యా 60,883 కుటుంబాలకు కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన అధికారులు వాటిని సభ్యుల పర్యవేక్షణలో గ్రామసభల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. 38,083 కార్డులకు పోటోలు ముద్రించక పోవడంతో పంపిణీ చేయడానికి అభ్యంతరాలు తలెత్తాయి. మిగిలిన 22,570 కార్డులను గ్రామాల్లో పంపిణీకి సిద్ధమైనా వాటిలో కుటుంబ యజమాని తప్ప మిగిలిన వారిపేర్లు గల్లంతయ్యాయి. దీంతో 4వేల రేషన్‌కార్డులు పంపిణీ చేసి మిగిలినవి జన్మభూమి కమిటీలకు అప్పగించారు.
 
 సొమ్ము చేసుకుంటున్న జన్మభూమి కమిటీలు
 రేషన్ కార్డులు చేతికి రావడంతో ఒక్కోకార్డుకు జన్మభూమి కమిటీ ఒక్కోధర నిర్ణయించి గ్రామాల్లో అక్రమ వసూళ్లకు తెర తీశారు. ప్రస్తుతం అన్ని పథకాలకు రేషన్‌కార్డు,ఆధార్ కార్డు తప్పని సరి. దీంతో జిల్లాలో కార్డులేనివారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే 8లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉంటే కొత్తగా మరో లక్షమంది దరఖాస్తు చేసుకున్నారంటే గిరాకీ అర్థమవుతోంది. ఇదే అదనుగా జన్మభూమి కమిటీలు కార్డుకు ధర నిర్ణయించి అమ్ముకుంటున్నారన్న విమర్శలు గ్రామాల్లో వినపిస్తున్నాయి.
 
 చట్టబద్దత లేనివారి చేతికి కార్డులెలా ఇస్తారు?
 -గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖ పర్యవేక్షకునిగా ఉన్న వీఆర్‌ఓలను, ప్రజాప్రతినిదిగా ఎన్నికైన సర్పంచ్,ఎంపిటిసిలను కాదని కార్డులను జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టడం వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల జన్మభూమి గ్రామసభల్లో అనేక చోట్ల కమిటీల జోక్యం వివాదాస్పదమైంది. ఈ విధాలను పక్కనపెట్టిన ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు రేషన్ కార్డులను అప్పగించాలంటూ పౌరసరఫరాశాఖ కమిషనర్ నుంచి మెమో జారీ కావడంతో అటు రెవెన్యూ ఉద్యోగులు, ఇటు ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు