చెప్పేది ఘనం.. చేసింది శూన్యం..

16 Mar, 2019 14:34 IST|Sakshi
పట్టాలకు నోచుకోని ఉప్పుకొఠారు భూములు

ఐదేళ్లలో సెంటు భూమైనా పంచారా..?

మత్స్యకారులకు మొండిచేయే

భూముల ఆన్‌లైన్‌ చేయాలని రైతుల గోడు అరణ్యరోదనే

అంత చేశాం..ఇంత చేశాం..అని గొప్పలు చెప్పుకోవడమే గానీ ఎంత చేశారని ప్రశ్నిస్తే..సమాధానం మాత్రం ఉండదు. నాలుగు రోడ్లేసి అభివృద్ధి ఇదేనంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడమే గానీ..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోరు. మా సమస్యలను పరిష్కరించడని అడిగితే అదిలించి..బెదిరించి భయపెట్టారే గానీ సమస్యను మాత్రం పరిష్కరించలేదు.

సాక్షి, కొత్తపట్నం (ప్రకాశం): ‘అది 2014 ఎన్నికల సమయం.. అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే జనార్దన్‌రావు ఎంతో వినయంగా నన్ను గెలిపిస్తే మీరు అడిగిన హామీలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అదంతా అబద్ధమేనని తెలుసుకోవడానికి మండల ప్రజలకు ఎక్కువ రోజుల పట్టలేదు. ఈ ఐదేళ్లలో ఏం చేశారంటే..చేసింది శూన్యమే..ఏవో నాలుగు ప్రాంతాల్లో నాలుగు రోడ్లేసి ఇదే అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం ఇచ్చారు. ఇక జన్మభూమి గ్రామాల్లో సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో బయటకు పంపించడమో, స్టేషన్‌కు తరలించడమో చేసి వారి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో ఏం హామీలతో ముందుకు వస్తారోనని ఓటర్లంతా చర్చించుకుంటున్నారు.

ఆశ..నిరాశే..
మోటుమాల గ్రామంలో 1200 ఎకరాలు ఉప్పు కొఠారు భూములు ఉన్నాయి. ఈ భూములను సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యే కాగానే అసైన్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు, పాసుపుస్తకాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ ఐదేళ్లలో దాని ఊసే లేదు. గ్రామసభల్లో దీనిపై ప్రశ్నించినా ఏదో సమాధానం చెప్పి కాలయాపన చేశారు గానీ సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులంతా నిరాశ చెందారు.

ఎన్నో చెప్పారు..ఎన్ని చేశారు..?
మండలంలో సెంట్‌మెంట్‌ ప్రకారం శుభ సూచికగా గుండమాల గ్రామం నుంచి ప్రచారం మొదలు పెడతారు. గుండమాలల్లో 2014ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జనార్దన్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. గ్రామం నుంచి సముద్రం దగ్గరకు వెళ్లే రోడ్డును గ్రావెల్‌ రోడ్డుగా మారుస్తామని, వలలు భద్రపరుచుకోవడానికి, ఇతర అవసరాలకు షెడ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఒకే ఇంట్లో రెండేసి, మూడేసి కాపురాలుఉంటున్నాయని, వారందరికీ ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే వీటిలో ఒక్క సమస్యను పరిష్కరించలేదు. దీనిపై మొదటి జన్మభూమి గ్రామసభలోనే మత్స్యకారుడు ఎమ్మెల్యే జనార్దన్‌ను ప్రశ్నిస్తే స్థానిక టీడీపీ నాయకుడు కోపంతో కూర్చోబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

బలవంతంగా లాక్కుంటారా..?
మోటుమాల గ్రామంలో సర్వే నంబర్‌ 465ఏలో భూమిని ఎన్నో ఏళ్లుగా చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే వికలాంగులకు ఇళ్ల స్థలాల పేరుతో వారి దగ్గర భూమిని బలవంతంగా లాక్కకున్నారు. మాట వినకుంటే కేసులు పెట్టించి కోర్టులకు సైతం పంపించారు. వికలాంగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం మరొకరి భూమిని దౌర్జన్యంగా లాక్కోవడం ఏంటని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా సదరు రైతులకు అసైన్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని ఆశ చూపి భూమిని లాక్కకున్నారు. కానీ సెంటు భూమికి కూడా పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదు.

ఆన్‌లైన్‌కు అష్టకష్టాలు..
కొత్తపట్నం, కె.పల్లెపాలెం గ్రామాల్లో సర్వే నం.1680లో 115 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ కోసం అన్నదాతలు ఎన్నో కష్టాలు పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే జనార్దన్‌ను సైతం కలిసి విన్నవించారు. కానీ వారి గోడు అరణ్యరోదనగానే మిగిలిపోయింది. సర్యేనెంబర్‌ 1204లో 150 ఎకరాలు ఉప్పు కొటారు భూమి ఆన్‌లైన్‌ చేయలేదు. కొత్తపట్నం పడమర దళితవాడ రైతులకు 38 ఎకరాలు భూమి ఆన్‌లైన్‌ చేయలేదు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళితే..నెల రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే మీ కాలనీకే రానని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆన్‌లైన్‌ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు.

► పాదర్తి, రంగాయపాలెం గ్రామాల్లో ఉన్న ప్రజలకు శ్మాశానికి దారి ఏర్పాటు చేస్తామని, ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని, భూమి ఆన్‌లైన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. 81ఏలో 300 ఎకరాలు ఉప్పు కొఠారు భూమిని పంపిణీ చేస్తామన్నారు. ఒక్క సెంటు పంపిణీ చేయలేదు. దీని కోసం కొంత మంది దగ్గర నగదు కూడా వసూలు చేసినట్లు సమాచారం..అదే విధంగా మండలంలోని పాస్టర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు.

కమీషన్ల పనులకే అధిక ప్రాధాన్యం
కమీషన్లు వచ్చే పనులకే ఎమ్మెల్యే జనార్దన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నోసార్లు మండలానికి వచ్చినా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదు. జన్మభూమి గ్రామాల్లో ప్రశ్నించినా పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో అర్హులకు అన్యాయమే జరిగింది.
- ఆళ్ల రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు

మరిన్ని వార్తలు