సదావర్తి భూదోపిడీని బయటపెట్టిన అధికారిణిపై కక్షసాధింపు

28 Jun, 2018 02:49 IST|Sakshi
సత్రం భూముల ఎకరా విలువ రూ. 6 కోట్లకు పైగానే ఉందంటూ ఆర్‌జేసీ భ్రమరాంబ ఈ లేఖ రాయటం వల్లే ప్రభుత్వ కక్ష సాధింపులు

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా సదావర్తి సత్రం పేరిట చెన్నైకు సమీపంలో ఉన్న భూముల్ని అతి తక్కువ ధరకు కొట్టేయాలన్న అధికారపార్టీ నేతల దోపిడీ కథను అడ్డుకున్న అధికారిణిపై రాష్ట్రప్రభుత్వం వేధింపు చర్యలకు దిగింది. దేవదాయ శాఖ జోన్‌–2కు రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ)గాను, శ్రీకాళహస్తి ఆలయ ఈవోగాను పనిచేస్తున్న భ్రమరాంభను సుమారు 20 రోజులక్రితం ఆయా బాధ్యతల నుంచి బదిలీ చేసింది. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ అంశం దేవదాయ శాఖలో చర్చనీయాంశమైంది.

నాడు లేఖాస్త్రంతో కలకలం..
2016 మార్చిలో సదావర్తి సత్రం పేరిట చెన్నై నగరానికి సమీపంలో ఉన్న 83.11 ఎకరాల భూమికి రాష్ట్రప్రభుత్వం వేలం నిర్వహించడం, ఎకరా కేవలం రూ.27 లక్షల చొప్పున రూ.22.44 కోట్లకే ఆ మొత్తం భూములను కొట్టేయాలని టీడీపీ నేతలు చూడడం తెలిసిందే. అయితే ఆ భూమికి తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ధర ప్రకారమే ఎకరా రూ.6 కోట్లు దాకా ఉందంటూ వేలం జరిగిన 20 రోజులకు భ్రమరాంభ దేవదాయశాఖ కమిషనర్‌ అనురాధకు లేఖ రాశారు. వేలం జరిగిన తీరును కూడా తప్పుపడుతూ.. ఆ భూమి ఎంత ధర ఉందన్నదీ తెలుసుకోకుండా వేలం నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. ఆ భూమి మొత్తం ఆక్రమణలో ఉందని పేర్కొంటూ.. తక్కువ ధరకు వేలం నిర్వహించారని, అయితే 20 నుంచి 30 ఎకరాలు ఖాళీగానే ఉందని వివరించారు. ప్రభుత్వ పెద్దల భూదోపిడీ వ్యవహారంపై ఆ లేఖ పెద్ద కలకలాన్ని సృష్టించింది.  

అదను చూసి కక్ష సాధింపు..  
సదావర్తి సత్రం భూముల విషయంలో దోపిడీ కోణం బహిర్గతమవడంతో రాష్ట్రప్రభుత్వం తీవ్ర అప్రదిష్టల పాలైంది. టీడీపీ నేతల దోపిడీ కోణాన్ని బయటపెట్టిన భ్రమరాంబపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారు. రెండేళ్ల తర్వాత అదను చూసి ఇప్పుడు ఆమెపై వేధింపులకు దిగారు. భ్రమరాంభకు 2023 వరకు సర్వీసు కాలం ఉంది. అయితే ఆమె ఆరునెలలక్రితం వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలన్న యోచనతో ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కొద్దిరోజుల క్రితమే తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం 20 రోజులక్రితం ఏ పోస్టింగ్‌ ఇవ్వకుండా ఆమెను బదిలీ చేసి.. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.

అప్పట్నుంచీ పోస్టింగ్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఆమెను ఇబ్బందులపాలు చేస్తోంది. దేవదాయశాఖలో ఆర్‌జేసీ అధికారులు బాధ్యతలు నిర్వహించే 8 పెద్ద ఆలయాల ఈవో పోస్టులతోపాటు రెండు రీజనల్‌ కమిషనర్‌ పోస్టులు ఉండగా, ప్రస్తుతం ఆ శాఖలో నలుగురే ఆర్‌జేసీ అధికారులున్నారు. మిగిలిన పోస్టుల్లో రెవెన్యూ అధికారులను డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు. భ్రమరాంభను బదిలీ చేసిన ఈ 20 రోజుల వ్యవధిలోనే రెవెన్యూ అధికారులను ఆయా పోస్టుల్లో డిప్యుటేషన్‌పై నియమించిన సర్కారు.. ఆమెకు మాత్రం ఏ పోస్టింగ్‌ ఇవ్వకపోవడం కక్ష సాధింపునకు నిదర్శనం. 

మరిన్ని వార్తలు