కలగా.. కల్పనగా..!

4 Apr, 2019 13:10 IST|Sakshi
గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినా పూర్తికాని పిఠాపురం–నంబాళపేట వంతెన

దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన వంతెన

సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): మండలంలోని పిఠాపురం, నంబాళపేట గ్రామాలకు వెళ్లే మార్గం మధ్యలో పూర్తిగా శిథిలమైన వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వంతెన నిర్మాణం చేస్తానంటూ ప్రస్తుత రాష్ట్రం మంత్రి అచ్చెన్నాయుడు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే మళ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో హుటాహుటిన పిఠాపురం–నంబాళపేట రహదారి పనులు ప్రారంభించి, మధ్యలో వదిలేశారు. వంతెన నిర్మాణం మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో మంత్రి ఇచ్చిన హామీ సైతం కలగా మిగిలిపోయింది. ఎన్నికల ముందు ఒకమాట, గెలిచిన తరువాత మరోమాట అచ్చెన్నకే చెల్లిందంటూ స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ప్రమాదకరంగా మారింది
మా గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలోనే ఉంది. ఇటీవల వంతెన నిర్మాణం చేస్తామని చెప్పారు. అయితే పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గెలిచిన తరువాత ప్రజా ప్రతినిధులు మాట మార్చడం సరికాదు.
–ఎ.వెంకట్రావు, నంబాళపేట, టెక్కలి మండలం

హామీ నెరవేర్చ లేకపోయారు
పిఠాపురం–నంబాళపేట గ్రామాల మధ్య శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న వంతెన నిర్మాణం చేస్తామని గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి తప్ప, నిర్మాణం పూర్త కాలేదు. ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– ఎన్‌.పుష్పలత, ఎంపీటీసీ సభ్యురాలు, బన్నువాడ, టెక్కలి మండలం

మరిన్ని వార్తలు