పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ

20 Aug, 2019 10:11 IST|Sakshi

రూ.16 కోట్లకు టోకరా వేసిన తెలుగు చెల్లెమ్మ

ఆమెతో పాటు భర్త కూడా సూత్రధారే 

విచారణ చేస్తున్న పోలీసులు

ఇదివరకే ‘సాక్షి’లో కథనాలు

సాక్షి, చీరాల : చిట్టీలు, అధిక వడ్డీలకు ఆశ చూపి ప్రజల నుంచి రూ.16 కోట్లు వసూలు చేసిన టీడీపీ కీ లేడీని ఎట్టకేలకు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలిగా వ్యవహరిస్తూ ఆమె చేసే అక్రమాలకు కలరింగ్‌ ఇచ్చుకుంది. తన వెనుక రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని సొంత బిల్డప్‌లకు దిగింది. తీరా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదహారు కోట్ల రూపాయలకుకు టోకరా పెట్టింది. ఇందులో పేద, మధ్య తరగతి వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, పోలీసులు, ఆర్మీ ఉద్యోగులు, రైతులు ఉన్నారు. ఈ మాయ లేడీ వ్యవహారంపై ముందుగానే సాక్షి దినపత్రికలో రెండు కథనాలు ప్రచురితమయ్యాయి.

మహిళా మేత శీర్షికతో పాటు ఆమె బాధితులు చాంతాడంత అనే మరో శీర్షికతో  సాక్షి రెండు కథనాలు ప్రచురించింది. ఈపూరుపాలేనికి చెందిన బాధితులు ఇద్దరు తమను మహిళా నేత ఛీటింగ్‌ చేసిందని ఫిర్యాదు చేయడంతో రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  అధిక వడ్డీలకు ఆశచూపి రూ.16 కోట్లకు టోకరా వేసిన సదరు మహిళపై ఈపూరుపాలెం రూరల్‌ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. రూరల్‌ ఎస్‌ఐ వేముల సుధాకర్‌ తన సిబ్బందితో కలిసి చిట్టీల నిర్వాహకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తి (ఇతను ప్రభుత్వ ఉద్యోగి) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

ఇదీ..జరిగింది
చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి చిట్టీల వ్యాపారం చేస్తోంది. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ మాయలేడీ రూ.16 కోట్లకు అప్పులు చేసి ఎగనామానికి సిద్ధపడింది. ఈపూరుపాలెంలో ఉన్నత కుటుంబంగా వ్యవహరిస్తూ చిట్టీల వ్యాపారం చేయడంతో పాటు చిట్టీలను వేసిన వారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తానని నమ్మబలికింది. చీరాల మండలం మేజర్‌ గ్రామం ఈపూరుపాలెం, బోయినవారిపాలెం, పేరాల, చీరాల, పిట్టువారిపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రజలు అధికంగా చిట్టీ పాటలు వేశారు. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు చిట్టీ పాటలు వేయడంతో పాటు చిట్టీలు పాడిన వారి నుంచి అధికంగా వడ్డీలు చెల్లిస్తామని నమ్మబలికి కోట్లాది రూపాయలు వసూలు చేసింది.

15 నెలలుగా సదరు మహిళ చిట్టీలు పాడిన వారికి నగదు చెల్లింపులు చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. ఇదే కోవలో డబ్బులు వడ్డీకి ఇచ్చిన వారు సైతం తమ డబ్బులు ఇవ్వాలంటూ ఆ మహిళను కోరగా వారికి ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తోంది. సదరు మహిళ వద్ద అధికంగా రోజువారీ కూలీలు, ఐఎల్‌టీడీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్‌దారులు 500 మంది వరకు చిట్టీలతో పాటు అధిక వడ్డీలకు ఆశపడి నగదు ఇచ్చారు. గత సంవత్సరం నుంచి ఆ మాయాలేడీ వ్యవహారంపై అనుమానం వచ్చిన ప్రజలు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రతిఫలం లేకుండా పోతోందని వాపోతున్నారు. 

అక్రమార్కురాలికి టీడీపీ నేతల అండ
ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కాజేసీ తీరా తన వద్ద డబ్బులు లేవంటూ నాటకాలు ఆడుతున్న సదరు మహిళ టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. తనను ఈ వ్యవహారం నుంచి రక్షించాలని స్థానిక నేతలతో పాటు నియోజకవర్గ ముఖ్యనేతల చుట్టూ తిరుగుతోంది. ఈ జనానికి తాను అంత డబ్బు ఇవ్వలేనని, తన ఇంటిని అమ్ముతానని, తాను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తానని స్థానిక నేతలను వెంట పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలను తరుచూ కలుస్తోంది. 

పందిళ్లపల్లి టూ కర్లపాలెం వరకు బాధితులే 
ఈ మహిళా నేత బాధితుల చిట్టా చాంతాడంత పేరుకుపోయింది. చీరాల మండలం మేజర్‌ గ్రామం ఈపూరుపాలెంలో చిట్టీలు వేస్తున్న ఈ మహిళ వ్యాపారులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, మాస్టర్‌ వీవర్లు నుంచి కోట్లాది రూపాయలు అధిక వడ్డీలు ఆశ చూపించి వసూలు చేసింది. ఈ మహిళా మేత బాధితులు చీరాల నియోజకవర్గం చివరలోని పందిళ్లపల్లి నుంచి దేశాయిపేట, వేటపాలెం, చీరాల, పేరాల, ఈపూరుపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి, బాపట్ల, కర్లపాలెంలో ఉన్నారు. 

ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ 
ఈపూరుపాలెంలో ప్రజల నుంచి రూ.16 కోట్లకుపైగా డబ్బులు వసూలు చేసిన మాచర్ల పద్మావతిపై ముందుగానే ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. తమను పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు మోసం చేశారని బాధితులు చాలామంది ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె బాధితులు చాంతాడంత పేరుకుపోవడంతో పాటు పలువురు కోర్టుల్లో కేసులు కూడా దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నా మాయా లేడీ కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. 
అవును..విచారిస్తున్నాం
ఈపూరుపాలేనికి చెందిన మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తిలు చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. తమను మోసం చేశారని గ్రామానికి చెందిన ఇద్దరు పద్మావతి కుటంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సదరు మహిళ, ఆమె భర్తను విచారిస్తున్నాం.
 – సుధాకర్, ఎస్‌ఐ, ఈపూరుపాలెం   

మరిన్ని వార్తలు