'ఇక్కడే పడేసి తంతా.. అడ్డొచ్చేది ఎవరు'

16 Sep, 2017 12:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై అధికార పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌ జేఈని తీవ్ర పదజాంతో నోటికొచ్చిన్టు దూషించడమే కాకుండా చెప్పుతో దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసి ప్రయత్నించిన సంఘటన తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలంలోని బురాన్‌దొడ్డి చెక్‌డ్యాం వద్ద ఎంపీపీ నాగమణమ్మతో ఈ నెల 8న జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనను పిలవలేదంటూ అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌ మైనర్‌ ఇరిగేషన్‌ జేఈ విజయ్‌కుమర్‌పై గొడవకు దిగారు. ఫోన్‌లో తీవ్రంగా దూషించారు. తాజాగా శుక్రవారం గుండ్రేవలలోని క్రిష్ణం దొడ్డి ఎత్తిపోతల పథకం నీటి విడుదల కార్యక్రమానికి టీడీపీ కొడుమూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ విష్ణువర్థన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా చంద్రశేఖర్‌ ఇరిగేషన్‌ జేఈ ఎమ్మెల్యే మణిగాంధీకి అనుకూలంగా పనిచేస్తున్నాడంటూ విష్ణువర్థన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఎదురుపడిన జేఈ విజయ్‌కుమార్‌తో గొడవకు దిగారు. అకాణంగా ఆయనపై తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. ' ఏరా వెధవా నేను సి.బెళగల్‌ జెడ్పీటీసి సభ్యుడిని, నువ్వు ఇక్కడ ఏపని చేయాలన్నా.. నాకు సమాచారం ఇవ్వాలి. ప్రొటోకాల్‌ పాటించాలని తెలీదా.. నిన్ను ఇక్కడే పడేసి తంతా నీకు అడ్డొచ్చేది ఎవరు?' అంటూ చెప్పుతీసి జేఈని కొట్టే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న వారు కల్పించుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గతంలో కూడా ఆయన పలువురు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు