భూమా అఖిలప్రియను అరెస్ట్‌ చేయాలి

16 Jul, 2020 14:04 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె జస్వంతి గురువారం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తనను హత్యచేసేందుకు కుట్ర పన్నిన భూమా అఖిల ప్రియను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎస్పీకి ఏవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏ4 అయిన భూమా అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు. ఏ1 నుండి ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఏ4ను ఎందుకు వదిలేశారు. నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా’’ అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదన్నారు.  నిర్భయంగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే తనపై మళ్లీ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భూమా అఖిలప్రియ మహిళ ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తోందని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి మండిపడ్డారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆళ్లగడ్డలో రాజకీయంగా తమను ఎదుర్కోలేక అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

మరిన్ని వార్తలు