తమ్ముడూ.. ఇది తగునా

6 Jul, 2020 10:11 IST|Sakshi
టీడీపీ నాయకుడు ఆయూబ్‌బాషా (వృత్తంలోని వ్యక్తి )

డ్వాక్రా రుణాలను కాజేసిన తెలుగు తమ్ముడు

బినామీల పేరిట గ్రూపు ఏర్పాటు

‘పసుపు–కుంకుమ’కానుకలూ మింగేసిన ఘనుడు  

తాడిపత్రి: మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాలకు విరివిగా రుణాలు ఇచ్చి, తద్వారా వారి పురోభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఇదే అదునుగా చూసి ఓ తెలుగు తమ్ముడు అడ్డదారిని ఎంచుకున్నాడు. బినామీల పేరిట డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసి, బ్యాంకు ద్వారా వచ్చే రుణాలను స్వాహా చేస్తున్నట్లు  ఆలస్యంగా వెలుగుచూసింది. గత టీడీపీ హయాంలోనూ పసుపు– కుంకుమ పేరిట వచ్చిన రూ.2లక్షలు  స్వాహా చేశాడు. ఇదేమని ప్రశ్నించినవారిని   బెదిరిస్తున్నాడు. మొత్తం వ్యవహారంపై మహిళలు నిలదీయడంతో విషయం కాస్త బట్టబయలైంది.

పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఆయూబ్‌బాషా ఏటిగడ్డపాలెంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య కలైగర్‌ షమీనాతోపాటు మరో తొమ్మిది మంది మహిళలతో అఫ్రిన్‌ గ్రూప్‌ (ఎంపీఎస్‌ 12001401500) పేరుతో 2015 డిసెంబర్‌ 27న ఏర్పాటు చేశారు. ఆస్పత్రి పాలెంలోని బీమామిత్ర పర్వీన్‌ అడ్రస్‌తో గ్రూప్‌ను ఏర్పాటు చేయించాడు.ఏ ఒక్కరూ స్థానికులు గ్రూపులో లేరు. వాస్తవంగా పర్వీన్‌ అనే మహిళ కూతురు తస్లీం రీసోర్స్‌పర్సన్‌(ఆర్పీ)గా పనిచేస్తోంది. రీసోర్స్‌పర్సన్‌గా ఉన్న మహిళ భర్త రైల్వేశాఖలో ఉద్యోగి.  ఆర్‌పీ తస్లీం పేరున ఆమె తల్లి పర్వీన్‌ గ్రూపు   వ్యవహారాలను చూస్తోంది.  ఏటిగడ్డ పాలెంకు చెందిన అచ్చుకట్ల షేకున్‌బీ, కలైగర్‌ షమీనా, ఫాబినా షమీమ్, కిష్టిపాడు షేకున్‌బీ, పామిడి హజీరా, షేక్‌ గౌసియా, షేక్‌ మహాబుబ్‌బీ, తసబ్‌ హసీనా, తేరన్నపల్లి హాబీదా గ్రూపుగా ఏర్పడ్డారు. 

రూ.3 లక్షలు స్వాహాకు యత్నం: 2015లో స్థానిక కెనరా బ్యాంకులో 3341101012850 నంబర్‌తో ఖాతాను ప్రారంభించారు. మొదట గ్రూపు సభ్యులకు రూ.లక్ష రుణాలు మంజూరు కాగా ఒక్కొక్కరికి టీడీపీ  నాయకుడు రూ.10 వేలు పంపిణీ చేశాడు. రెండో సారి 2018 ఆగస్టు 20న గ్రూపులోని మహిళా సభ్యులకు రూ.2లక్షలు రుణాలు మంజూరైంది. ఒక్కొక్కరికి రూ.20 వేలు పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే పంపిణీ చేసి  రూ.లక్ష స్వాహా చేశాడు. టీడీపీ హయాంలో మహిళలకు ఇచ్చిన పసుపు–కుంకుమ కానుక కింద రూ.2 లక్షలు స్వాహా చేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.

ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులు: ఇటీవల గ్రూపు మహిళలు 10 మందికి కెనరా బ్యాంకు రూ.3లక్షలు రుణం మంజూరు చేసింది. గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.30వేలు చొప్పున ఆ గ్రూప్‌ లీడరైన ఆయూబ్‌ సతీమణి కలైగర్‌ షమీనా పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఆయూబ్‌బాషా మహిళలను మభ్యపెట్టి రూ.5వేల చొప్పున తీసుకోవాలని సూచించాడు. దీంతో మహిళలందరూ నిరాకరించారు. మూకుమ్మడిగా బ్యాంకర్లు, మున్సిపాలిటీలోని మెప్మా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రూప్‌ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టారు. తనను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నట్లు  సభ్యులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు మహిళలు వాపోతున్నారు.  

రెండు విడతలుగా స్వాహా  
రెండు విడతలుగా రూ.15వేలు స్వాహా చేశాడు. తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వాలని ప్రశ్నిస్తే గ్రూపు నుండి తొలగిస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్తే మున్సిపల్‌ కార్యాలయంలో డ్వాక్రా గ్రూపుల సీఓకు  ఫిర్యాదు చేయాలని బ్యాంకర్లు సూచించారు.   – షేక్‌ మహబూబ్‌బీ

పాసు పుస్తకాలు ఇవ్వలేదు
టీడీపీ నాయకుడు ఆయూబ్‌ బాషా గ్రూపుకు సంబంధించిన పొదుపు సంఘానికి చెందిన పాసుపుస్తకాలు కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. పాసుపుస్తకాలు ఇవ్వాలని అడిగితే మొహం చాటేస్తున్నాడు. నాకు రావాల్సిన రూ.20 వేలు రెండు విడతలుగా స్వాహా చేశాడు.  – షేక్‌ గౌసియా

సున్నా వడ్డీ వసూలు  
నేను గ్రూపులో రెండో లీడర్‌. ఇంత వరకు పొదుపు సంఘం పాసుపుస్తకాలు ఇవ్వలేదు. రుణాల డబ్బు నేను చూడలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సున్నా వడ్డీ వర్తిస్తుందని ప్రకటించినా మాతో వడ్డీ వసూలు చేశాడు. మెప్మా నుంచిì గ్రూపునకు అందాల్సిన రాయితీలు ఏవీ అందలేదు.  పసుపు–కుంకుమ కానుక కింద వచ్చిన రూ.2 లక్షలను స్వాహా చేశాడు.     – తసబ్‌ హసీనా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా