టీడీపీ నేత దౌర్జన్యం

7 Dec, 2018 13:42 IST|Sakshi
సుబ్రహ్మణ్యానికి కన్ను వద్ద వాచిన బుగ్గ

సభ్యత్వానికి సొమ్ము ఇవ్వలేదని నాయీబ్రాహ్మణుడిని కొట్టిన వైనం

యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో ఘటన

పశ్చిమగోదావరి, యలమంచిలి: టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పరాకా ష్టకు చేరుతున్నాయి. బలవంతంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రాయడమే కాకుండా సభ్యత్వానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఏనుగువానిలంక గ్రామానికి చెందిన పొన్నపల్లి సుబ్రహ్మణ్యం అనే యువకుడి గూబ వాచిపోయేలా కొట్టిన సంఘటన గురువారం ఉదయం జరిగింది.  నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం గ్రామంలో కులవృత్తి (క్షురక) చేసుకుంటాడు. బ్యాండ్‌ మేళంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 10 రోజుల క్రితం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుబ్బల ఏడుకొండలు మరికొందరు నాయకులు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి ఆధార్‌కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వం రాశారు.

ఇద్దరి సభ్యత్వానికి రూ.200 ఇవ్వాలని అడిగారు. సుబ్రహ్మణ్యం బ్యాండ్‌ మేళ నిమిత్తం వేరే ఊరు వెళ్లడంతో ఏడుకొండలు కుమారుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి దుర్గాభవానీని డబ్బులు ఇవ్వాలని రోజూ వచ్చి అడుగుతుండగా ఆమె విసుగుచెంది తమకు ఎలాంటి సభ్యత్వం వద్దని, ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన మేలు జరగలేదని చెప్పారు. దీంతో అతడు తండ్రి ఏడుకొండలకు విషయం చెప్పాడు. గురువారం ఏడుకొండలు అతడి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి సభ్యత్వం డబ్బులు అడిగితే ఇవ్వనంటారా అంటూ ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం సమాధానం చెబుతుండగానే ఏడుకొండలు కుమారుడు పక్కన ఉన్న ఇటుక తీసుకుని సుబ్రహ్మణ్యం గూబపై కొట్టాడు. దీంతో స్థానికులు వచ్చి సర్ధిచెప్పి వారిని పంపేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సుబ్రహ్మణ్యం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేసుకోలేదని అతడు వాపోయాడు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.

మరిన్ని వార్తలు