పెద్దాయన పేరు చెప్పి.. దందాలు

11 Mar, 2018 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సివిల్‌ వివాదాలు మొదలుకుని భూ దందాల వరకు అన్నింట్లో కీలకపాత్ర

రైతులకు తెలియకుండా వారి భూముల విక్రయం

ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూముల కబ్జాకు సహకరించిన సబ్‌రిజిస్ట్రార్‌

కానిస్టేబుల్‌ పొలంలో పంట కూడా విక్రయం

కేసులు నమోదుపై పోలీసుల తర్జనభర్జన

మూడేళ్లలో ఏడు కేసులు

ఆత్మకూరు స్టేషన్లోనే ఎక్కువ పరిష్కారాలు

అధికార పార్టీలో ఆయనో పెద్దాయన.. గత ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి జిల్లాలో చక్రం తిప్పిన వ్యక్తి. ప్రస్తుతం అధికార పార్టీలోకి మూడేళ్ల క్రితం చేరి ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయాల్లో సమకాలికుడిగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇన్‌చార్జి హోదాలో ఉన్నప్పటికీ అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. అలాంటి పెద్దాయన పేరు చెప్పి ఆయన ముఖ్య అనుచరుడుగా ఉన్న ఓ నాయకుడు బరితెగింపు దందాలకు పాల్పడుతున్నాడు. 


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారపార్టీలో ఉన్న ఓ పెద్ద నాయకుడి పేరు చెప్పి ఆయన అనుచరుడు చిన్నపాటి వివాదాలు మొదలుకుని భారీ భూదందాల వరకు అన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాడు. స్టేషన్లలో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఒక ప్యాకేజ్‌తో పాటు పెద్దాయన పేరు అదనపు బ్రాండ్‌గా మార్చుకుని దందాలు సాగిస్తున్నాడు. ఒక కానిస్టేబుల్‌కు చెందిన పొలంలో పంటను అతనికి తెలియకుండా విక్రయించటంతో వివాదం మొదలైంది.

అధికార పార్టీ నేత కావటం, పెద్దాయన బ్రాండ్‌ ఉండటంతో చివరకు పోలీసులు కూడా సొంత ఖాకీకి న్యాయం చేయలేక సెటిల్‌మెంట్‌ చేసుకోమని ఒత్తిడి తేవటం జిల్లాలో అధికార పార్టీ తీరుకు ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. ఏదేమైనా అతని జోలికి రావద్దంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవటం గమనార్హం. 

ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన అధికార పార్టీ నేత గంగినేని నాగేశ్వరరావు అలియాస్‌ తిక్కవరం నాగేశ్వరరావు నియోజకవర్గంలో సాగి స్తున్న వ్యవహారం ఇది. మూడేళ్లలో అతనిపై ఏడు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అందులో స్టేషన్లలోనే ఐదు కేసులు సెటిల్‌ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆత్మకూరు స్టేషన్‌లో పనిచేసే ఒక కానిస్టేబుల్‌ భార్యకు పుట్టింటి ద్వారా అక్కడ ఏడు ఎకరాల పొలం వచ్చింది.

దానిలో ఏడేళ్లుగా సరుగుడు తోట సాగు చేశారు. మంచి ధర వస్తే పంటను విక్రయించాలని కానిస్టేబుల్‌ భావించాడు. అయితే కానిస్టేబుల్‌కు తెలియకుండా రాత్రికి రాత్రే నాగేశ్వరరావు మనుషులను పెట్టి సరుగుడు తోటను కొట్టించి రూ.4.60 లక్షలకు విక్రయించాడు. దీనిపై కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేస్తే, ఆయన పెద్దాయన మనిషి కదా రూ.2 లక్షలు తీసుకుని రాజీ చేసుకోమని స్టేషన్‌ ఎస్సై బాధిత పోలీసుకు సలహా ఇచ్చాడు.

చివరకు ఉన్నతాధికారుల దృష్టికి రావటంతో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కేసులు గడిచిన మూడేళ్లలో అనేకం చోటుచేసుకున్నాయి. అలాగే గతంలో కేవీ సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని కూరపాటి సుశీలమ్మ అనే మహిళకు రూ.91 లక్షలకు విక్రయించాడు. చివరకు స్టేషన్లో పంచాయతీ చేసి రూ.30 లక్షలు వెనక్కి ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడు. 

రైతుల భూములు రియల్‌ కంపెనీకి విక్రయం

మరోవైపు రైతుల భూములు వారికి తెలియకుండా చెన్నైకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి విక్రయించాడు. వాటిలో ప్రస్తుతం కొన్ని పంచాయతీలు పెండింగ్‌లో ఉన్నాయి. నరసింహారెడ్డి అనే వ్యక్తికి చెందిన 9 ఎకరాల భూమిని అతని ప్రమేయం లేకుండా చెన్నైకి చెందిన రెయిన్‌ ఫారెస్ట్‌ ఆగ్రో వెంచర్‌ సంస్థకు విక్రయించాడు. అలాగే చిన్న కొండయ్య అనే వ్యక్తి భూమిని కూడా అదే కంపెనికి విక్రయించాడు.

ఇక తిక్కవరం, పల్లవోలు గ్రామాల్లో ఉన్న సీజేఎఫ్‌ ఎస్‌ భూముల్ని గతంలో  మహిళ తహసీల్దార్‌ సహకారంతో పట్టాలు సృష్టించి, వాటిని కూడా ఇదే రియ ల్‌ ఎస్టేట్‌ కంపెనీకి తక్కువ ధరకు విక్రయించాడు. వాటికి గతంలో ఉదయగిరిలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌తో కలిసి అన్ని రిజిస్ట్రేషన్లు చేశాడు. ప్రస్తుతం ఇవన్నీ పంచాయతీ దశలో ఉన్నాయి. 

పశువులను కూడా వదలరు

చివరకు పశువులను కూడా వదలరనే పేరుంది. రోడ్లపై కనిపించిన గేదెలను ప్రత్యేకంగా ఉండే రెండు వాహనాల్లో  తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో విక్రయించటం, లేదంటే కడప సరిహద్దు గ్రామాలకు తరలించటం చేస్తారు. వీటికి సంబంధించి నమోదైన ఫిర్యాదుల్లోనూ పోలీసుల వ్యవహార శైలి ఏకపక్షమే. ఒక రైతుకు చెందిన ఐదు గేదెలను తీసుకెళ్లి ఆ నాయకుడు అమ్మేశాడు. బాధిత రైతులు కేసు పెడితే విచారణ పేరుతో కేసును పెండింగ్‌లో ఉంచారు.

అలాగే గతంలో వెంకటనర్సయ్య అనే వ్యక్తి గేదెలను కూడా విక్రయించాడు. రాంపల్లి గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఐదు గేదెలను కూడా ఇదే రీతిలో అమ్మేశాడు. చివరకు బాధిత రైతులతో మాట్లాడి స్టేషన్లో ఎస్సై సెటిల్‌మెంట్‌ చేసి రూ.50 వేలు ఇప్పించాడు. ఇలాంటి నేత జోలికి రావద్దని తరచూ అధికార పార్టీ పెద్దాయన నుంచి పోలీసులకు ఫోన్లు రావటంతో పూర్తిగా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. 

మరిన్ని వార్తలు