మాయగాడు పథకం..పారింది

14 Feb, 2019 13:18 IST|Sakshi

రేషన్‌ కార్డుల్లో పేర్లు మార్చి పథకాల్లోలబ్ధి

ఒక ఇంటి నిర్మాణానికి మూడు బిల్లులు

పొలం లేకపోయినా రుణమాఫీ  

పండ్ల మొక్కలు నాటకపోయినా నిధులు

అధికార పార్టీ నేతల ఆగడాలు అన్నీఇన్నీ కావు.     కాసులకోసం కొందరు అక్రమ రవాణాను ఎంచుకుంటే...మరికొందరు అభివృద్ధి పనుల పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారు. ఇదంతా ఎందుకనుకున్న ఓ టీడీపీ చోటా లీడర్‌...సంక్షేమ పథకాల స్వాహాతో కాసులు కురిపించుకున్నాడు. తన పరపతి ఉపయోగించి...అధికారులకు తాయిళాలు అందజేసి రుణమాఫీ, ఎన్టీఆర్‌ ఇల్లు, పండ్ల మొక్కల పెంపకం..భూ పంపిణీ ఇలా ప్రతి పథకాన్నీ ఉపయోగించుకున్నాడు. ఇందుకోసం ఇతరుల కార్డుల్లో పేర్లు మార్చేశాడు. అర్హులకు అన్యాయం చేసి దర్జాగా పథకాలన్నీ పొందాడు.

ఇది ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇల్లు. గుంతకల్లు మండలంలోని చింతలాంపల్లి గ్రామానికి చెందిన గంజికుంట శ్యాంప్రసాద్‌ తల్లి ప్రభావతమ్మ (రేషన్‌కార్డు నంబర్‌ :  ఖఅ్క120503 100766) పేరుతో అధికారులు ఇల్లు మంజూరు చేశారు. ఆ మేరకు బిల్లులు కూడా మంజూరు చేశారు. కానీ ఇదే ఇంటికి మరో రెండు కార్డు నంబర్లపై రెండు బిల్లులు మంజూరు చేశారు. జియోట్యాగింగ్‌ ఉన్నా... అధికార పార్టీకి చెందిన శ్యాంప్రసాద్‌ తన పరపతి ఉపయోగించి ఇలా ఒకే ఇంటికి మూడు బిల్లులు పొందాడు. ఇందుకోసం రేషన్‌కార్డుల్లో పేర్లను సైతం మార్చేశాడు.

అనంతపురం  , గుంతకల్లు రూరల్‌ :  అన్ని అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందక సామాన్యులు రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే...గుంతకల్లు మండలంలోని చింతలాంపల్లి గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు మాత్రం ఒకటి, రెండు కాదు...ప్రభుత్వం ప్రవేశపెటిన పథకాలన్నింటిలోనూ లబ్ధి పొందాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేని అమాయకులరేషన్‌కార్డులను, బతుకు తెరువు కోసం వెళ్లిన వారి రేషన్‌ కార్డును గుర్తించి ఆ కార్డుల్లో అక్రమంగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి సంక్షేమ పథకాలను మంజూరు చేయించుకోవడం...పని పూర్తికాగానే రేషన్‌కార్డుల్లో పేర్లు మార్చేయడం పనిగా పెట్టుకున్నాడు. అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను దిగమింగుతూ అక్రమ సంపాదనతో జేబులు నింపుకుంటున్నాడు.

అవసరమైతే పేర్లు మార్చేస్తాడు
చింతలాంపల్లి గ్రామానికి చెందిన గంజికుంట శ్యాంప్రసాద్‌కు తల్లి ప్రభావతమ్మ, భార్య సుధారాణి , అన్న రాంప్రసాద్, వదిన ప్రతిభా భారతి ఉన్నారు. శ్యాంప్రసాద్‌ అన్న రాం ప్రసాద్, వదిన ప్రతిభాభారతి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శ్యాం ప్రసాద్‌ తల్లి ప్రభావతమ్మ పేరున మంజూరు అయిన రేషన్‌కార్డు నంబర్‌ (  ఖఅ్క120503100766)లో కుటుంబ సభ్యులందరి పేర్లూ ఉన్నాయి. కానీ శ్యాంప్రసాద్‌ తన అధికార పలుకుబడిని ఉపయోగించి తన కుటుంబ సభ్యుల పేర్లను అవసరమైన ప్రతిసారీ వేర్వేరు రేషన్‌ కార్డుల్లో చేర్చి ఎన్టీఆర్‌ గృహనిర్మాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలలో లెక్కకు మించి అక్రమాలకు పాల్పడ్డాడు. 

ఒకే ఇంటికే మూడు బిల్లులు
ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద శ్యాం ప్రసాద్‌ తల్లి ప్రభావతమ్మ పేరున ఇల్లు మంజూరు కాగా... తన స్వగ్రామమైన చింతలాంపల్లిలో నాలుగు సెంట్ల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం పనులను చేపట్టాడు. అయితే మండలంలోని నెలగొండ గ్రామానికి చెందిన కమ్మర ఓబులేసు అనే వ్యక్తి కుటుంబం గ్రామంలో లేదన్న విషయాన్ని తెలుసుకున్న శ్యాంప్రసాద్‌... ఓబులేసు భార్య కమ్మర పుల్లమ్మ పేరుతో ఉన్న  రేషన్‌ కార్డులో ( గిఅ్క120503100069) పుల్లమ్మ పేరును తొలగించి ఆమె స్థానం లో తన పేరును నమోదు చేయించుకుని తన తల్లి పేరున నిర్మిస్తున్న ఇంటికి రెండో బిల్లు చేయించుకున్నాడు. ఆ తర్వాత తన భార్య సుధారాణి పేరును పిన్నమ్మ అయిన గంజికుంట యశోదమ్మ రేషన్‌కార్డు ( గిఅ్క120503 100062)లో చేర్చి అదే ఇంటిపై మూడో బిల్లు కూడా చేసుకున్నాడు. 

రుణమాఫీకీ ఇదే దారి  
మండలంలోని వివిధ గ్రామాల్లో మైగ్రేషన్‌లో ఉన్నవారి వివరాలను సేకరించి వారి రేషన్‌కార్డులను ఉపయోగించి లబ్ధిపొందుతున్న శ్యాం ప్రసాద్‌...రుణమాఫీ విషయం లోనూ భారీగా లబ్ధిపొందాడు. తల్లి ప్రభావతమ్మ పేరున ఉన్న సొంత రేషన్‌కార్డు ద్వారా శ్యాంప్రసాద్‌ రుణమాఫీ పొందాడు. అంతేకాకుండా  తన పేరును అక్రమంగా ఎక్కించుకున్న నెలగొండ కమ్మర పుల్లమ్మ  రేషన్‌ కార్డు ద్వారా రుణమాఫీ నిధులు ఖాతాకు మళ్లించుకున్నాడు. పిన్నమ్మ అయిన గంజికుంట యశోదమ్మ రేషన్‌కార్డులో భార్య పేరును చేర్చి ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం కింద బిల్లు చేసుకున్న శ్యాం ప్రసాద్‌ ఆ తరువాత తన భార్య సుధారాణి పేరును అదే చింతలాంపల్లి గ్రామానికే చెందిన రామాంజనేయులు (రేషన్‌కార్డు నంబర్‌:   గిఅ్క120503100182 ) కార్డులో చేర్చి రుణమాఫీ పొందాడు. అంతేకాకుండా అన్న రాంప్రసాద్‌ పేరును, వదిన ప్రతిభా భారతి పేర్లను కూడా ఇతర రేషన్‌ కార్డుల్లో ఎక్కించి రుణమాఫీ పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అత్త పేరుతో 8 ఎకరాల పొలం...
శ్యాంప్రసాద్‌ పామిడి మండలం, కత్రిమల గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్త కలవకూరి రామలక్ష్మమ్మ పేరుతో ఏకంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని సంపాధించాడు. శ్యాంప్రసాద్‌ పొలానికి అత్యంత సమీపంలో సర్వే నంబర్‌ 904 ఎ,బీ,సీ లో 4.62 ఎకరాల భూమితోపాటు, సర్వే నంబర్‌ 978 సీ లోనూ మరో 4 ఎకరాలకు డి.పట్టా సంపాదించాడు. ఈ విషయంపై రెవిన్యూ అధికారుల వద్ద కూడా ఎటువంటి సమాధానం లేదు.

పండ్ల మొక్కల పేరుతో రూ.2 లక్షలు స్వాహా
శ్యాంప్రసాద్‌ ఉద్యాన పథకాల్లోనూ భారీగా లబ్ధి పొందాడు. సపోట మొక్కలు నాటక పోయినా ‘వెలుగు’ రికార్డుల్లో చూపించి రూ.2 లక్షల బొక్కేశాడు. ఈ ఏడాది జనవరి వరకూ అతడు మొక్కల పెంపకానికి బిల్లులు  డ్రా చేసినట్లుగా వెలుగు రికార్డుల్లో నమోదైంది. దీనిపై వెలుగు సిబ్బందిని ప్రశ్నిస్తే... మొక్కలు పెంచిన మాట వాస్తవమేనని, అవి చనిపోవడంతో బిల్లులు నిలిపేశామన్నారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే పేరుతో లక్షలాది రూపాయలను దోచేసిన శ్యాంప్రసాద్‌ ఎక్కడా ఒక్క చెట్టు నాటిన ఆనవాలు కూడా కనిపించడం లేదు. 

రుణాల మంజూరుకు కమీషన్లు  
సబ్సిడీ రుణాల మంజూరులోనూ శ్యాంప్రసాద్‌ కమీషన్‌ల పర్వానికి తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై నోరెత్తితే రుణం మంజూరు కాదేమోనన్న భయంతో లబ్ధిదారులు మిన్నకుండిపోతున్నారు. ఐదేళ్ల అధికార పార్టీ పాలనలో శ్యాంప్రసాద్‌ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందనీ, ఇప్పటి   కైనా ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కార్డులో పేర్ల మార్పు ఇలా...
ముందుగా శ్యాంప్రసాద్‌ వలస వెళ్లిన కుటుంబాలు...ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాల వివరాలు సేకరిస్తాడు. వారి కార్డులు సంపాదిస్తాడు. సివిల్‌ సప్లయ్‌ కార్యాలయంలో తన పరపతి ఉపయోగించి ఆ కార్డుల్లో తన పేరు లేదా తన కుటుంబీకుల పేర్లు నమోదు చేసుకుంటాడు. ఆ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుంటాడు. పథకం మంజూరై నిధులు మొత్తం వచ్చాక ఆ కార్డులో తన పేరు తొలగిస్తాడు.  

కార్డుదారులకూ నష్టమే
ఒక కార్డుపై ఒక ఇల్లు మాత్రమే మంజూరవుతుంది. శ్యాంప్రసాద్‌ లాంటి వారు ఆ కార్డు నంబర్‌తో ఇల్లు మంజూరు చేయించుకుని లబ్ధి పొందిన తర్వాత...అసలైన కార్డు దారుడు ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా..మంజూరు కాదు.  

అధికారులు ఏమన్నారంటే...
శ్యాంప్రసాద్‌ ఒకే ఇంటికి మూడు బిల్లులు చేసిన విషయంపై హౌసింగ్‌ ఏఈ చిన్నారెడ్డిని వివరణ కోరగా... మూడు ఇళ్లుగా పార్టీషన్లు చేసుకోవడం వల్ల బిల్లు చేసినట్లు తెలిపారు. ఇదే విషయంపై హౌసింగ్‌ డీఈ మధుసూదన్‌రెడ్డిని వివరణ కోరగా... శ్యాంప్రసాద్‌ కట్టిన ఇంటికి మూడు బిల్లులు మంజూరు చేయడంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇక రేషన్‌కార్డులో ఉన్న పేర్లు తొలగించి ఇతరుల పేర్లు చేర్చిన వైనంపై పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు, ఇతర సిబ్బందిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా...వారెవరూ అందుబాటులోకి రాలేదు.  

శ్యాంప్రసాద్‌ లీలలెన్నో...
పండ్ల మొక్కలు పెంపకం పథకం కిందసపోటా మొక్కలు నాటినట్లు రికార్డుల్లో చూపి  రూ.2 లక్షల నిధులు డ్రా చేసుకున్నాడు
ఒకే ఇంటికి వేర్వేరు రేషన్‌ కార్డుల నంబర్లు ఉపయోగించి మూడు బిల్లులు చేసుకున్నాడు
ఇతరుల కార్డుల్లో పేరు చేర్చుకుని రుణమాఫీ నిధులు దక్కించుకున్నాడు
భూ పంపిణీ కింద తన అత్త పేరుమీద 8 ఎకరాలకు డి.పట్టా పొందాడు

మరిన్ని వార్తలు