మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం

17 Oct, 2018 09:03 IST|Sakshi

దళిత అధికారిని దుర్భాషలాడిన దేశం నాయకుడు

అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకోలేదని బదిలీ వేటు 

టీడీపీ కార్యాలయంలో పంచాయితీ 

కంటతడి పెట్టుకున్న అధికారిణి

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

గుడివాడ : ఓ మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత అధికారి అని కూడా చూడకుండా కులం పేరుతో  తిట్టిన టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసులు పెడితే కనీసం పట్టించుకోకపోగా ఆమెపై బదిలీ వేటు వేసిన ఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం..

వేలంపాటలో దక్కలేదనే అక్కసుతోనే...
గుడివాడ రూరల్‌ మండలంలోని కూలిపోయిన అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాల తొలగింపునకు వేలం నిర్వహించారు. మోటూరుకు చెందిన టీడీపీ నేత శేషగిరి వేలంలో పాల్గొనగా వేరే వ్యక్తికి దక్కింది. అతను భవనాలు కూల్చే పనిలో ఉండగా శేషగిరి ఫోన్‌ చేసి పార్టీ ఫండ్‌గా రూ.25 వేలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తనకు ఎంపీడీవో కె. జ్యోతి కాంట్ట్రాక్టు ఇచ్చారని, ఆమెను అడగాలని చెప్పటంతో రెచ్చిపోయిన ఆ నాయకుడు ఎంపీడీవోను తిట్టినట్లు వినికిడి. కులం పేరుతో ధూషించి అనరాని మాటలు అన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఆమె టీడీపీ నాయకుడు శేషగిరి తనను ఏ మని తిట్టాడో కాంట్రాక్టర్‌తో లేఖ రాయించుకున్నారు. 

టీడీపీలో రెండు వర్గాలుగా విడిపోయి..
విషయం తెలియగానే టీడీపీలోని ఓ వర్గం ఎంపీడీవోకు ఫోన్‌ చేసి శేషగిరిపై అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పారు. మరోవైపు టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కేసు పెట్టడానికి వీల్లేదని చెప్పినట్లు వినికిడి. అయితే తనకు జరిగిన అవమానంతో ఆమె గుడివాడ రూరల్‌ స్టేషన్‌లో శేషగిరిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది.

టీడీపీ కార్యాలయంలో పంచాయతీ..
విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎంపీడీవోను పిలిపించి పంచాయితీ పెట్టారు. కేసు వెనక్కి తీసుకోవాలని వత్తిడి తెచ్చారు.  ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో నీవు వైఎస్సార్‌ సీపీ నేతలకు పనులు చేస్తున్నావని అభియోగం మోపారు. దీనిపై ఆమె ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. 

రాజీ కుదరకపోవడంతో బదిలీ వేటు.?
రాజీకి రాలేదని ఎంపీడీవోపై బదిలీ వేటు వేశారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌తో మాట్లాడి ఏ కారణం లేకుండానే ఆమెను పెదపారుపూడి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు.

మరిన్ని వార్తలు