ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్‌

14 Jun, 2020 04:00 IST|Sakshi
వైద్య పరీక్షల అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డిని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

జేసీ బ్రదర్స్‌ కంపెనీ బాగోతం బట్టబయలు

నిషేధించిన 154 బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4గా చూపిన వైనం

సుప్రీంకోర్టు ఆదేశాల్ని తుంగలో తొక్కుతూ నాగాలాండ్‌ కేంద్రంగా దొంగ రిజిస్ట్రేషన్లు

నేషనల్‌ ఫ్రాడ్‌గా పేర్కొన్న ఏపీ రవాణా శాఖ.. 27 క్రిమినల్‌ కేసులు నమోదు

నకిలీ పత్రాలతో బీమా కంపెనీలకూ బురిడీ

గతంలో దొంగ పర్మిట్లతో బస్సులు తిప్పితే సీజ్‌ చేసిన రవాణా శాఖ

సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్‌: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్‌ అక్రమ వ్యవహారాలు విస్తుగొలుపుతున్నాయి. జేసీ బ్రదర్స్‌కు చెందిన కంపెనీ చేసిన అక్రమాలు రవాణా శాఖ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వ్యాపారంలో వీరి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బస్సుల్ని తిప్పి అక్రమాలకు తెగబడ్డారు. దొంగ పర్మిట్లతో బస్సులు నడపడం ఓ ఎత్తు అయితే.. తాజాగా బయల్పడిన దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిషేధిత బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన వ్యవహారం కలకలం రేపింది. ఈ అక్రమ వ్యవహారాన్ని రవాణా రంగ నిపుణులు నేషనల్‌ ఫ్రాడ్‌గా పేర్కొంటున్నారంటే దీని తీవ్రత ఎంతో ఇట్టే అర్థం అవుతోంది. దివాకర్‌ రోడ్‌లైన్స్‌కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు సమర్పించి ఇతర రాష్ట్రాల వారికి విక్రయించిన ఘటనలో ఆర్‌టీఏ అధికారుల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలను పోలీసులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో వారి బాగోతాల చిట్టాలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. 
అధికారులు సీజ్‌ చేసిన లారీల ఛాసీలు 

బీఎస్‌4 పేరుతో అక్రమాలు
– బీఎస్‌–3 శ్రేణి వాహనాలను అత్యధికంగా కాలుష్యం వెదజెల్లే వాహనాలుగా గుర్తించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 29న వాటి తయారీని నిషేధించింది. 2017 ఏప్రిల్‌ 1 తర్వాత ఈ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్‌ చేయరాదని ప్రకటించింది. 
– అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ట్రాన్స్‌పోర్టు రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుభవంతో అశోక్‌ లైలాండ్‌ కంపెనీకి చెందిన లారీలు, టిప్పర్లను కారుచౌకగా కొట్టేయాలని భావించారు. 
– జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలకు చెందిన జఠాధర ఇండస్ట్రీస్, జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీలు.. గడువు మీరిపోయి విక్రయం కాకుండా నిలిచిపోయిన 154 లారీలను నాగాలాండ్‌కు వెళ్లి అశోక్‌ లైలాండ్‌ కంపెనీ నుంచి తుక్కు(స్క్రాప్‌) కింద అతి తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. 
– ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీతో సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద తప్పుడు పత్రాలు సమర్పించి 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ తర్వాత కొన్ని లారీలను వారే నిర్వహిస్తుండగా మరికొన్నింటిని ఇతర లారీ ఓనర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్రాలతో బీమా కంపెనీలను బురిడీ కొట్టించారు. 
 
ఇలా బట్టబయలు..
– ఈ వాహనాలు రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో తొలుత 66 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్‌ లే లాండ్‌ కంపెనీకి ఏపీ రవాణా అధికారులు లేఖ రాశారు. అ కంపెనీ అదే నెల 23న పూర్తి వివరాలు పంపించింది.
– కాలం చెల్లిన బీఎస్‌–3కి చెందిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్‌ లే లాండ్‌ కంపెనీ తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ ప్రధాన రికార్డులను పరిశీలించింది. 
– ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించిన తర్వాత ఎన్‌ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్‌ రా«జధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించగా అక్రమాల డొంక కదిలింది.  
– వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్‌ లే లాండ్‌ కంపెనీ ఇన్‌వాయిస్‌లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. పైగా ఇన్‌వాయిస్‌లను మార్చి సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ పొందాయి.
– ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్‌పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్‌ లే లాండ్‌ కంపెనీలు ఆ ఇన్‌వాయిస్‌లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. 
తాడిపత్రిలో గత శుక్రవారం అధికారులు సీజ్‌ చేసిన బీఎస్‌3 టిప్పర్లు   

కేసు నమోదు
– వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో జేసీ బ్రదర్స్‌ కంపెనీపై రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. 
– జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేశారు. తదనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేస్తే దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఫిట్‌గా ఉన్నాయంటూ తప్పుడు పత్రాలు
– తుక్కు కింద బీఎస్‌–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. 
– వీటన్నింటికీ నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్‌–4 ప్రమాణాలతో ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్‌ చేయించారు. వీటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. 
– ఆయా వాహనాల ఛాసిస్‌ నంబర్లను రవాణా అధికారులు పరిశీలించగా, అన్నీ బీఎస్‌–3కు చెందినవేనని తేలింది. ఇదే విషయాన్ని అశోక్‌  లే లాండ్‌ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధరించారు. 
– దీంతో 154 వాహనాల లావాదేవీలు నిషేధించేందుకు రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు లేఖ రాశారు. ఇందులో 28 వాహనాలను ఇప్పటికే ఎన్‌ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ‘వాహన్‌’ డేటాబేస్‌లో అన్ని వాహనాలను బ్లాక్‌ చేయాలని కోరారు. 
– ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో 24, కర్నూలులో 3.. మొత్తం 27 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డిపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.  
– ఈ 154 వాహనాల్లో ప్రస్తుతం ఆంధ్రపదేశ్‌లో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, నాగాలాండ్‌లో 3, తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాలో, 8 నెల్లూరు, 5 చిత్తూరు, 3 కడప, 2 వాహనాలు గుంటూరు జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఇప్పటి వరకు 53 వాహనాలను సీజ్‌ చేశారు.

అక్రమాలు కప్పిపుచ్చే యత్నం 
– ప్రభుత్వం అక్రమాలను వెలికి తీయడంతో జేసీ సోదరులు వాటిని కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇటీవల జేసీ నివాసం వద్దకు వెళ్లి గొడవకు దిగారు. మరికొందరు వారి నివాసం వద్ద ధర్నా చేసిన దాఖాలాలు కూడా ఉన్నాయి.
– పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించడంతో జేసీ సోదరులు వారితో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. ఒక్కొ లారీ యజమానికి రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా 35 మందికి చెల్లించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు