‘అనంత’ సాక్షి ఆఫీస్‌ వద్ద జేసీ ప్రభాకర్‌ రెడ్డి ధర్నా

4 Mar, 2017 14:42 IST|Sakshi
‘అనంత’ సాక్షి ఆఫీస్‌ వద్ద జేసీ ప్రభాకర్‌ రెడ్డి ధర్నా

అనంతపురం : అనంతపురం సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి శనివారం ధర్నాకు దిగారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద కేసు నుంచి తనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా తప్పిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి అక్కడ హల్‌ చల్‌ చేశారు.

మరోవైపు జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యలను వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షులు శంకర్‌ నారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్‌ రెడ్డి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేతతో పాటు సాక్షి మీడియాపై నోరు పారేసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వైఖరిని సీపీఐ నేత జగదీష్‌ తప్పుబట్టారు. మీడియాను జేసీ ప్రభాకర్‌ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

కాగా కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ ఘోర బస్సు ప్రమాద ఘటనలో దోషులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను ప్రమాదం నుంచి బయట పడేయడానికి శతధా ప్రయత్నిస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వాటి నుంచి బయట పడటానికి పాట్లు పడుతున్నారు.

ప్రమాదానికి గురైన బస్సు తన పార్టీ ఎంపీది కావడం.. ఆ బస్సుకు రెండవ డ్రైవర్‌ లేకపోవడం.. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్‌ మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రతిపక్ష నేత నిలదీయడంతో మొత్తం ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. అందులో భాగంగానే సాక్షాత్తు క్యాబినెట్‌నే వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై ఎదురు దాడికి దిగారు.
 

మరిన్ని వార్తలు