మురళి వలలో బాధితులెందరో..

12 Dec, 2019 10:56 IST|Sakshi
అనంతపురం జిల్లా కోర్టుకు కర్నాటి మురళీధర్‌ రెడ్డి (వృత్తంలో) ని తీసుకెళుతున్న పోలీసులు

ఒక్కొక్కటిగా బయట పడుతున్న వైనం

కడప అర్బన్‌ : చక్రాయపేట మండల టీడీపీ నాయకుడు కర్నాటి మురళీధర్‌ రెడ్డిని మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలపై బెయిల్‌ మంజూరైంది. ఇసుకచింతలపల్లి గ్రామానికి చెందిన మురళీధర్‌ రెడ్డి ఉద్యోగాల పేరిట వంచించారని కొందరు బాధి తుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు మంగళవారం తీసుకెళ్లిన సంగతి తెలిసింది. కాగా సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబుతో పరిచయం ఉందంటూ సొంత మండలంలోని కొంతమంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మో సం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన బాగోతం సాక్షిలో ప్రచరితం కావడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సురభికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి ప్రమోషన్‌ కోసం రూ. 1.50 లక్షలు తీసుకున్నారనే ఆరోపణ ఉంది. మైదుకూరుకు చెందిన ఓ ఉద్యోగి కూడా ఇలాగే సమర్పించుకున్నాడు. మారెళ్లమడకు చెందిన సమీప బంధువు కుమారుడికి సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగం కోసం అక్షరాలా రూ. 8 లక్షలు తీసుకుని ఉద్యోగంలో చేర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఓ వ్యక్తి  నుంచి రూ. 3లక్షలు తీసుకున్నారనీ ఆరోపణలున్నాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ స్థాయి అధికారి కడప, మదనపల్లెల్లో పనిచేశారు. ఈ సమయంలో వాయల్పాడులో ఉన్న మురళీధర్‌ రెడ్డి బంధువు ఒకరు, అక్కడికి సమీపంలోని తరిగొండకు చెందిన మిత్రునితో కలిసి సదరు ఇంజినీరుపై ఏసీబీ కేసు కొట్టివేయించేందుకు రూ.40 లక్షలు వసూలు చేశారు.  ముగ్గురు పంపకాలు చేసుకున్నారని  తెలిసింది. ఏసీబీ కేసు కొట్టివేయకపోగా  బాధిత ఇంజినీరు రిటైరై వరంగల్‌లో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం కడప డివిజన్‌ పరిధిలో ఎంపీడీఓగా పనిచేస్తున్న అధికారికి ప్రమోషన్‌ ఇప్పిస్తామంటూ  లక్షరూపాయలు అడ్వాన్సుగాతీసుకున్నారని సమాచారం. చిత్తూరు జిల్లాలో అనేకమంది బాధితులు ఉన్నట్లు భోగట్టా. ముద్దనూరు మండలంలోనూ మోసపోయిన వారున్నారు. ఈ వ్యవహారంపై బాధితులు తమకు న్యాయం చేయాలనీ అనంతపురం జిల్లా ఎస్పీని ఆశ్రయించనున్నట్లు తెలిసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా