చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు

27 Aug, 2019 08:48 IST|Sakshi
సరుబుజ్జిలి మండల పరిషత్‌ ఉద్యోగులను బెదిరిస్తున్న మాజీ విప్‌ కూన రవికుమార్‌

ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయండి..

టీడీపీ కార్యకర్తల పనులు చేయకపోతే ఖబడ్దార్‌

ప్రభుత్వ ఉద్యోగులపై  శివాలెత్తిన మాజీ విప్‌ కూన

సాక్షి, సరుబుజ్జిలి: ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మాజీ విప్‌ కూన రవికుమార్‌ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులను చెట్టుకు కట్టి కాల్చేస్తామని ఎంపీడీఓ దామోదరరావుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు చెప్పిన పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవని మండల ప్రత్యేకాధికారి నంబాళ్ల దామోదరరావు సమక్షంలో మండల పరిషత్‌ ఉద్యోగులను హెచ్చరించారు. మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల సమావేశం అనంతరం మండల పరిషత్, తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందిపై ఆయన సోమవారం శివాలెత్తారు. ముందుగా మండలపరిషత్‌ కార్యాలయంలోకి పార్టీ కార్యకర్తలతోపాటు ప్రవేశించారు. మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీకు కేటాయించిన చాంబర్‌లోకి కార్యకర్తలతో సహా తలుపులు తోసుకొని ప్రవేశించారు.

దీంతో చాంబర్‌కు గల డోర్‌ బీడింగ్‌ కొంతమేర పాడయింది. ఎంపీపీ చాంబర్‌లోకి వెళ్లిన రవికుమార్‌ సిబ్బందిని వరుసగా పిలిపించుకొని వ్యక్తిగత దూషణలకు తెగబడ్డారు. పదవులు లేకపోయినా చాంబర్‌ను ప్రజాప్రతినిధులకు ఎలా ఇస్తున్నారని, వెంటనే తాళాలు వేసి మీ చేతుల్లోకి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు.  గ్రామ వలంటీర్ల విషయంలో నిబంధనలు పాటించకుండా ఏవిధంగా మంజూరు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రాజకీయాలు చేయాలని చూస్తే మీ భరతం పడతానని మండల పరిషత్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ జి.వి.అప్పలనాయుడు, జూనియర్‌ అసిస్టెంట్‌ నవీన్‌కుమార్‌పై ఉవ్వెత్తున లేచారు. మార్పు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

భయాందోళనలో అధికారులు..
మాజీ విప్‌ అధికారులను ఇష్టారాజ్యంగా దూ షించడంతో సిబ్బంది భయాందోళనకు లోనయ్యారు. పత్రికల్లో రాయలేని భాషను మాజీ విప్‌ వినియోగించడంతో సిబ్బంది తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తె లియక తమ గదుల్లో మౌనంగా ఉండిపోయా రు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, ఈ వ్యవహార సరళి మారకపోతే ఉద్యోగాలు చేయలేమ ని సిబ్బంది వాపోయారు. అర్హత లేకపోయినా విచారణ చేయకుండా పింఛన్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయమని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. గ్రామ వలంటీర్ల నియామకాన్ని పారదర్శకంగా చేసినప్పటికీ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

సీఐ విచారణ..
ఈ ఘటన గురించి సమాచారం అందడంతో ఆమదాలవలస సీఐ బి.ప్రసాదరావు మండలపరిషత్‌ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ చాంబర్‌ను  పరిశీలించారు. ఎంపీడీఓ, జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్లను విచారించారు. జరిగిన యదార్థ విషయాలను తెలుసుకున్నా రు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు సురవరపు నాగేశ్వరావు, పున్నపురెడ్డి తవిటినాయుడు, బెవర మల్లేశ్వరావులను అక్కడ జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఎంపీడీవో దామోదరరావు సీఐకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు