ఆగని టీడీపీ నేత ‘కూన’ ఆగడాలు

28 Jun, 2020 09:46 IST|Sakshi

మూడు కేసుల్లో బెయిల్‌... అయినా మారని తీరు

తాజాగా టీడీపీ కార్యాలయ అద్దె భవనాన్ని ఖాళీ  చేయమన్నందుకు వార్నింగ్‌

మరింత రెచ్చిపోతూ ఫోన్‌లోనే బెదిరింపులు

రోజురోజుకూ వివాదాస్పదమవుతున్న రవికుమార్‌ వ్యవహార శైలి 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ తన పంథా మార్చుకోవడం లేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అరెస్టై... బెయిళ్లతో బయట తిరుగుతున్న రవికుమార్‌.. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా ఫోనుల్లోనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇక తన మాట వినని వారు ఎదురుగా కనబడితే ఇంకెంత దురుసుగా వ్యవహరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తనను ఎవరేం చేయలేరు... మహా అయితే కేసులు పెడతారు... బెయిల్‌పై వచ్చేయవచ్చు అనే ధోరణితో రెచ్చిపోతున్నారు. జిల్లాలో వివాదాస్పద నాయకుల్లో తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా కూన రవికుమార్‌ వ్యవహరిస్తున్నారు.  

ఇంటి యజమానికి బెదిరింపు 
పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లోనే వారి్నంగ్‌ ఇచ్చారు. ‘నేను ఖాళీ చేయను. నువ్వు మర్యాదగా బిహేవ్‌ చేస్తే పరవాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంద’ని బెదిరించా రు. తన ఇబ్బందుల గురించి ఆలోచించమని గుడ్ల మోహ న్‌ అడిగితే ‘నాకనవసరం, నీ గురించేంటి తొక్క.. ఆలోచించేద’ని కూన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సరే మీ ఇష్టం సార్‌’ అని గుడ్ల మోహన్‌ అంటూ ఉండగా ‘నువ్వు గాని మర్యాద తప్పి ప్రవర్తిస్తే నేనూ మర్యాద తప్పుతాన’ని మళ్లీ బెదిరించారు. ‘మీరు ఏది చేస్తే అది చేసేయండి.. చంపేస్తే చంపేయండి సార్‌’ అని గుడ్ల మోహన్‌ అనడంతో ‘అంతే చేస్తాను. నువ్వు గనక బిల్డింగ్‌ దగ్గరకు వస్తే అంతే చేస్తా’ అని ఫోన్‌ కాల్‌ ముగించారు.


మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఖాళీ చేయనని చెబుతున్న భవనం ఇదే.. (ఇన్‌సెట్‌) గుడ్ల మోహన్, భవన యజమాని  

ఈ ఫోన్‌ సంభాషణ చూస్తుంటే రవికుమార్‌కు ఏదైనా ఇస్తే.. మళ్లీ తిరిగి తీసుకోవడం కష్టమే’ అన్న భావన కలిగించడంతోపాటు ఇచ్చినదేదైనా వదులుకోవల్సిందే అన్నట్టుగా స్పష్టమవుతోంది. పొరపాటున ఎవరైనా తనకు గాని, తన అండ ఉన్న వారికి గాని ఇళ్లు గాని ఏదైనా చేబదులు గానీ ఇస్తే అంతే సంగతులు అనుకునే పరిస్థితి కనబడుతోంది. మొన్నటి వరకు మండల స్థాయి అధికారులను బెదిరించిన సంఘటనలు చూశాం. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఆయనెప్పుడు ఎవర్ని ఏమంటారో.. ఏం చేస్తారో.. తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్టుగానే నడుచుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడే ఇలా వ్యవహరిస్తున్నారంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత రెచ్చిపోయేవారో అర్థం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.  

అది నోరు కాదు... 
పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీకి వార్నింగ్‌‌ ఇచ్చారు. ఆఫీసులోనే ‘తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తానం’టూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కురీ్చలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్‌ భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీపై అంతెత్తున లేచారు. ‘నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా...’ అంటూ తీవ్ర ఆగ్రహావేశాలు చూపించారు. మొన్నటికి మొన్న మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహశీల్దార్‌కు బెదరింపులతోపాటు బ్లాక్‌మెయిల్‌కు దిగారు.

‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లయింట్‌ చేస్తాను. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్‌ గురించి నాకు చెబుతున్నావా?’ అంటూ రాయలేని భాషలో ఒక మండల మేజి్రస్టేట్‌గా ఉన్న పొందూరులో పనిచేసిన తహసీల్దార్‌ను ఇష్టారీతిన మాట్లాడారు. తాజాగా ఒకప్పుడు తనకు సన్నిహితునిగా ఉన్న గుడ్ల మోహన్‌ అనే వ్యక్తి తన భవనాన్ని ఖాళీ చేయమన్నందుకు నోటికొచ్చినట్టు మాట్లాడి బెదిరింపులకు దిగారు. తనతోపాటు లేరని, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో ఉన్నారనే అక్కసో మరేంటో తెలియదు గాని భవనం ఖాళీ చేయమన్నందుకు దురుసుగా మాట్లాడారు. ఈ రకంగా తరచూ బెదిరింపులకు దిగడంతో స్థానికులు భయపడుతున్నారు. కూన రవికుమార్‌ అంటేనే హడలెత్తిపోతున్నారు. ఉద్యోగులైతే మరింత ఆందోళన చెందుతున్నారు. ఎన్ని కేసులు నమోదైనా తన తీరు మారలేదని బాధితులు వాపోతున్నారు. తప్పులు చేసి, దౌర్జన్యాలకు పాల్పడి.. పోలీసులు చర్య తీసుకోబోతే.. ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఎదురుదాడికి దిగడం, హల్‌చల్‌ చేయడం రవికుమార్‌తోపాటు ఆ పార్టీ వర్గాలకు అలవాటైపోయింది.   

కూన రవికుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు 
పొందూరు: మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనను ఫోన్లో బెదిరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గుడ్ల మోహన్‌ ఫిర్యాదు చేశారని ఎస్సై కొల్లి రామకృష్ణ తెలిపారు. మండల కేంద్రంలో గుడ్ల మోహన్‌కు చెందిన భవనంలో చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కొనసాగుతోందని చెప్పారు. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కార్యాలయం ఉందని, కొన్ని నెలల క్రితం తాను వైఎస్సార్‌సీపీలో చేరానని అందుకే పార్టీ కార్యాలయం రంగులు మార్చేందుకు ప్రయత్నించామని ఫిర్యాదులో ఉంది. భవనానికి రంగులు మారుస్తుండగా కూన రవికుమార్‌ ఫోన్‌ చేసి బెదిరించారని, బిల్డింగ్‌ వద్దకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు