అధికార పార్టీ భూ దాహం

8 Dec, 2018 13:02 IST|Sakshi

ఒంగోలులో రూ.20 కోట్ల విలువైన స్థలం పచ్చనేతల పరం

నాలుగు ఎకరాల ఎన్‌ఎస్‌పీ స్థలం స్వాహా

రెవెన్యూ పరిధిలోకి బదలాయింపు

170 మంది టీడీపీ నేతలకు పట్టాలిచ్చిన అధికారులు

ముఖ్యనేత ఒత్తిడితో ఒక్కో నాయకుడికి రెండుసెంట్ల కేటాయింపు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఇరవై కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే నాలుగు ఎకరాల నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) స్థలాన్ని అధికార పార్టీ నేతలు కాజేశారు. ఒంగోలుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు సదరు స్థలాన్ని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. పేదలకు ఇంటి పట్టాల పంపిణీ పేరుతో విలువైన స్థలాన్ని ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున కేటాయించారు. పూర్తి వివరాల్లోకెళ్తే...

ఒంగోలు నగర పరిధిలోని కేశవరాజుకుంటలో 178తో పాటు 180 నుంచి 185 వరకు గల సర్వే నంబర్లలో నాలుగు ఎకరాలకుపైగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు స్థలం ఉంది. 40 ఏళ్ల క్రితం సాగర్‌ కాలువ తవ్వకానికంటూ అప్పట్లో అధికారులు సదరు పొలాన్ని రైతుల నుంచి సేకరించారు. అయితే, ఆ పొలంలో కాలువ తవ్వకం జరగలేదు. దీంతో స్థలం ఖాళీగానే ఉంది. ఒంగోలు నగరం విస్తరించడంతో ఇప్పుడు ఆ స్థలం దాదాపు నగరం నడిబొడ్డుకు చేరింది. ఎంతో విలువైన ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు, కార్యకర్తలకు స్థలాన్ని పంచిపెట్టాలంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై నేతలు ఒత్తిడి పెంచారు. దీంతో ఆ స్థలాన్నికార్యకర్తలకు పట్టాలుగా ఇవ్వాలంటూ అధికారులపై ప్రజాప్రతినిధి ఒత్తిడి పెంచారు. ఆ స్థలం నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఉండడంతో రెవెన్యూ అధికారుల సూచన మేరకు ల్యాండ్‌ కన్వర్షన్‌కు సిద్ధమయ్యారు.

సదరు స్థలం పొజిషన్‌పై రెవెన్యూ ఉన్నతాధికారులు ఎన్నెస్పీ అధికారులను నివేదిక కోరారు. సదరు స్థలంలో కాలువ తవ్వలేదని, ఆయకట్టు కూడా లేదని ఎన్నెస్పీ అధికారులు నో అబ్జక్షన్‌ నివేదిక సమర్పించారు. దీంతో వేగంగా పావులు కదిపిన అధికార పార్టీ నేతలు.. పైస్థాయిలో తంతును పూర్తి చేశారు. సదరు స్థలాన్ని యుద్ధప్రాతిపదికన రెవెన్యూకు బదలాయించారు. అధికార పార్టీకి చెందిన దాదాపు 140 మందికి ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున సదరు స్థలాన్ని కేటాయిస్తూ మూడు నెలల క్రితం ఒంగోలు తహసీల్దార్‌ పట్టాలు ఇచ్చారు. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు ఆ పట్టాలకు పొజిషన్‌ చూపించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆ స్థలం విలువ గది దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది. ఈ లెక్కన సెంటు 6 లక్షల రూపాయలపైనే విలువ చేస్తుంది. ఆ ప్రకారం ఎకరా రూ.6 కోట్ల చొప్పున నాలుగు ఎకరాల విలువ దాదాపు రూ.25 కోట్లు. విలువైన సాగర్‌ స్థలాన్ని అర్హులైన పేదలకు కాకుండా అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహారాలు నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పట్టాలిచ్చింది నేను కాదు : ఎన్నెస్పీ స్థలం పట్టాల పంపిణీ విషయం పూర్తిగా నాకు తెలియదు. నేను రాకముందే సదరు సర్వే నంబర్లలో పట్టాలిచ్చి ఉన్నాయి. ఒకటీరెండు ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి. ఆ స్థలంలో ఎవరెవరికి పట్టాలిచ్చారన్న విషయాన్ని పరిశీలిస్తున్నా.ఒంగోలు తహసీల్దార్‌ బ్రహ్మయ్య

ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలకు అప్పగించడం దుర్మార్గం : సింగరాజు వెంకట్రావు
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు చెందిన విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని అధికార పార్టీ నేతలకు ఇళ్ల స్థలాల పేరుతో పట్టాల కింద అప్పగించడం దుర్మార్గపు చర్య అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు విమర్శించారు. సదరు స్థలాన్ని ఆ పార్టీ నేతలు రామానాయుడు, శంకర్, జలీల్, రఫీ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలన్నింటినీ స్వాహా చేస్తున్న అధికార పార్టీ నేతలు విలువైన ఎన్నెస్పీ స్థలాన్ని కూడా స్వాహా చేశారని వారు విమర్శించారు. ఇళ్ల స్థలాలు లేని వేలాది మంది పేదలు స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకుని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు