ఓ రాజు.. ఓ నాయుడు

3 Jul, 2017 04:09 IST|Sakshi
ఓ రాజు.. ఓ నాయుడు

భూ కుంభకోణంలో గజపతినగరం ఎమ్మెల్యే హస్తం!
ట్యాంపరింగ్‌ కింగ్‌ సుధాకర్‌ రాజుతో కె.ఎ.నాయుడుకి సంబంధాలు
విశాఖవ్యాలీ స్కూల్‌ వెనుక భూములతో పాటు మరిన్ని భూముల ఆక్రమణ
ఎమ్మెల్యే, మంత్రుల అండదండలతో  చక్రం తిప్పిన సుధాకర్‌ రాజు


సాక్షి ప్రతినిధి, విజయనగరం: మద్యం మాఫియా.. భూ మాఫియా.. కాల్‌ మనీ.. ఇసుక దందా.. మైనింగ్‌ దందా ఇలా రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా, ఏ అక్రమం వెలుగు చూసినా దానిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉంటోందన్నది ప్రజల మాట. తాజాగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ భూ కుంభకోణంలో ట్యాంపరింగ్‌ కింగ్‌ సుధాకర్‌రాజుతో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుకు ఉన్న సంబంధాలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌గా పనిచేస్తూ డీఎస్పీనంటూ దందాలు చేసి ఉద్యోగం పోగొట్టుకొని రియల్టర్‌ అవతారమెత్తి భూ దందాలకు పాల్పడిన చేకూరి సుధాకర్‌రాజు అలియాస్‌ చింతాడ సుధాకర్‌ రాజును భూ రికార్డుల ట్యాంపరింగ్‌  కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆయన వెనుక టీడీపీకి చెందిన కొందరి పెద్దల హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు పేరు బయటకొచ్చింది.

దందాయే ఎజెండాగా..
ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు నకిలీ పత్రాలను సృష్టించి అధిక ధరలకు విక్రయించి కోట్ల రూపాయలు గడించిన సుధాకర్‌ రాజు ఆ తరువాత రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు. వారి అండతో మరిన్ని ప్రభుత్వ, ప్రైయివేటు భూములను ఆక్రమించడం, రికార్డులను ట్యాంపర్‌ చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు, పాస్‌ పుస్తకాలు సృష్టించడం నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. అక్కడితో ఆగక కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో  కుటుంబ పరమైన సంబంధాలను ఏర్పర్చుకున్నాడు. అలా ఆయన కుటుంబానికి దగ్గరైన వారిలో గజపతినగరం ఎమ్మె ల్యే కె.ఎ.నాయుడు ప్రథముడన్నది సమాచారం.

విశాఖవ్యాలీ స్కూల్‌ వెనుక సర్వే నంబర్‌ 124లో 24.05 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి అమ్మేస్తానంటూ బేరాలు పెట్టిన  సుధాకర్‌రాజు ఆ భూమి తనకు విజయనగర రాజుల ద్వారా సంక్రమించిందని చెప్పుకునే వాడు. అయితే, వాస్తవానికి ఆ భూమితో పాటు రుషికొండ, మధురవాడ, విశాఖనగరంలో పలు భూములను ఆక్రమించుకొని విక్రయించడం వెనుక టీడీపీ ఎమ్మె ల్యే హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సుధాకర్‌రాజు కుటుంబంతో కె.ఎ. నాయుడుకు ఉన్న సంబంధాలు జిల్లా వ్యాప్తంగా గతంలోనే చర్చనీయాంశమయ్యాయి. అవి భారీ కుంభకోణంలో భాగస్వామ్యం అయ్యేంత వరకు సాగాయనేది తాజా గా వెలుగులోకి వస్తోంది. కె.ఎ.నాయుడు ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని, ఇప్పటికే  అధిష్టానానికి పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు.

ఆయన తండ్రి పైడితల్లినాయుడు పేరును చెడగొడుతున్నాడని జనం దుమ్మెత్తి పోస్తున్నారు. అంగన్‌వడీ పోస్టులు అమ్ముకోవడం దగ్గర నుంచి  రైస్‌ పుల్లింగ్‌ కాయిన్స్‌  నిందితులతో సంబం« దాల వరకు ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి.  సంక్షేమ నిధులను సొంతానికి  వాడుకోవడం, ఉద్యోగాల పేరుతో  సొమ్ములు దండుకోవడం, కోట్ల రూపాయలు అప్పు చేసి  ఎగ్గొట్టడం ఆయనకు నిత్య కృత్యమని జనం కోడైకూస్తున్నారు. వీటన్నింటినీ మించి ట్యాంపరింగ్‌ కింగ్‌  సుధాకర్‌ రాజుతో  సంబంధాలు బయటపడటం సంచలనమౌతోంది.

 టీడీపీకి చెందిన విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రధాన అనుచరుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోకాడ జగన్నాథంనాయుడు పేరు భూము ల ట్యాంపరింగ్‌ భాగోతంలో ఇటీవల బయటపడటం, ఆ జాబితాలో ఉన్న పేరు తనది కాదని ఆయన చెప్పుకోవడం తెలిసిందే. అయితే, విశాఖలోని కొమ్మా ది గ్రామ పరిధిలో 30/2 సర్వే నంబర్‌లో 12 ఎకరా లు, 140/పి సర్వే నంబర్‌లో 10 ఎకరాలకు సంబం ధించిన భూ రికార్డులు ట్యాంపరింగ్‌ అయ్యాయి. ఈ భూములు జగన్నాథంనాయుడు పేరు మీద రికార్డుల్లోకి చేరాయి. ఆయన  సోదరి భర్త భూమిరెడ్డి జగన్నాథకుమార్‌ పేరు మీద కూడా సర్వే నంబర్‌ 29/2 లో 7.24 ఎకరాలు ఉన్నాయి.   ఈ కుంభకోణంలో తమకు సంబంధం లేదని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగానే గజపతినగరం ఎమ్మెల్యే భాగోతం బయటకొచ్చింది. దీనిపై జిల్లా టీడీపీతో పాటు  అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు