అయితే ఓకే.. సొమ్ము చేసుకో!

31 May, 2017 11:01 IST|Sakshi
అయితే ఓకే.. సొమ్ము చేసుకో!

► రాజధానిలో భూగర్భ విద్యుత్‌ వ్యవస్థకు ముఖ్యనేత అడ్డు చక్రం
► సన్నిహితుడైన ప్రజాప్రతినిధికి లబ్ధి చేకూరేలా ట్రాన్స్‌కో విధానాన్నే మార్చేసిన వైనం
► తాత్కాలిక అవసరాలు తీర్చే ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు ఆమోదం
► ఆ ఎమ్మెల్యేకే కాంట్రాక్టు దక్కాలని ఆదేశం


సాక్షి, అమరావతి బ్యూరో : ఆవు చేలో మేస్తుంటే... దూడ గట్టున మేస్తుందా ... అన్న చందంగా తయారైంది రాజధాని అమరావతి నిర్మాణ ప్రహసనం. అమరావతి నిర్మాణం పేరిట ప్రభుత్వ ముఖ్యనేత కుటుంబం రూ.వేల కోట్లు వెనకేసుకుంటుంటే... టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లు బొక్కేయడానికి బరితెగిస్తున్నారు. అందుకే రూ.1,450 కోట్లు వెచ్చిస్తే శాశ్వత ప్రయోజనాన్ని అందించే భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ట్రాన్స్‌కో ప్రణాళికను ముఖ్యనేత బుట్టదాఖలు చేశారు. తాత్కాలిక అవసరాలు తీర్చే ఓవర్‌హెడ్‌ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు రూ.525 కోట్లతో ఆమోదించారు. పైగా తరువాత మళ్లీ భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చులే అని సెలవిచ్చారు కూడా.

విజయవాడకు చెందిన తనకు సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్యేకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చేందుకే ఆయన ఇలా చేశారు. ట్రాన్స్‌కో వర్గాలను  విస్మయానికి గురిచేస్తున్న ఈ కాంట్రాక్టు కథాకమామిషు ... ప్రతిపాదిత రాజధాని అమరావతిలో భూగర్భ కేబుల్‌ విద్యుత్తు వ్యవస్థను నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతం గుండా భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం అందుకు ప్రణాళికను ట్రాన్స్‌కో ఆమోదించింది. రూ.1,450 కోట్లతో టెండర్లు ప్రక్రియ చూడా చేపట్టింది.

మాకేంటంటా...ఒప్పుకోం :  ఎమ్మెల్యే ఆగ్రహం
భూగర్భ విద్యుత్తు వ్యవస్థ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విజయవాడకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులపై ఆయన సంస్థ కన్నేసింది. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ నిర్మించే సామర్థ్యం ఆ సంస్థకు లేదు. దీంతో టెండర్లలో ఆయన సంస్థ పాల్గొనలేదు. అదే ఓవర్‌హెడ్‌ కేబుళ్లను అయితే ఆ ఎమ్మెల్యే సంస్థ నిర్మించగలదు. అందుకే ఆయన భూగర్భ విద్యుత్తు వ్యవస్థ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మీకు నచ్చినట్టు విధాన  నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా.. ప్రజాప్రతినిధులుగా మేం ఉండీ ఏం లాభం? అసలు భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఎందుకు?  రాజధాని ఇప్పటికప్పుడు కట్టేయరు కదా... ప్రస్తుతానికి ఓవర్‌హెడ్‌ కేబుళ్లు వేస్తే చాలు. అలా చేయండి’ అని అల్టిమేటం ఇచ్చారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో ఆ ఎమ్మెల్యే సీఎం కార్యాలయం వద్దే పంచాయితీ పెట్టారు.

అడ్డగోలుగా లబ్ధి
తనకు సన్నిహితుడైన ప్రజాప్రతినిధికి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చడానికి  ముఖ్యనేత ఏకంగా ట్రాన్స్‌కో విధాన నిర్ణయాన్నే మార్చేశారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టేయమని ట్రాన్స్‌కోను ఆదేశించారు. ‘ప్రస్తుతం నిధుల సమస్య ఉంది. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ వద్దు... ఓవర్‌హెడ్‌ కేబుళ్లు వేయండి. అందుకు ప్రణాళిక సిద్ధంచేసి టెండర్లు పిలవండి’ అని స్పష్టం చేశారు. నాణ్యత పరంగానే కాకుండా బడ్జెట్‌ పరంగా కూడా భూగర్భ విద్యుత్తు వ్యవస్థే ఉత్తమమైనదని ముఖ్యనేతకు చెప్పేందుకు ట్రాన్స్‌కో అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఓవర్‌హెడ్‌ విధానంలో 220 కేవీ ఓవర్‌హెడ్‌ కేబుళ్లు నాలుగు లైన్లు ఓ వైపు వేసేందుకు రూ.150కోట్లు, 400 కేవీ లైన్లు నాలుగు మరోవైపు వేసేందుకు రూ.375కోట్లు ... వెరసి రూ.525 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. కానీ అది తాత్కాలిక ప్రయోజనాలనే అందిస్తుంది. కొన్నేళ్ల తరువాత భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయకతప్పదు. అదే ఇప్పుడే రూ.1,450 కోట్లతో భూగర్భ విద్యుత్తు వ్యవస్థ నిర్మిస్తే శాశ్వత ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇదే విషయాన్ని ముఖ్యనేతకు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్లుగా ఓవర్‌హెడ్‌ లైన్లు వేయాలని... ఆ కాంట్రాక్టు ఆయనకే దక్కేలా చూడాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు