పోలీసులకు టీడీపీ నేత విందు

30 May, 2020 10:33 IST|Sakshi
జుంజురాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో విందు భోజనం చేస్తున్న పోలీసులు ,పోలీసులకు వడ్డిస్తున్న టీడీపీ నాయకుడు లచ్చన్న చౌదరి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ సీజ్‌

విచారణకు వచ్చిన పోలీసులకు టీడీపీ నేత విందు

ప్రశ్నించిన పేరెంట్స్‌ కమిటీ సభ్యులపై ఆగ్రహం

రాయదుర్గం రూరల్‌: రాయదుర్గం ప్రాంతంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ విక్రయాలను అరికట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ఏర్పాటు చేసింది. సెబ్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ అక్రమార్కులకు చెక్‌పెడుతున్నారు. అయితే మూడు రోజుల కిందట రాయదుర్గం మండలం జుంజురాంపల్లి సమీపంలోని వేదావతి హగరి వద్ద గల రీచ్‌ నుంచి టీడీపీ నాయకుడు వీరేష్‌కు చెందిన ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్‌ చేశారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు తమ గ్రామంలోని ఇసుకను తమ అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను కలిసి కోరారు.(ఇసుకకు ఇక్కట్లే!)

విచారణకు వచ్చి విందు..
డీఎస్పీ వెంకటరావు జుంజురాంపల్లికి విచారణ నిమిత్తం వచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసి ఉన్న ప్రభుత్వ పాఠశాల తలుపును టీడీపీ నేత విజయసింహచౌదరి (లచ్చన్న) తెరిపించి, అక్కడ డీఎస్పీ, సిబ్బందికి విందు ఏర్పాటు చేసి.. స్వయంగా వడ్డించారు. టీడీపీ నేతల ఇసుక దందా సజావుగా సాగేలా చూడాలని పోలీసు అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు తెలిసింది. 

అభ్యంతరం తెలిపిన వారిపై ఆగ్రహం
అనధికారికంగా పాఠశాల తలుపులు తెరిచి విందు ఏర్పాటు చేయడంపై పేరెంట్స్‌ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఏమైనా జరిగితే ప్రజలు తమను నిలదీస్తారని, ఇలా చేయడం మంచిది కాదని చెబితే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడి వారిని వెనక్కు పంపారు. అక్రమ ఇసుక రవాణా, దందాను అరికట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాంత పోలీసులు గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఈ విషయమై డీఎస్పీని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇసుక అక్రమ రవాణాపై విచారణ నిమిత్తం జుంజురంపల్లి గ్రామానికి వచ్చినది వాస్తవమేనని, మధ్యాహ్నం వేళ అక్కడే భోజనం కూడా చేశామని చెప్పారు.  

మరిన్ని వార్తలు