మైనారిటీ రుణాలపై..  అధికార పెత్తనం

30 Dec, 2018 08:09 IST|Sakshi

కర్నూలు నగరంలోని ఖడక్‌పురాకు చెందిన మైమున్‌ బేగం (బాధితురాలి విన్నపం మేరకు పేరు మార్చాం) శారీ బిజినెస్‌ కోసం రూ.లక్ష రుణం కావాలని దరఖాస్తు చేసుకుంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు కూడా అంగీకరించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆమె మైనారిటీ కార్పొరేషన్, మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉంది. అయితే..ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. అధికార పార్టీ నేతల సిఫారసు లేకపోవడమే ఇందుకు కారణం. కర్నూలుకు చెందిన అధికార పార్టీ చోటా నాయకుడు ఇటీవలే మైనారిటీ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లి తాను టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని, అన్న చెప్పారు.. వీరికి రుణాలు మంజూరు చేయాలంటూ పాతిక మంది పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ఇంత మందికి ఒకేసారి రుణాలు ఎలా మంజూరు చేయాలో తెలియని స్థితిలో అధికారులు తల పట్టుకున్నారు. 

కర్నూలు(రాజ్‌విహార్‌): జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి కోసం రుణాలకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారు. తాము చెప్పని వాళ్లకు రుణాలు ఇస్తే ఇక్కడ ఉద్యోగం చేసుకోలేరంటూ అధికారులను బెదిరించడానికీ వెనుకాడడం లేదు. వారి అనుచరులు, అనుయాయులకు మాత్రమే రుణాల మంజూరు కోసం సిఫారసు చేస్తున్నారు. 

2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,536 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ.46.02 కోట్ల సబ్సిడీ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం అరకొరగానే నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటివరకు రూ.16.07 కోట్లు విడుదల కాగా.. 2,269 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 2,267 మంది అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలు మంజూరైన వారిలో అత్యధిక శాతం అధికార పార్టీ నాయకుల నుంచి సిఫారసులు పొందిన వాళ్లే కావడం గమనార్హం.

మంజూరు ప్రక్రియ ఇలా.. 
మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంక్‌ లింకేజీ రుణాలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం నిర్ణీత గడువులోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్‌ కాపీ, ఇతర ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. మునిసిపాలిటీల్లో నివసించే వారైతే సంబంధిత మునిసిపల్‌ కార్యాలయం, గ్రామీణులైతే ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై దరఖాస్తుకు ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది.
 
అడిగింది ఇస్తేనే సిఫారసు 
అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసు ఉంటేనే రుణాలు మంజూరవుతున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మునిసిపాలిటీలు/ మండల పరిషత్‌ కార్యాలయాల్లో అప్రూవ్‌ కావాలంటే అధికార పార్టీ నేతల అనుమతి తప్పనిసరిగా మారింది. అక్కడ ఎలాగో చెప్పుకుని దాటి వస్తే మైనారిటీ కార్పొరేషన్‌లో పెండింగ్‌ పెడుతున్నారు. అడిగినంత ఇస్తేనే సిఫారసు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎంపీడీఓ, మునిసిపల్‌ కార్యాలయాల్లో నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఎంపిక కోసం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

ఐదేళ్లుగా అరకొరే 
జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా ఐదేళ్లుగా రుణాలు అరకొరగానే మంజూరవుతున్నాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 2,165 మందికి గాను 1,304 మంది మాత్రమే మంజూరు చేశారు. అలాగే 2014–15లో కేవలం 360 మందికి, 2015–16లో 3,863 మందికి గాను 2,262 మందికి, 2016–17లో 2,395 మందికి గాను 1,323 మందికి మంజూరు చేశారు. 2017–18లో 2,578 మందికి, 2018–19లో 4,536 మందికి గాను ఇప్పటివరకు 2,269 మందికి మాత్రమే రుణాలిచ్చారు.

మరిన్ని వార్తలు