రోడ్లపైకి వస్తేనే న్యాయం చేస్తారా?

14 May, 2018 06:49 IST|Sakshi
నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఆందోళనకారులను తోసివేస్తున్న పోలీసులు, దాచేపల్లిలో మోహరించిన పోలీసులు

దాచేపల్లిలో 12 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడి లైంగికదాడి

ఘటన వెలుగు చూసి24 గంటలు గడిచినా స్పందించని ప్రభుత్వం

ఆందోళన బాటలోప్రధాన ప్రతిపక్షం, మహిళ, కుల సంఘాలు

దాచేపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు

ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట

పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు

సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు సుబ్బయ్య లైంగికదాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే ఆ గ్రామంలోనే మరో బాలికను టీడీపీ కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మాబువలి గర్భిణిని చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. మాబువలి వ్యవహారం వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రజ, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న లైంగికదాడి బాధితురాలిని పరామర్శించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ లైంగికదాడికి పాల్పడిన వారికి అదే ఆఖరి రోజవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ నాయకుడే 12 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడితే సీఎం ఎందుకు స్పందించడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రోడ్లపైకి వస్తే కానీ స్పందించరా?
‘లైంగికదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎక్కడికి పోయింది? తమ పార్టీ నాయకుడు నిందితుడని తెలిస్తే స్పందించారా?’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కుమ్మర శాలీవాహన సంఘాల నేతలు, సీపీఐ, సీపీఎంతో పాటుగా పలు మహిళ సంఘాల నాయకులు ఆదివారం ప్రశ్నిం చారు. మాబువలిని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ దేవళ్ల రేవతి, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌ రెడ్డి, పార్టీ నాయకులు షేక్‌ జాకీర్‌ హుస్సేన్, మందపాటి రమేష్‌రెడ్డి, మునగా పున్నారావు, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్‌ షరిఫ్, ఓబీసీ మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, 50 మందికి పైగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు దాచేపల్లిలో ఆదివారం ఆందోళనకుదిగారు. నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద అద్దంకి – నార్కెట్‌పల్లి హైవేపై బైఠాయించారు. వారిని పోలీసులు వారించేందుకు యత్నించడంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు ముందుగానే దాచేపల్లి, నడికుడి కూడళ్ల వద్ద భారీగా మోహరించాయి.

మాబువలిని కఠినంగా శిక్షించాలి
బాధిత బాలిక తండ్రి ఆందోళనలో పాల్గొని తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన మాబువలిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అతడిని రక్షించేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. ఆందోళన కారులకు సర్దిచెప్పినా ఎలాంటి ప్రయోజనం లేక పోవడంతో పాటు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నారాయణపురంలో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. 

బాలికకు అన్యాయంజరిగితే పట్టించుకోరా
మహిళలు, బాలికలపై లైంగికదాడులకుపాల్పడే నీచులను భూమి మీద ఉండనివ్వబోమని తాను హెచ్చరించిన వారం రోజులకే దాచేపల్లిలో బాలికపై టీడీపీ కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మాబూవలి అకృత్యానికి పాల్పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. టీడీపీ నాయకుల అకృత్యాలను ఖండించారు. ఆందోళనలు చేస్తే తప్ప బాధిత కుటుంబానికి న్యాయం చేయరా అని ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన బాలిక కావడంతోనే ప్రభుత్వం స్పందించటంలేదా అని ప్రశ్నించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుం బానికి అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు