టీడీపీ నేత బరితెగింపు

20 Oct, 2019 08:49 IST|Sakshi
టీడీపీ నేత చదును చేయించిన ప్రభుత్వ భూమి

ప్రభుత్వ భూమి ఆక్రమణ  

ఉపాధి హామీ పథకంలో చేసిన పనులు ధ్వంసం 

అడ్డుకున్న స్థానిక రైతులు 

వీఆర్వో, తహసీల్దార్‌కు ఫిర్యాదు 

బుచ్చెయ్యపేట(చోడవరం):  మండలంలో ఎల్‌బీ పురానికి చెందిన ప్రభుత్వ భూమిని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆక్రమించాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన సుమారు రూ.15 లక్షల విలువైన పనుల ప్రాంతంలో జేసీబీతో చదును చేయించడంపై పలువురు కూలీలు,రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 109 సర్వే నంబరులో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ భూమిని కొంతమంది ఆక్రమించి అన్యాక్రాంతం చేయడంపై పలువురు కలెక్టర్‌కు, సిట్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలు మేరకు అప్పటి తహసీల్దార్‌ కె.వి.వి. శివ, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, ఏవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసికుంటామని హెచ్చరిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసికుని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు చేయించారు.

ఆరు నెలల కిందట ఇదే భూమిలో రూ.15 లక్షల వ్యయంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వందల మంది కూలీలతో ట్రెంచ్‌లు,భూమి లెవిల్‌ పనులు చేయించారు. కూలీలు చేసిన పనులకు ఇంకా ఆడిట్‌ అవలేదని వీఆర్పీ మెల్లి సత్యనారాయణ తెలిపారు.  మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆ భూమిని ఆక్రమించుకుని రెండు రోజులుగా జేసీబీతో  చదును చేయించాడు. దీంతో గ్రామానికి చెందిన రైతు సంఘ నాయకులు తమరాన శ్రీను,సింహాచలంనాయుడు,గుర్రు రామునాయుడు తదితరులు  శనివారం జేసీబీ అడ్డుకుని, వీఆర్వో త్రినాథ్‌కు, తహసీల్దార్‌  మహేశ్వరరావు, ఏపీవో, పీడీలకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఆదేశం మేరకు వీఆర్వో గ్రామాన్ని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనుల నిలిపివేయాలని తెలిపారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు