టీడీపీ నాయకుడి వీరంగం..

24 Aug, 2019 10:36 IST|Sakshi
సర్వే నంబర్‌ 302/21లో ఆక్రమణకు గురైన 2.41 ఎకరాల గెడ్డ

కర్లాం భూముల్లో ఆక్రమణలు గుర్తించిన రెవెన్యూ అధికారులు

బూతులు తిడుతూ బెదిరింపులకు దిగిన నాయకుడు

మీరేం చేయలేరంటూ దౌర్జన్యం..

భయంతో పరుగులు తీసిన అధికారులు

పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, చీపురుపల్లి: మా పొలంలోకి మీరంతా ఎందుకొచ్చారు.. మీరేం చెయ్యగలరు.. కనీసం సెంటు భూమి కూడా తీసుకోలేరు.. ప్రభుత్వమే నేను.. నేనే ప్రభుత్వం.. నా సంగతి మీకు తెలియదు.. మీరు ఏమీ ......(పత్రికల్లో రాయకూడని భాష) లేరు.. అంటూ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు అనుచరుడు, లావేరు మండలం లింగాలవలసకు చెందిన టీడీపీ నాయకుడు లెంక నారాయణరావు చీపురుపల్లి మండల రెవెన్యూ అధికారులను బెదరించాడు. కర్లాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 302/21లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ గెడ్డ, రస్తా భూములను గుర్తించేందుకు ఆర్‌ఐ, సర్వేయర్, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు శుక్రవారం సర్వే చేపడుతున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న నారాయణరావు అధికారులను తిడుతూ వీరంగం సృష్టించాడు.  అంతేకాకుండా రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ భయాందోళనలకు గురి చేసే విధంగా వ్యవహరించడంతో ఆందోళన చెందిన రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

రెవెన్యూ అధికారులను మాత్రమే కాకుండా ఆ భూముల్లో గెడ్డ, రస్తా ఆక్రమణల విషయాన్ని బయటకు తీసిన పత్రికా విలేకరులపై కూడా బూతుల పురాణం అందుకున్నాడు. అయితే ఆ భూములు ఆ టీడీపీ నేతకు చెందిన సొంత భూములు కూడా కావు. ఆయనతో పాటు అతని సోదరులు మధ్యవర్తులుగా ఉంటూ ఇతరులకు అమ్మకాలు సాగించారు. ఆ భూముల్లో ఉన్న ప్రభుత్వ గెడ్డ, రస్తా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తుంటే అసలైన భూమి యజమానులు రాకుండా, మధ్యవర్తిత్వం చేసిన ఈ టీడీపీ నేత, ఆయన సోదరులు వచ్చి రెవెన్యూ అధికారులపై హల్‌చల్‌ చేశారు. దీంతో ఆర్‌ఐ గౌతమ్, వీఆర్‌ఓ జగన్నాథం తమ విధులకు నారాయణరావు, తదితరులు ఆటంకం కలిగించారని చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 గెడ్డ, రస్తాల ఆక్రమణల పర్వం...
మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్‌ 284, 302, 304లలో 15.40 ఎకరాల జిరాయితీ భూమిని లింగాలవలసకు చెందిన టీడీపీ నేతలు లెంక నారాయణరావు, అబ్బినాయుడు, తదితరులు మధ్యవర్తిత్వం వహించి వారి బంధువులకు కొనుగోలు చేయించారు. ఆ జిరాయతీ భూముల చుట్టూ సర్వే నంబర్‌ 302/21లో 2.41 ఎకరాల గెడ్డ, 302/4లో 0.28 సెంట్లు రస్తాను కప్పేసి ఆ  జిరాయితీ భూముల్లో కలిపేసుకున్నారు. ఆ సర్వే నంబర్‌లో ఎకరా పొలం విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉండడంతో గెడ్డ, రస్తాలను కలిపేసుకునేందుకు ప్రణాళికలు రచించారు. గెడ్డ, రస్తా కలిపి 2.69 ఎకరాలు ఉండడంతో దాదాపు రూ.40 లక్షల వరకు ఆస్తి వరకు కలుస్తుందని భావించారు. అయితే గెడ్డను కప్పేయడం ద్వారా కర్లాం పరిధిలో గల పోలమ్మ చెరువుకు నీరు అందకుండా పోతుందని, దీంతో 300 ఎకరాలు ఆయకట్టు నష్టపోతుందని గ్రామస్తులు, పెద్దలు తహసీల్దార్‌కు గతంలో ఫిర్యాదు చేశారు.

మూడు రోజులుగా సర్వే..
కర్లాం భూముల్లో ఆక్రమణలపై  మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన సర్వే శుక్రవారం వరకు కొనసాగింది. చివరకు శుక్రవారం మధ్యాహ్నం ఆక్రమణలు గుర్తించిన రెవెన్యూ అధికారులు జెండాలు పాతారు. అనంతరం సరిహద్దు రైతులు, పెద్దలతో స్టేట్‌మెంట్లు కూడా రికార్డు చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న లెంక నారాయణరావు అసహనంతో ఊగిపోయాడు. రెవెన్యూ అధికారులపై చిందులేశాడు. మీరేం చేయగలరంటూ  నానా దుర్భాషలాడాడు. అధికారులను భయపెట్టేందుకు ప్రయత్నించడంతో వారు వెళ్లిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు ..
కర్లాం భూముల్లో ఆక్రమణలు గుర్తించేందుకు వెళ్లిన తమపై లెంక నారాయణరావు దుర్భాషలాడుతూ, భయాందోళనకు గురిచేశాడని ఆర్‌ఐ గౌతమ్, మండల సర్వేయర్‌ ఎంఈ సత్యనారాయణ, వీఆర్‌ఓ జగన్నాథంలు తహసీల్దార్‌ పీవీ శ్యామ్‌సుందర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారు ఉన్నత అధికారులతో చర్చించిన అనంతరం ఆర్‌ఐ గౌతమ్, వీఆర్‌ఓ జగన్నాథంలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై చీపురుపల్లి ఏఎస్సై చిన్నారావు మాట్లాడుతూ ఆర్‌ఐ గౌతమ్, వీఆర్‌ఓ జగన్నాధం ఇచ్చిన ఫిర్యాదు మేరకు లెంక నారాయణరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు