‘పల్లె’ మాయాజాలం

1 Mar, 2019 13:01 IST|Sakshi
చీరెల కోసం ఎండలో కింద కూర్చొని పడిగాపులు కాస్తున్న వృద్ధ మహిళలు

వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు గిమ్మిక్కులు

చీరల పంపిణీతో మహిళలను మభ్య పెట్టే యత్నం

ఎండలో పడిగాపులు కాసిన మహిళలు

అనంతపురం, బుక్కపట్నం: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి రాజకీయంగా స్వీయ రక్షణలో పడ్డారు. తనపై సొంతపార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో కొత్త గిమ్మిక్కులకు తెరలేపారు. ఇందులో భాగంగానే చీరల పంపిణీతో మహిళా ఓటర్లును ప్రలోభపెట్టే చర్యలకు ఇప్పటి నుంచే తెరలేపారు. ఇది కూడా సరైన వేళకు ప్రారంభం కాకపోవడంతో మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. వివరాల్లోకి వెళితే..  

నవ్యాంధ్రలో పుట్టపర్తి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఈ నాలున్నరేళ్ల కాలం పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి ఏనాడూ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరుకు సొంత పార్టీలోని వారిని సైతం నిర్లక్ష్యం చేస్తూ తానొక్కడే ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. అక్రమాలతో ప్రజాధనాన్ని మూట గట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో అతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇప్పటికే పల్లెకు టికెట్‌ ఇవ్వరాదంటూ పలువురు నేరుగా టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. తనకే టికెట్‌ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు, ఇతర నాయకులను కలిసి బుక్కపట్నంకు చెందిన పెదరాసు సుబ్రహ్మణ్యం పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, తదితరులు జిల్లా మంత్రి దేవినేని ఉమాను బుధవారం కలిసి పల్లెకు ఈసారి టికెట్‌ ఇవ్వరాదంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పల్లె సరికొత్త ఎత్తుగడలతో ప్రజల ముందుకు వచ్చారు.  

తన సతీమణి పేరిట..  
ఇటీవల ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సతీమణి ఉమ దివంగతురాలైన విషయం విదితమే. ఆమె స్మారకార్థం తన కుమారుడు, కోడలుతో కలిసి బుక్కపట్నంలో గురువారం చీరల పంపిణీ మొదలు పెట్టారు.  దీనిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయించారు. దీంతో గురువారం ఉదయం పది గంటలకు స్థానిక బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలు కావస్తున్నా.. చీరల పంపిణీ ఊసు లేకపోయింది. ఎండలోనే వృద్ధులు, మహిళలు పడిగాపులు కాశారు. చివరకు 4.30 గంటలకు ఐకేపీ అధికారులను వెంటబెట్టుకువచ్చిన పల్లె,.. వారి సమక్షంలోనే డ్వాక్రా సంఘాల లీడర్లకు వారివారి గ్రూపులోని సభ్యుల సంఖ్యను బట్టి చీరలు అందజేసి వెళ్లిపోయారు. కేవలం డ్వాక్రా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు అందజేసి, మిగిలిన వారిని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.  

మరిన్ని వార్తలు