3 పథకాలు.. రూ.375 కోట్లు!

21 Jun, 2018 07:14 IST|Sakshi

హంద్రీ–నీవాలో భాగమైన మూడు ఎత్తిపోతల పథకాల్లో ‘ముఖ్య’నేత కమీషన్ల వేట  

పనుల మంజూరుకు ముందే కాంట్రాక్టర్లతో ఒప్పందం 

అంచనా వ్యయం రూ.326.25 కోట్లు పెంపు  

అధిక ధరలకు సింగిల్‌ బిడ్‌లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు 

ఖజానాపై రూ.49.13 కోట్ల అదనపు భారం..

రూ.375.38 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి వరదలై పారుతోంది. అందినంత దండుకోవడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. తాజాగా మూడు ఎత్తిపోతల పథకాల పనులను తనకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు అప్పగించి, రూ.375 కోట్లు కొల్లగొట్టేందుకు ‘ముఖ్య’నేత స్కెచ్‌ వేశారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగమైన అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల, భైరవానితిప్ప(బీటీపీ) ఎత్తిపోతల, పత్తికొండ ఎత్తిపోతల పథకాల్లో అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, టెండర్లు పిలిచారు. అస్మదీయ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా టెండర్‌ నిబంధనలు రూపొందించారు. 

ముఖ్యనేతకు కావాల్సిన కాంట్రాక్టు సంస్థలు తప్ప ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా బెదిరింపులకు దిగారు. చివరకు అస్మదీయ కాంట్రాక్టు సంస్థలు అధిక ధరలతో సింగిల్‌ బిడ్‌లను దాఖలు చేశాయి. వాటిని ఆమోదించాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక.. నిబంధనలకు విరుద్ధమైనా సింగిల్‌ బిడ్‌లను ఆమోదించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల పథకంలో అంచనా వ్యయాన్ని రూ.205.54 కోట్లు, భైరవానితిప్ప ఎత్తిపోతల పథకంలో రూ.42.78 కోట్లు, పత్తికొండ ఎత్తిపోతల పథకంలో రూ.77.93 కోట్ల మేర పెంచేసినట్లు సాక్షాత్తూ జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ విషయంలో 2017–18 స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లను(ఎస్‌ఎస్‌ఆర్‌)ను కూడా ముఖ్యనేత పట్టించుకోలేదు. మూడు పథకాల్లో అంచనా వ్యయాలను రూ.326.25 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. 

సింగిల్‌ బిడ్‌లను ఆమోదించాలట! 
అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యనేతకు బాగా కావాల్సిన కాంట్రాక్టు సంస్థ 4.65 శాతం అధిక ధరలకు(ఎక్సెస్‌) సింగిల్‌ బిడ్‌ను దాఖలు చేసింది. బీటీపీ ఎత్తిపోతల పథకం పనులకు అధికార పార్టీ ఎమ్మెల్సీ బినామీ సంస్థ 4.32 శాతం అధిక ధరలకు బిడ్‌ దాఖలు చేసింది. పత్తికొండ ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యనేతతో అనుబంధం ఉన్న కంపెనీ 4.52 శాతం అధిక ధరలకు బిడ్‌ దాఖలు చేసింది. 

ముఖ్యనేత ఒత్తిడి మేరకు సింగిల్‌ బిడ్‌లను ఆమోదించి.. ఆయా సంస్థలకు పనులు అప్పగించాలని కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌కు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాను ఎంపిక చేసిన సంస్థలకే పనులు దక్కేలా చక్రం తిప్పిన ముఖ్యనేత.. టెండర్లను ఖరారు చేయాలంటూ సీవోటీపై ఒత్తిడి తెస్తున్నారు. సింగిల్‌ బిడ్‌ దాఖలైన టెండర్లను నిబంధనల మేరకు రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించాలి. కానీ, సింగిల్‌ బిడ్‌ దాఖలైన టెండర్లను ఆమోదించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి పెంచుతున్నారు. 

ముఖ్యనేత జేబుల్లోకి కమీషన్లు 
మూడు ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయాలను పెంచడం వల్ల అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.326.25 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. అధిక ధరలకుపనులను అప్పగించడం వల్ల అదనంగా మరో రూ.49.13 కోట్ల మేర లాభం వస్తుంది. అంటే ఖజానాపై రూ.375.38 కోట్ల భారం పడుతుంది. కాంట్రాక్టర్లతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సొమ్ముంతా కమీషన్ల రూపంలో ముఖ్యనేత జేబుల్లోకి చేరనుంది.   

మరిన్ని వార్తలు