యరపతినేని అండతో పొలం కాజేశారు

25 Aug, 2019 08:18 IST|Sakshi
కొరిమెళ్ల రమణ, బాధితురాలు 

న్యాయం చేయాలంటూ 

స్పందనలో నడికూడుకు చెందిన బాధితురాలి ఫిర్యాదు

సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండతో  పొలం కాజేశారని దాచేపల్లి మండలం నడికూడు శివారు నారాయణపురానికి చెందిన బాధితురాలు కొరిమెళ్ల రమణ శనివారం రూరల్‌ ఎస్పీ కార్యాలయంలోని స్పందన కేంద్రంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కొరిమెళ్ల రమణ మూడెకరాల పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా 2010లో పిడుగురాళ్లకు చెందిన వడ్డీ వ్యాపారి ధనలక్ష్మి ఆటో ఫైనాన్స్‌ యజమాని వడ్లమూడి బ్రహ్మానందాన్ని కలసి రూ.6 లక్షల రుణం కావాలని కోరారు. అప్పు కావాలంటే పొలం తన పేరుతో జీపీఏ చేసి ప్రతినెల తీసుకున్న అసలుకు రూ.25వేలు వడ్డీ రూపంలో చెల్లిస్తూ ఐదేళ్లలోపు అప్పు మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒప్పందం ప్రకారం బాధితురాలు 2012 జూలై వరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. మరుసటి నెల వడ్డీ చెల్లించలేక పోవడంతో బ్రహ్మానందంతో పాటు అతని కుమారుడు ఇంటికి వెళ్లి రమణను దుర్భాషలాడారు. ఎలాగైనా అప్పుతీర్చాలని నిర్ణయించుకొని మరోచోట అప్పుచేసి గ్రామ పెద్దలను తీసుకొని పిడుగురాళ్ల వెళ్లింది. అప్పు మొత్తం తీర్చుతానని లెక్క చూడాలని కోరింది. అందుకు బ్రహ్మానందం నిరాకరించి మీ పొలం తిరిగి ఇచ్చేది లేదని, నేను వేరే వాళ్లకు అమ్ముకున్నాని తేల్చిచెప్పాడు. దీంతో రమణ సమస్యను అప్పటి ఎమ్మెల్యే యరపతినేని వద్దకు తీసుకువెళితే ఆయన కూడా వారికే వత్తాసు పలికారు. నమ్మించి మోసం చేశాడని బాధితురాలు అప్పటి ఎస్పీ, డీఎస్పీ, సీఐలతో పాటు దాచేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

విషయం తెలుసుకున్న బ్రహ్మానందం యరపతినేనితో పోలీసులకు ఫోన్‌ చేయించి తదుపరి చర్యలు చేపట్టకుండా కేసును మూలన పడేయించారు. పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా ఇటీవల పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. విచారణ విషయం తెలుసుకున్న రమణ బంధువు గళ్ల నారాయణ మీరు మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అసలు విషయాలు చెపితే అందర్నీ కాల్చిపారేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు రూరల్‌ ఏఎస్పీ కె.చక్రవర్తి ఎదుట కన్నీటిపర్యంతమైంది. విచారించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే పూర్తి స్థాయిలో విచారించాలని గురజాల రూరల్‌ సీఐ కోటేశ్వరరావును ఆదేశించారు.

మరిన్ని వార్తలు